GADAPA GADAPA: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట పంచాయతీ కేంద్రంలో శుక్రవారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ఆ పంచాయతీ పరిధిలోని గిరిజనులు సమస్యలు ఏకరువుపెట్టారు. తమ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని.. రహదారులు, మంచినీటి, మౌలిక సదుపాయాలు లేక అల్లాడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు స్పందిస్తూ.. రహదారులు మంజూరు అయినప్పటికీ నిధులు లేకపోవడంతో నిలిచిపోయాయని చెప్పారు. కొత్త రాష్ట్రం కాబట్టి నిధులు లేవని చెప్పారు. అయినా.. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కదా అంటూ.. ఎంపీపీ, జడ్సీటీసీ సభ్యులు చెప్పడంతో.. గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంచాయతీని దత్తత తీసుకొని.. మూడేళ్ల పాలనలో ఏమి చేశారంటూ నిలదీశారు.