టీమిండియా బ్యాట్స్‌మెన్, బౌలర్లు చెలరేగిన వేళ ఆక్లాండ్‌లో జరిగిన రెండో టీ-ట్వంటీలో న్యూజిలాండ్‌పై భారత్ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలన్న కివీస్ ఆశలు ఆవిరయ్యాయి. 159 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో 7 బంతులు మిగిలుండగానే భారత్ పూర్తి చేసింది. కృనాల్ పాండ్య మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
రో"హిట్" షో...
గత మ్యాచ్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ముఖ్యంగా భారత ఓపెనింగ్ ద్వయం అదిరే ఆరంభాన్ని ఇచ్చింది. మొదటి వికెట్‌కు 79 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది రోహిత్-ధావన్ జోడి.
జూలు విదిల్చిన భారత ఆటగాళ్లు గత మ్యాచ్‌లో ఒక పరుగుకే వెనుదిరిగినా..ఈ మ్యాచ్‌లో అర్థసెంచరీ చేసిన రోహిత్ శర్మ భారత విజయానికి బాటలు వేశాడు.
ధావన్ 30 పరుగులు చేయగా, రిషభ్ పంత్ 40 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ధోని 20 పరుగులతో సహాకారమందించాడు.
ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేసుకుంది భారత్ జట్టు. ఆదివారం జరిగే నిర్ణయాత్మక మూడో టీట్వంటీలో గెలిచిన జట్టుదే సిరీస్.
భారత్ బౌలింగ్ అదరహో..!
గత మ్యాచ్‌లో 219 పరుగులు చేసిన ఆతిధ్య జట్టు ఈ మ్యాచ్‌లో 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. గత మ్యాచ్ హీరో టిమ్ స్టీఫర్డ్ ఈ మ్యాచ్‌లో కేవంల 12 పరుగులకే పరిమితమయ్యాడు.
కివీస్ జట్టులో ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోం మాత్రమే అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాస్ టేలర్ 42 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
భారత్ బౌలింగే ఈ రోజు మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చిన భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో రాణించారు. 28 పరుగులకు 3 వికెట్ల తీసిన కృనాల్ పాండ్య టీమిండియా విజయంలో ప్రధాన భూమిక పోషించాడు. రెండు వికెట్లతో ఖలీల్, తలో వికెట్ తీసిన భువనేశ్వర్, హార్దిక్ పాండ్య కృషిని మెచ్చుకోవాలిసిందే.
ఔటే కానీ...
కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మిచెల్ ఔటైన తీరు ఆశ్చర్యం కలిగించింది. బంతిని డిఫెన్స్ చేయగా అది ముందు బ్యాట్‌కు తగిలి తర్వాత ప్యాడ్‌కు తగిలింది. అంపైర్ ఔట్ అయినట్టు ప్రకటించాడు. న్యూజిలాండ్ రివ్యూ కోరినా అందులోనూ ఔటైనట్టు ప్రకటించారు. నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు మిచెల్. దీనిపై కివీస్ సారథి విలియమ్సన్ ఆసహనం వ్యక్తం చేశాడు.
రికార్డులు...
⦁ రోహిత్ శర్మకు ఇది టీట్వంటీల్లో 16వ అర్ధశతకం.
⦁ 2288 పరుగులతో అంతర్జాతీయ టీట్వంటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్.