Muscular Dystrophy : మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో కొద్దికొద్దిగా దేహంలోని కండరాలు పట్టు సడలాయి. కండరాలు క్షీణించి కాలు కదపడం, చేతులు లేపడం లాంటివి చేయలేని పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరు అన్నదమ్ములు ఆ వ్యాధికి గురై మంచానికే పరిమితం కావడంతో ఎన్నో ఆశలతో ఇంట అడుగు పెట్టిన ఇల్లాలు.. కన్నవారు తమ దీనస్థితికి కుమిలిపోతున్నారు.
నర్సంపేట పట్టణం వల్లభ్‌నగర్‌కు చెందిన మద్దెల స్వరూప- బాలయ్య దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. బాలయ్య రైసుమిల్లులో కార్మికుడిగా పని చేస్తే స్వరూప కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషించారు. కుమార్తె కోమలకు పెళ్లి చేశారు. బాలయ్య మృతిచెందినా స్వరూప తమ ఇద్దరు కుమారులు రాజ్‌కుమార్, కమలాకర్‌కు విద్యాబుద్ధులు చెప్పించి పెద్ద చేశారు. పెద్ద కుమారుడు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చదివి తల్లికి తోడుగా ప్రైవేటుగా కరెంటు పనులు చేస్తూ ఓ దుకాణంలో పని చేశారు.
చేతికి అందికొచ్చిన పిల్లలు మంచాన పాలు: అతడికి 18 ఏళ్ల వయసు వచ్చేసరికి క్రమంగా కండరాల క్షీణత వ్యాధికి గురయ్యారు. వరంగల్, హనుమకొండ, హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తిరిగారు. చిన్న తనయుడు కమలాకర్ ఐటీఐ పూర్తి చేసి 20 ఏళ్లు నిండగానే ఈ రోగం బారినపడ్డారు. చేతికెదిగిన ఇద్దరు కుమారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మంచానికి పరిమితం కావడంతో ఆ తల్లి వేదన వర్ణనాతీతం.