తీరంలో నేడే సమరం - మ్యాచ్
కంగారూలతో భారత్‌కు 'ఖేల్' కొత్త కాదు. ఆసీస్‌ను ఎదుర్కొవడం పెద్ద సమస్య కాదు..అయినా....ఆస్ట్రేలియాతో ఆడనున్న ఈ సిరీస్‌పై అంచానాలు చాలా ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌కు ముందు ఆడనున్న సిరీస్ కావడమే ఇందుకు కారణం. భారత జట్టుకు వరల్డ్ కప్‌లో రెండు బెర్తులు కన్ఫమ్ చేసేది ఆసీస్‌తో సమరమే.
ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సమరానికి కోహ్లిసేన సిద్ధమైంది. ముందు రెండు టీ 20 ల సిరీస్‌లో భాగంగా నేడు విశాఖపట్నంలో తొలి మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై ఆడుతుండటంతో టీమిండియాకు కలిసొచ్చే అంశం. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య దూరమైనా...కోహ్లి చేరిక...బలం కానుంది. ఓపెనెర్లు రోహిత్, ధావన్‌ల జోడికి తిరుగులేదు. ధోని కూడా మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆల్ రౌండర్లు విజయ్ శంకర్, కృనాల్ పాండ్య బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటుండం జట్టుకు కలిసొచ్చేదే.
బౌలింగ్ పదునుగా...
టీ 20 సిరీస్‌కు పేసర్ భువనేశ్వర్, కుల్‌దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చినా.. భారత బౌలింగ్ బలంగానే కనిపిస్తోంది. బుమ్రా, ఉమేశ్, కౌల్, చాహల్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో కంగారూలను చాహల్ ముప్పుతిప్పలు పెట్టాడు. సొంతగడ్డపై అతడు మరింత ప్రభావం చూపడం ఖాయం.
ఆశల ఆసీస్
సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది ఆసీస్. మరోవైపు ప్రపంచకప్ కోసం జట్టులో చాలా స్థానాలకు ఆటగాళ్లను ఖరారు చేసుకోవాలి. ఆసీస్‌కు జట్టులో భర్తీ చేయాల్సిన స్థానాలు చాలానే ఉన్నాయి. కెప్టెన్ ఫించ్‌తోపాటు కొంతమంది ఆటగాళ్లు నిలకడ అందుకోవాల్సి ఉంది. బ్యాటింగ్‌లో షార్ట్.. బౌలింగ్‌లో జే రిచర్డ్‌సన్ పై భారీ ఆశలు పెట్టుకుంది కంగారూ జట్టు. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం ఆసీస్‌కు పెద్ద సవాలే.