తెలంగాణలో అటవీ భూములపై హక్కుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతానికిపైగా అనర్హులవే ఉన్నట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,14,353 లక్షల మంది 12,46,846 లక్షల ఎకరాల అటవీ భూముల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో దాదాపు సగం దరఖాస్తులు గిరిజనేతరులవేనని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వే, గ్రామసభలు నిర్వహించగా.. పలుచోట్ల ఆశ్చర్యం కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల సాగు చేయని భూములకూ, మరికొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల పేర్లతోనూ దరఖాస్తులిచ్చారని గుర్తించారు. కొన్ని జిల్లాల్లో 90-95 శాతానికి పైగా దరఖాస్తులు అర్హమైనవి కావని అధికారులు తెలిపారు.
పెద్దపల్లిలో 8 దరఖాస్తులకే అర్హత:పెద్దపల్లి జిల్లాలో 8,292.61 ఎకరాల భూములపై పోడు హక్కుల కోసం 4,592 దరఖాస్తులందాయి. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఏకంగా 4,584 దరఖాస్తులు ఆర్‌ఓఎఫ్‌ఆర్(అటవీ హక్కుల గుర్తింపు) చట్టం ప్రకారం అనర్హమైనవిగా అధికారులు తేల్చారు. అంటే అర్హమైనవి కేవలం 8 దరఖాస్తులే. వాటికి సంబంధించి సాగులో ఉన్న భూమి 9.19 ఎకరాలే. ఇక్కడ ఎస్టీలు 485 మంది 942.55 ఎకరాల భూమికి హక్కులు కోరగా.. ఏకంగా 4,107 మంది గిరిజనేతరులు 7,350.6 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
నాలుగో వంతు భద్రాద్రి కొత్తగూడెంలోనే:రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కుల కోసం దరఖాస్తులు రాగా.. వాటిలో ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని భూముల విస్తీర్ణమే 2,99,478 ఎకరాలుంది. అంటే దాదాపు నాలుగో వంతు. ఆ తర్వాత అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,19,903, మహబూబాబాద్‌లో 1,16,496, ఆదిలాబాద్‌లో 96,760 ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి.
కామారెడ్డి జిల్లాలో 69,210 ఎకరాలకు 27,482 దరఖాస్తులు రాగా.. ఇందులో 80 శాతానికిపైగా ఆర్‌ఓఎఫ్‌ఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. వికారాబాద్ జిల్లాలో 20,797 ఎకరాలకు 9,973 దరఖాస్తులు రాగా.. ఇందులో దాదాపు 90 శాతానికి పైగా అనర్హమైనవే ఉన్నాయని ఆ జిల్లా అటవీ అధికారి ఒకరు తెలిపారు. ఇతర జిల్లాల్లోనూ దాదాపు అవే పరిస్థితులున్నట్లు సమాచారం. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కానిస్టేబుల్ తల్లి పేరుతో మూడు ఎకరాల భూమిపై హక్కు కోసం దరఖాస్తు వచ్చింది. ఇదే జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన భార్య పేరుతో రెండెకరాలకు దరఖాస్తు చేశారు.