ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

దమ్ము చూపండి.. దుమ్ము లేపండి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో యువ క్రీడాకారుల్ని అలరించేందుకు ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ సరికొత్తగా ముస్తాబైంది. అంతులేని ఆత్మవిశ్వాసం.. అసమాన నైపుణ్యం.. అద్వితీయ ప్రతిభ మీ సొంతమా..? ఐతే మరెందుకు ఆలస్యం దుమ్ము లేపేందుకు సిద్ధమవ్వండి.

eenadu-sports-league-2019
eenadu-sports-league-2019

By

Published : Dec 7, 2019, 1:06 PM IST

దమ్ము చూపండి.. దుమ్ము లేపండి

ఉరకలెత్తే ఉత్సాహం.. అంతులేని ఆత్మవిశ్వాసం.. అసమాన నైపుణ్యం.. అద్వితీయ ప్రతిభకు వేదిక ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ (ఈఎస్‌ఎల్‌). కళాశాలల క్రీడల్లో అతిపెద్ద క్రీడా సంబరమిది. 12 ఏళ్ల ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌ (ఈసీసీ) కప్‌.. మూడేళ్ల ‘ఈనాడు ఛాంపియన్స్‌’ ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఫలితమే.. ఈఎస్‌ఎల్‌. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో యువ క్రీడాకారుల్ని అలరించేందుకు ‘ఈఎస్‌ఎల్‌’ సరికొత్తగా ముస్తాబైంది. క్రికెట్‌, చెస్‌, కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌ (100 మీటర్లు, 200 మీటర్లు), బ్యాడ్మింటన్‌ క్రీడాంశాల్లో ప్రతిభావంతుల్ని వెలికి తీసేందుకు ఈఎస్‌ఎల్‌ సర్వ సన్నద్ధంగా ఉంది. ఇక మీదే ఆలస్యం. యువ ప్రతిభావంతులారా.. రండి.. దమ్ము చూపండి.. దుమ్ము లేపండి!

మార్గనిర్దేశకుడిగా గోపీచంద్‌

ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ (ఈఎస్‌ఎల్‌)కు జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ మార్గనిర్దేశకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది నుంచి గోపీచంద్‌ మార్గనిర్దేశనంలో ఈఎస్‌ఎల్‌ జరుగుతుంది. ఆటగాడిగా, కోచ్‌గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా క్రీడల్లో గోపీచంద్‌ విశేషానుభవం ఈఎస్‌ఎల్‌కు ఎంతగానో తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. ఆయన సలహాలు, సూచనలు యువ క్రీడాకారులు తమ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించేందుకు ఉపయోగపడతాయన్నది ఈఎస్‌ఎల్‌ ఆకాంక్ష.

క్రికెట్‌..

బాలుర జూనియర్‌ విభాగంలో ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ.. సీనియర్‌ విభాగంలో డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ, మెడికల్‌, ఫార్మా కళాశాలలు ఈఎస్‌ఎల్‌ క్రికెట్లో పాల్గొనవచ్చు. జిల్లా.. ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. ఫైనల్స్‌కు హైదరాబాద్‌ వేదికగా నిలుస్తుంది. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్‌ సంఘాల తరఫున మహిళల జట్లు ఈఎస్‌ఎల్‌లో పాల్గొనవచ్చు. తెలంగాణలో మాత్రం ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్‌ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి విజేతలు హైదరాబాద్‌లో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో జరుగుతుంది.

బ్యాడ్మింటన్‌.. వాలీబాల్‌..

చెస్‌, కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌ (100 మీటర్లు, 200 మీటర్లు), బ్యాడ్మింటన్‌ (సింగిల్స్‌, డబుల్స్‌) క్రీడాంశాల్లో జూనియర్‌ కళాశాలల బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, 10+2 చదువుతున్న విద్యార్థులు/ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. వయసు 16 నుంచి 19 ఏళ్లలోపు ఉండాలి. 2000 డిసెంబరు 5వ తేదీ, ఆ తర్వాత జన్మించిన వారే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు.

వయసు నిబంధనలు

బాలుర విభాగంలో జూనియర్స్‌- 18 ఏళ్లలోపు (05-12-2001న, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). సీనియర్స్‌- 24 ఏళ్లలోపు (05-12-1995న, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 12 ఏళ్లు. గరిష్ఠ వయసు 24 ఏళ్లు. (5-12-1995 నుంచి 05-12-2007 మధ్య జన్మించిన వారే అర్హులు)

ఎంట్రీల నమోదు

పూర్తిచేసిన దరఖాస్తులను డిసెంబరు 9వ తేదీలోపు సంబంధిత జిల్లాలోని ఈనాడు కార్యాలయానికి పంపాలి.
దరఖాస్తు ఫారం, మరిన్ని వివరాలుwww.eenadu.net లో చూడొచ్చు.

ABOUT THE AUTHOR

...view details