Allivaram in the dark: చీకట్లో చదువులు, దీపపు బుడ్డీ వెలుగులో వంట, టార్చ్ లైట్ వెలుగులో ఇంటిపనులు... పాతకాలంలో ఇలాంటి దృశ్యాలే కనిపించేవి. కానీ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని భావిస్తున్న ఈ కాలంలోనూ... ఇలాంటి పరిస్థితులే ఆ గ్రామంలో రెండ్రోజులుగా దర్శనమిస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వ నిర్వాకమే. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఏజెన్సీలోని ఆదివాసీ, గిరిజన తెగలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ వాగ్ధానంతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని అడవిబిడ్డలు సంబరపడ్డారు. ఐదేళ్లుగా సర్కార్ అందిస్తున్న సబ్సిడీతోనే కరెంటు సౌకర్యం పొందారు. ఉన్నట్లుండి మన్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలియక తల పట్టుకున్నారు. అధికారుల దగ్గరికి వెళ్తే... వారిచ్చిన సమాధానం మరింత దిగ్ర్భాంతికి గురిచేసింది. వారేం చెప్పారో వీరి మాటల్లోనే వినండి.
ప్రభుత్వ నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం అల్లివరం అంధకారంలో మగ్గుతోంది. ఐటీడీఎ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కొండ పైభాగాన ఈ గ్రామం ఉంది. ఇక్కడ 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. రహదారి లేకపోవడంతో ఘాట్ రోడ్డులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గిరిజనుల వెతలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు... చీకట్లోనే అతి కష్టమ్మీద ఈటీవీ ప్రతినిధి అక్కడికి వెళ్లారు. గిరిబిడ్డలు తమ బాధలన్నీ ఈటీవీతో పంచుకున్నారు. కరెంట్ లేక చీకట్లోనే పనులు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి మళ్లీ తమ బతుకులను ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో... వేల రూపాయల పాత బిల్లులు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.