Godavari floods: గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. సోమవారం సాయంత్రానికి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ దఫా గోదావరితోపాటు శబరి నదిలోనూ వరదపోటు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. శబరిలో నీటి మట్టం గంటకు సుమారు రెండు అడుగుల చొప్పున పెరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట జనవనరుల కేంద్రం వద్ద శబరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 11.10 మీటర్లకు పెరిగింది. మొన్నటి వరదల సమయంలో కూడా ముందుగా హెచ్చరికలు లేకపోవడం వల్లనే తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు వాపోతున్నారు. ఏపీ- ఒడిశా రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి 216పై చింతూరు మండలంలోని నిమ్మలగూడెం-కుయిగూరు గ్రామాల మధ్య కిలోమీటరు మేర వరదనీరు ప్రవహిస్తోంది. ఈ మార్గం మీదుగా ఒడిశా నుంచి హైదరాబాద్, భద్రాచలం, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రాంతాలకు రాకపోకలు, సరకు రవాణా జరుగుతాయి. వరద కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఒడిశా సరిహద్దులోని కల్లేరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ వరద నీటిని దాటాల్సి వచ్చింది. అందులో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఒక ట్రాక్టరు ముందు దారి చూపుతూ వెళ్లగా, బస్సు దానిని అనుసరించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో రెండు, మూడు గంటల్లోనే సుమారు 10 సెంటీమీటర్ల వర్షం పడటంతో వరద మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. ఎటపాక మండలంలోని నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, రాయనపేట వద్ద పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద వరద నీరు ఇళ్లను ముంచెత్తి, ఆర్‌అండ్‌బీ రహదారి పైకి పోటెత్తింది.