ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు తండ్రి.. నేడు తనయుడు.. సహజ వనరులను అస్మదీయులకు అప్పగింత - ఎర్రవరం

YERRAVARAM PUMPED STORAGE PROJECT: నాడు తండ్రి వైఎస్‌.. నేడు కొడుకు జగన్‌.. సహజ వనరులను అస్మదీయులకు అడ్డగోలుగా అప్పగించడంలో ఇద్దరి బాణీ ఒకటే. సొంత ప్రయోజనాల ముందు గిరిజనులు, వారి హక్కులు, రాజ్యాంగ నిబంధనలు బేఖాతరే. ఇక లబ్ధిదారులేమో..అప్పట్లో తండ్రి.. తనకు సన్నిహితుడైన పెన్నా సిమెంట్స్‌ యజమానికి విశాఖ ఏజెన్సీలోని విలువైన బాక్సైట్‌ ఖనిజ సంపదను కేటాయించేశారు. ఇప్పుడు కొడుకు అదే ఏజెన్సీలోని జలవనరుల్ని.. వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ యజమానికి.. పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టు కోసం కట్టబెడుతున్నారు. గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ స్థానికులు ఇవాళ ముంపు ప్రభావిత మండలాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు.

YERRAVARAM PUMPED STORAGE PROJECT
YERRAVARAM PUMPED STORAGE PROJECT

By

Published : Dec 17, 2022, 10:25 AM IST

Updated : Dec 17, 2022, 4:08 PM IST

YERRAVARAM PROJECT:అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్ల పీఎస్‌పీని జగన్‌ ప్రభుత్వం.. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీకి ఇటీవల నామినేషన్‌ పద్ధతిపై కేటాయించింది. దీనిపై గిరిజనుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వారు ఆందోళన బాటపట్టారు. ఐదో షెడ్యూల్‌ పరిధిలోని ఆదివాసీ గ్రామాల్లో భూములను గిరిజనేతరులకు బదలాయించడానికి వీల్లేదు. క్రయవిక్రయాలు పూర్తిగా గిరిజనుల మధ్యే జరగాలని వన్‌ ఆఫ్‌ 70 చట్టం చెబుతోంది. 1995లో అనంతగిరి మండలంలో కాల్సైట్‌ గనుల వివాదంపై సమతా స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు షెడ్యూల్డ్‌ ఏరియాలో ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరురాలిగానే భావించాల్సి వస్తుందని స్పష్టంగా పేర్కొంది. అయినా జగన్‌ ప్రభుత్వానికి లెక్కలేదు.

గిరిజన ప్రాంతంలో చేపట్టే కార్యకలాపాలకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి. సభలో సమగ్రంగా చర్చ జరిగిన తర్వాత వారి ఆమోదం ఉంటేనే ముందుకెళ్లాలని పీసా చట్టం చెబుతోంది. ఒడిశాలోని నియాంగిరి కొండను బాక్సైట్‌ కోసం వేదాంత గ్రూప్‌నకు కేటాయించినప్పుడు సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. అక్కడ గ్రామసభ నిర్వహించకుండా స్థానిక ప్రజాప్రతినిధి సంతకంతో అనుమతి చూపించడాన్ని తప్పుపట్టింది. ఆ కేటాయింపు రద్దుకు సిఫార్సు చేసింది. కానీ అవేమీ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం చెవికెక్కవు.

ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 244 (1) ద్వారా ఐదో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులు కల్పించారు. వారికి రక్షణగా భూ బదలాయింపు చట్టాలు చేశారు. వాటినీ జగన్‌ సర్కారు బేఖాతరు చేస్తోంది. ఆదివాసీల సంపదను అస్మదీయులకు అడ్డదారుల్లో దోచిపెట్టాలని చూస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించాలంటే ప్రభావిత ప్రాంతాల్లో మొదట గ్రామసభలను నిర్వహించి, వాటి ఆమోదంతోనే అనుమతులు ఇవ్వాలన్న నిబంధనను జగన్‌ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయంలో కూర్చునే... షిర్డీసాయి సంస్థకు ఏజెన్సీలో పీఎస్పీ ప్రాజెక్టుని కేటాయించేశారు. అది ఆచరణలోకి వస్తే ఏజెన్సీలోని కొయ్యూరు, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లోని కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, గిరిజనులు మూడు వేల ఎకరాల భూములు కోల్పోతారని గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చట్టాలను తుంగలోకి తొక్కి గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ముంపు ప్రభావిత మండలాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు.

వై.ఎస్‌. హయాంలో ఇదే ప్రాంతంలో 1520 హెక్టార్లలో బాక్సైట్‌ గనుల్ని తమ సన్నిహితుడు పెన్నా సిమెంట్స్‌ ప్రతాప్‌రెడ్డి భాగస్వామిగా ఉన్న రస్‌ అల్‌ఖైమా సంస్థకు అప్పగించారు. నేరుగా తవ్వకాలు చేపడితే చట్టాలు అడ్డుపడతాయని ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థను మధ్యవర్తిగా పెట్టి 224 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ను 30 ఏళ్లపాటు తవ్వుకోవడానికి అనుమతులిచ్చారు. తమకు జీవనాధారమైన పచ్చని కొండల్ని ఫలహారంగా అప్పగించడంపై నాడు గిరిజనులు భగ్గుమన్నారు. ఏళ్ల తరబడి పోరాటం చేయడంతో... పెన్నా సిమెంట్స్‌ వారు బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టలేకపోయారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ఈ బాక్సైట్‌ ఒప్పందాలను రద్దు చేసింది.

జగన్‌ ప్రభుత్వం జీవోలను రద్దుపరిచింది. మన్యంలో పరిస్థితులు సర్దుకున్నాయనుకున్న సమయంలో ఇప్పుడు అక్కడి నీటి వనరులపై సర్కారు కన్నుపడింది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు 6 వేల కోట్ల విలువైన పీఎస్‌పీ ప్రాజెక్టును నామినేషన్‌పై కట్టబెట్టింది. బాక్సైట్‌ తరహాలోనే విద్యుత్‌ ప్రాజెక్టుపైనా గిరిజనుల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసీ మొండిగా ముందుకు వెళుతోంది. ఏజెన్సీలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రయోగించి... గిరిజనుల్ని మభ్యపెట్టాలని చూస్తోంది. ఇటీవల పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రభావిత గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలతో రహస్యంగా సమావేశమై పీఎస్పీ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని సూచించినట్లు తెలిసింది.

ఎర్రవరంలో నిర్మించనున్న పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టుతో అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆయకట్టు కలిగిన తాండవ జలాశయంపై ప్రభావం పడనుంది. కొయ్యూరు, చింతపల్లి మీదుగా జలాశయంలోకి ప్రవహించే నీటి వనరుపైనే ఈ పీఎస్‌పీని నిర్మించబోతున్నారు. 0.4 టీఎంసీల సామర్థ్యంతో ఎగువ, దిగువన రెండు రిజర్వాయర్లు నిర్మించి విద్యుదుత్పత్తి చేయనున్నారు. దీనివల్ల జలాశయంలోకి వచ్చే 0.4 టీఎంసీల నీరు తగ్గిపోయే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. సుమారు 4 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం కానుంది.

షెడ్యూల్డ్డ్‌ ఏరియాలో భూములు, వనరులను గిరిజనేతరులకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి లేదని గిరిజన సంఘం జాతీయ నాయకులు అంటున్నారు. సమస్యను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని.. బాక్సైట్‌ ఉద్యమ తరహాలో మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నామని అంటున్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని.. పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.

నాడు తండ్రి.. నేడు తనయుడు.. సహజ వనరులను అస్మదీయులకు అప్పగింత

ఇవీ చదవండి:

Last Updated : Dec 17, 2022, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details