ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Girl died with fever:మొన్న సీఎంతో చలాకీగా.. నేడు డెంగీతో విగతజీవిగా..

Girl died with fever: రెండు నెలల క్రితం సీఎంతో కలిసి ఊరంతా తిరిగిన బాలిక.. తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఏ ప్రమాదం జరిగో కాదు.. అంతు చిక్కని రోగం వచ్చీ కాదు.. కేవలం జ్వరం వచ్చి సరైన వైద్యం అందక తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన ఊరంతా విషాదాన్ని నింపింది. ఎక్కడంటే..?

Girl died
బాలిక మృతి

By

Published : Sep 1, 2022, 1:48 PM IST

Updated : Sep 2, 2022, 6:43 AM IST

పదేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలో చలాకీగా సందడి చేసిన బాలిక గురువారం డెంగీ జ్వరంతో మృతిచెందింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయిగూరు గ్రామానికి చెందిన కారం సంధ్య (10) చింతూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. జులై 27న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ చింతూరు మండలం కుయిగూరు పర్యటనకు వచ్చినప్పుడు చురుగ్గా తిరుగుతూ ఆయన దృష్టిని ఆకర్షించింది. దీంతో సీఎం దగ్గరకు పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాంటి చురుకైన బాలిక ఇంతలోనే మృత్యువాత పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె తండ్రి కల్లేరు మాజీ సర్పంచి కారం ఏసుబాబు. ఆయన కుటుంబం కుయిగూరులో నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ఏసుబాబుకు డెంగీ సోకడంతో భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కుమార్తె సంధ్య ఆయనతో పాటే ఉంది. వ్యాధి నయం కావడంతో ఏసుబాబు సోమవారం డిశ్ఛార్జి అయ్యారు. అదేరోజున బాలికకు నలతగా ఉండటంతో అక్కడే పరీక్షలు నిర్వహించి మామూలు జ్వరమేని చెప్పారు. దాంతో వారు ఇంటికి వచ్చేశారు. బుధవారం ఆమె జ్వరంతో వణికిపోతుండటంతో చింతూరు ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రైవేటు ల్యాబ్‌లో రక్త పరీక్షలు చేయగా డెంగీగా నిర్ధారించారు. భద్రాచలం వెళ్లాలని చింతూరు వైద్యులు సూచించడంతో వెంటనే అక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తిరిగి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి పరిస్థితి మరింత విషమించింది. చివరికి గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. వరదలు వచ్చిన తర్వాత విలీన మండలాల్లో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందకపోవడంతో ఈ గ్రామంలో ఐదుగురు జ్వరాలతో మృత్యువాతపడ్డారు.

Last Updated : Sep 2, 2022, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details