అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. మా తమ్ముడు మహేశ్ ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. మా అమ్మ ఆ ఉయ్యాల ఊపుతూ మెల్లగా ‘ప్రియతమా... ప్రియతమా!’ అంటూ మలయాళంలో పాట పాడుతోంది. అప్పుడే ఇంటికెవరో పెద్దవాళ్లొస్తేనూ అమ్మ వాళ్లని హాల్లో కూర్చోబెట్టి మాట్లాడుతోంది... నాన్న కూడా వచ్చిన పెద్దామెతో మాటలు కలిపాడు. ఇంతలో ఉయ్యాల్లోని తమ్ముడు చిన్నగా ఏడిస్తే... నేనుఆ ఊయ్యాల ఊపుతూ అమ్మ పాడినట్టే ‘ప్రియతమా... ప్రియతమా...’ అని పాడటం మొదలుపెట్టాను. పాటలో పూర్తిగా లీనమైపోయానేమో... బయట మాటలు ఆగిపోయిన విషయం గమనించలేదు. మా ఇంటికొచ్చిన పెద్దావిడ నా పాట వింటూ వెనకే నిల్చుందన్న సంగతీ తెలియలేదు. ఆమె నన్ను వెనక నుంచే ఎత్తుకుని ముద్దు పెట్టుకుని నాన్నతో ‘కృష్ణా... పాపకి మంచి ప్రతిభ ఉందిరా! నేనే సంగీతం నేర్పాలి దీనికి!’ అన్నారు. ఆమె పేరు ఓమనకుట్టి అనీ, కేరళలో గొప్ప కళాకారుల్ని తీర్చిదిద్దిన సంగీతాచార్యురాలనీ అంత చిన్న వయసులో నాకేం తెలుస్తుంది!
ఆమె మా ప్రాంతంలో ఏదో కచేరీ ఉండి నాన్నతో ఉన్న పాత పరిచయంతో మా ఇంట్లో బసచేశారు ఆరోజు. కాకపోతే ఆమె చెప్పినట్టు నేను సంగీతం నేర్చుకోవడానికి మరో పదేళ్లు పట్టింది. నేను చిన్నప్పుడు సంగీత శిక్షణ తీసుకోలేదు. నిజానికి, నన్ను ఈ రంగంలోకి తీసుకెళ్లాలన్న ఆలోచనే మా కుటుంబానికి లేదు. మేమంతా మా అక్కయ్య బీనానే అటువైపు వెళుతుందని అనుకునేవాళ్లం. కానీ, మేమొకటి తలిస్తే... దైవం ఇంకొకటి తలచింది.
నా పేరులో అమ్మ
నా పూర్తి పేరు కె.ఎస్.చిత్ర అని మీకు తెలిసే ఉంటుంది. అందులో ‘కె’ మా నాన్న పేరు కృష్ణన్ నాయర్. ‘ఎస్’ శాంతకుమారి మా అమ్మపేరు. ‘పిల్లలకి ఇనిషియల్‌గా తండ్రిపేరే ఎందుకుండాలి... తల్లి పేరూ ఉంటే తప్పేమిటీ!’ అని నా పేరులో అమ్మ పేరునీ చేర్చిన అభ్యుదయవాది నాన్న. ఆయనతోపాటూ అమ్మ కూడా టీచరే. సంతానంలో ఎవరైనా సంగీత రంగంలోకి వెళ్లాలనే కల ఉండేది ఆ ఇద్దరికీ. మా అక్కయ్యని ఆ కలకి ప్రతిరూపంగానే చూశారు. చిన్నప్పుడే పద్ధతిగా సంగీతం నేర్పించారు. అక్కయ్య అలా నేర్చుకుంటూ ఉంటే నేనూ వెంట వెళతానని మారాం చేసేదాన్ని. చెప్పొద్దూ చిన్నప్పుడు నేను కాస్త అల్లరిపిల్లనే. అబ్బాయిలకి పోటీగా చెట్లెక్కి దూకేదాన్ని. పొట్టిగా ఉంటానని ఫస్ట్ బెంచ్‌లో కూర్చోబెట్టేవాళ్లు కానీ... నిజానికి నేను యావరేజ్ విద్యార్థినినే. సంగీతం నేర్చుకుంటున్న మా అక్క సంగీత సాధన చేసేటప్పుడు విని నేనూ స్వరం తప్పకుండా వినిపించగలిగేదాన్ని. ఓసారి ఆలిండియా రేడియోలోని ఓ నాటకంలో రెండేళ్ల కృష్ణుడికి నా చేత పాటపాడించారు. నేను చూసిన తొలి రికార్డింగ్ అదే. అది ప్రసారమయ్యాక బాగా ఫేమసైపోయాను. చుట్టుపక్కల ఎక్కడ కచేరీలు జరిగినా నన్ను పిలవడం మొదలుపెట్టారు. సహజంగానే, పేరు ప్రఖ్యాతులు తలకెక్కి గర్వపడే ప్రాయం కదా... అది! కానీఆ గర్వం వల్ల వచ్చే నష్టమేంటోఅమ్మానాన్నలు స్పష్టంగా చెప్పారు.
‘నీ గాత్రం దేవుడిచ్చిందమ్మా... అందులో నీ ప్రమేయం ఏమీ లేదు. నువ్వు చేయాల్సిందంతా సాధనతో దాన్ని నిలబెట్టుకోవడమే. గర్వపడ్డ ప్రతిసారీ- నీకు చేరువైన విజయం వంద అడుగులు దూరం వెళుతుంది!’ అన్నారు. జీవితంలో నేను ఇప్పటికీ పాటిస్తున్న పాఠం అది.
అక్కత్యాగం
అక్కా, నేనూ సంగీతం వైపు వెళుతున్నా... మొదట సినిమాలో పాడే అవకాశం తనకే వచ్చింది. ఇంట్లో మాఇద్దరిలో ఒక్కరే సంగీతరంగంలోకి వెళ్లే పరిస్థితి! దాంతో ఆ అవకాశం నాకు ఇచ్చి అక్క తప్పుకుంది. ఓ రకంగా తను నాకోసం చేసిన త్యాగం అది. తనలా చేయకపోయుంటే నేను ఈ రంగంలోకి వచ్చి ఉండేదాన్నీ కాదు... నాకిన్ని అవార్డులూ వచ్చుండేవీ కావు. నేను పూర్తిస్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం కేంద్రప్రభుత్వం అందించే ‘నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్‌షిప్’కి దరఖాస్తు చేయమన్నారు నాన్న. దానికి ఎంపిక కావాలంటే అప్పటికే రెండేళ్లపాటు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. నేను సంగీతం నేర్చుకున్నదాన్ని కాకపోయినా ఏదో పాడతాను కాబట్టి దరఖాస్తు చేశాను. సెలెక్షన్ కోసం ఏడుగురు న్యాయనిర్ణేతల ముందు ఓ పాట పాడి వినిపించాలి. అందుకోసం తోడిరాగంలోని ఓ త్యాగరాజ కృతిని ఎంచుకుని క్యాసెట్లో విన్నది విన్నట్టు పాడేశాను. అంతా విన్నాక ఓ న్యాయనిర్ణేత ‘తోడిరాగం ఆరోహణ అవరోహణలు చెప్పమ్మా!’ అన్నారు. ‘నాకు తెలియదండీ’ అన్నాను నిజాయతీగా! న్యాయనిర్ణేతలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ‘నువ్వు పాడిన పాటలో నీకే తెలియకుండా అసావేరికి చెందిన ఓ అద్భుతమైన ప్రయోగం చేశావు. నువ్వు ప్రతిభాశాలివే...’ అని చెప్పి స్కాలర్‌షిప్పు ఇచ్చేశారు. ఏడేళ్ల ఆ స్కాలర్‌షిప్పుతో సంగీతం నేర్చుకోవడానికి డాక్టర్ ఓమనకుట్టిగారినే ఎంచుకున్నాను. అప్పట్లో నా లక్ష్యం ఒక్కటే... సంగీతం లోతులు తరచి చూసి మా గురువుగారిలా సంగీతాచార్యురాలిని కావాలన్నదే. కానీ... అనుకోకుండా నా ట్రాక్ మారింది.
మలుపు తిప్పిన క్షణం
మా గురువు ఓమనకుట్టిగారి అన్నయ్య ఎంజీ రాధాకృష్ణన్ 1979లోనే ఓ సినిమాకి నన్ను పాడించారు కానీ... ఆ సినిమా రిలీజు కాలేదు. 1982లో మళ్లీ ఓసారి అవకాశమిస్తే పాడాను. అదో డ్యూయెట్. మొదట్లో ‘ట్రాక్’ కోసమని రికార్డు చేశారు. నాతోపాటు ఓమనకుట్టిగారి తమ్ముడు ఎంజీ శ్రీకుమరన్ పాడారు. ఆ తర్వాత శ్రీకుమరన్ ట్రాక్‌కి బదులు దాసన్న (కే జే ఏసుదాసు)ని ఎంచుకున్నారు. ఆయనకోసం మరోసారి నన్ను పాడమన్నారు. ఏసుదాసుగారి పక్కన నిల్చుని పాడటమన్న ఆ ఆలోచనకే గడగడా వణికిపోయాను. రికార్డింగులో తప్పులొచ్చాయి. అయినాసరే... దాసన్న ఓపిగ్గా సవరణలు చెప్పి పాడించారు. ఆ పాట బయటకొచ్చాక ‘ఏసుదాసుతో ఎవరో చిన్న పిల్ల పాడిందట!’ అంటూ ఇండస్ట్రీలోని మిగతా సంగీతదర్శకులూ నాకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ కొద్ది రోజుల్లోనే- ‘మరీ చిన్నపిల్లల గొంతులాగా ఉంది. పెద్దవాళ్లకి పనికిరాదు!’ అనే ముద్రపడింది. కాకపోతే నా అదృష్టం కొద్దీ- నేనలా చిన్నపిల్లలా నటి నదియా కోసం పాడిన ఓ పాట ఇళయరాజాగారి చెవిన పడింది! నా కెరీర్‌ని మలుపుతిప్పిన క్షణాలవి.
ఇళయరాజా జోస్యం
అప్పట్లో తిరువనంతపురంలోని మా ఇంటికి దగ్గర ‘శివన్’ అనే థియేటర్ ఉండేది. అందులో తమిళ సినిమాలు వేసేవారు. ప్రదర్శనలకి ముందు పెద్ద సౌండ్‌తో పాటలు వినిపిస్తుండేవారు. అరవం అర్థం కాకున్నా ఇళయరాజా పాటలతో పరిచయం అలా ఏర్పడింది! పోనుపోను ఆయన గురించి అందరూ గొప్పగా చెప్పడం వింటుండేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక ఆయనతో పనిచేసే అవకాశం రాకపోతుందా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ‘పెద్దవాళ్లకి నా గొంతు పనికిరాదు!’ అన్న విమర్శతో ఆ కలలన్నీ నీరుగారిపోయాయి. అలాంటి సందర్భంలోనే మలయాళంలో నదియా నటించి నేను పాటలు పాడిన సినిమాని దర్శకుడు ఫాజిల్ తమిళంలో తీయాలను కున్నారు. ఇళయరాజాగారే సంగీతం. ఆయన మలయాళం ఒరిజినల్‌లోని నా పాటలు విని ‘ఈ గొంతు కొత్తగా ఉంది... తమిళంలోనూ వాడేద్దాం!’ అన్నార్ట. దాంతో ఫాజిల్ ‘చెన్నై వెళితే ఓసారి రాజాగార్ని కలవండి!’ అన్నార్ట నాన్నగారితో. ఆయన చెప్పినట్టే ఓ రోజు నాన్నతోపాటూ బిక్కుబిక్కుమంటూ రాజాగారి స్టూడియోకి వెళ్లాను. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నానని విని ఓ కీర్తన పాడమన్నారు. ‘ఇంత సౌఖ్యమని నే జెప్పజాల...’ అన్న కృతి పాడాను కానీ భయంతో ఉచ్ఛ్వాసనిశ్వాసాలు పెరిగి ‘జెప్పజా...లా’ అంటూ పదాల్ని విరిచేశాను. రాజాగారు ‘అలా పాడకూడదమ్మా...’ అని చక్కగా నేర్పించి పంపారు. అంత తప్పులుతడకలుగా పాడిన నాకేం అవకాశమిస్తారు అనుకున్నాను. కానీ, తర్వాతి వారమే నదియా నటించిన సినిమాలో అన్నిపాటలూ నా చేత పాడించారు. ఆ తర్వాతే ‘సింధుభైరవి’ వచ్చింది. ఆ సినిమా తెలుగు వెర్షన్‌లో ‘నేనొక సింధు...’ అనే సుశీలగారి పాట ఉంటుంది. దాన్ని తమిళంలో నేను పాడాను. ఆ పాట రికార్డింగ్ మధ్యాహ్నం పూర్తయిపోతే... సాయంత్రం ట్రెయిన్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. అప్పటికి బీఏ మ్యూజిక్‌లో డిగ్రీ అందుకుని ఎమ్మేలో చేరాను. ఆ తర్వాతి రోజే నాకు పరీక్షలు. మేం బయల్దేరుతుండగా రాజాగారు ‘ఇంకో మంచి పాట ఉంది. పాడి వెళ్తావా!’ అని అడిగారు. నాన్నేమో ‘పాపకి రేపు పరీక్షలు సార్...!’ అన్నారు. ‘డిగ్రీలు పక్కనపెట్టండి... ఇది అంతకన్నా పెద్దస్థాయికి తీసుకెళుతుంది!’ అన్నారు. నాన్నకేమీ పాలుపోక అమ్మకి ఫోన్ చేశారు. ‘తర్వాతైనా ఎమ్మే పూర్తి చేస్తానని మాటిస్తేనే పరీక్షలు మాను’ అంది అమ్మ నాతో. అలాగేనని ప్రామిస్ చేశాను. కానీ ఆ మాట ఎప్పటికీ నిలుపుకోలేని పరిస్థితొచ్చింది. రాజాగారి జోస్యం నిజమైంది. ‘పాడరియేన్...’ అనే ఆ పాట నాకు తొలి జాతీయ అవార్డునే కాదు, తీరికలేనన్ని అవకాశాల్నీ తెచ్చిపెట్టింది. దాని తెలుగు వెర్షన్ ‘పాడలేను పల్లవైనా...’తోనే తొలిసారి తెలుగు శ్రోతలకి పరిచయమయ్యాను.
నాకు తోడూనీడా...