సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కన్నుమూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తల, శరీరంపై తీవ్ర గాయాలు అవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యులు కూడా చెప్పారు. అయితే, శనివారం కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన అభిమానులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం యలమందలో నేడు కత్తి మహేశ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు..
గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో గాయాలవడంతో శస్త్రచికిత్స కూడా చేశారు. మహేశ్ వైద్యానికి ఏపీ ప్రభుత్వం రూ.17 లక్షలు సాయం చేసింది. అయినా కూడా కత్తి మహేశ్ ప్రాణాలు దక్కలేదు.
సినీ ప్రస్థానం..
చిత్తూరు జిల్లాలో జన్మించిన కత్తి మహేశ్ కుమార్.. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. సినీ దర్శకుడు కావాలనే కోరికతో పలు ప్రయత్నాలు చేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ‘ఊరు చివర ఇల్లు’ కథ ఆధారంగా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ‘మిణుగురులు’ చిత్రానికి సహ రచయితగా వ్యవహరించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పెసరట్టు’ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నటుడిగా మారారు. ముఖ్యంగా ‘హృదయకాలేయం’లో పోలీస్ ఆఫీసర్‌గా, ‘నేనే రాజు నేనే మంత్రి’లో టీ అమ్మే వ్యక్తిగా, ‘కొబ్బరిమట్ట’లో రైతుగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’, ‘క్రాక్’ తదితర చిత్రాల్లోనూ మెరిశారు.
బిగ్‌బాస్ సీజన్-1లో..
ప్రముఖ టెలివిజన్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్-1లో 27రోజుల పాటు కొనసాగారు. కత్తి మహేశ్ దర్శకుడు, నటుడు మాత్రమే కాదు, సినీ విశ్లేషకుడు కూడా. పలు టెలివిజన్ ఛానళ్లు, యూట్యూబ్ వేదికగా సినిమాలను విశ్లేషించేవారు.
ప్రముఖుల సంతాపం..
ఆయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. కత్తి మహేశ్ మరణ వార్త తనను షాక్‌కు, ఆవేదనకు గురి చేసిందని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. మహేశ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఇదీ చదవండి: