కొందరికి ఇల్లంటే ఎన్నో కలల పొదరిల్లు! తమకున్న స్థలం చిన్నదైనా సరే చక్కటి అభిరుచితో వైవిధ్యంగా నిర్మించుకుంటారు. ఎవరైనా దాన్ని చూసి ‘వావ్’ అంటే గర్వంతో గాల్లో తేలిపోతుంటారు. మరి అలాంటి ఇళ్లని షూటింగ్‌లకూ వాడితే.. అలా చూపించినందుకు ఊహించనంత మొత్తం అద్దెగా వస్తే ఎంత బాగుంటుందో కదా! అందుకు తాము సాయం చేస్తామంటారు ఐవీ, బెంజమిన్ జాకబ్ దంపతులు. ఆ ఇద్దరే ‘ఫిల్మాపియా’ వ్యవస్థాపకులు.
ఇప్పటికే హైదరాబాద్‌లోని 20 ఇళ్లని ఇలా సినిమా షూటింగ్‌ల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇలా వందలాది నిర్మాణాలని షూటింగ్‌ల కోసం నమోదుచేసుకున్నారు. తెలుగు పరిశ్రమతోపాటూ హిందీ, కన్నడ, తమిళం, మలయాళ సినిమా పరిశ్రమల కోసం వీటిని వాడుతున్నారు. ఒక్క సినిమాలనే కాదు నెట్‌ఫ్లిక్స్, వయాకామ్, కలర్స్ వంటి బడా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల వెబ్‌సిరీస్‌లూ, సీరియళ్లకీ వీటిని అద్దెకిస్తున్నారు. మింత్రా, ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలూ తమ ప్రకటనలకి ఈ సంస్థని ఆశ్రయిస్తున్నాయి. అంత భారీ సంస్థలే కాదు... మామూలు షార్ట్‌ఫిల్మ్‌లు తీసేవాళ్లకీ తగ్గ నిర్మాణాలని చూపించి సాయపడుతున్నారు.
భలే మొదలైంది..
ఐవీ, బెంజమిన్ దంపతులది బెంగళూరు. ఐవీ మైనింగ్ సంస్థలో ఉద్యోగినిగా ఉండేవారు. ఆమె భర్త బెంజమిన్ ఓ ఐటీ సంస్థలో పనిచేస్తుండేవాడు. ఇద్దరికీ సినిమాలన్నా, పర్యటనలన్నా ఇష్టం. ఆ రెండింటినీ కలగలిపి సినిమాల్లో కనిపించే అందమైన లొకేషన్స్‌కి తరచూ వెళ్లడమంటే సరదా వాళ్లకి. అలా ‘ఏమాయ చేసావె’లో చూపించిన సెయింట్ మేరీస్ ఫొరెన్ చర్చీ, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ క్యాంపస్సూ మణిరత్నం ‘దిల్ సే’లో చూపించిన లెహ్ పరిసరాలూ ఇతరత్రా తమకు నచ్చిన సినిమాల లొకేషన్‌ల వివరాలన్నీ చెబుతూ ఓ వెబ్‌సైట్ తయారుచేశారు. ‘మాకు అప్పట్లో సినిమావాళ్లెవరూ తెలియదు. దర్శకులో, నిర్మాతలో ఫలానా పాట షూటింగ్ కోసం ఫలానా చోటకి వెళ్లాం అని ఇంటర్వ్యూలు ఇస్తే ఫాలో అయ్యేవాళ్లం. వీలుంటే మేమే అక్కడికెళ్లి వెతికే వాళ్లం. ఐవీ మైనింగ్ రంగంలో పనిచేసేది కాబట్టి తనకి శాటిలైట్ ద్వారా మనం కోరుకున్న ప్రాంతాన్ని వెతికిపట్టుకునే నైపుణ్యం ఉండేది. అలా ఎన్నో ప్రదేశాల్ని గుర్తించాం!’ అంటారు బెంజమిన్ జాకబ్.