ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

గురువుకి తగ్గ శిష్యుడు - telugu film industry

దాసరి శిష్యుడిగా ప్రస్థానం ప్రారంభించి.. అసమాన్య దర్శకుడిగా కోడి రామకృష్ణ ఎదిగిన తీరు నేటితరానికి ఆదర్శప్రాయం.

కోడి రామకృష్ణ (ఫైల్ ఫొటో)

By

Published : Feb 23, 2019, 1:09 AM IST

వంద సినిమాలకు దర్శకత్వం వహించడమంటే మాటలు కాదు. అందులోనూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ ఈ ఘనత సాధించడం కత్తిమీద సామే. ఆలాంటి దర్శకధీరుల్లో అతి కొద్ది మందే కళ్లముందు కనిపిస్తారు. వారిలో ఒకరే కోడి రామకృష్ణ. దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీప్రస్థానం ఆరంభించిన ఆయన... అన్నిరకాల సినిమాలతో మెప్పించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకుడిగా మారిన రామకృష్ణ... నాగాభరణం చిత్రం వరకూ వందకుపైగా సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. పల్లె జనంతో ఈలలు వేయించినా... రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించాలన్నా... సెంటిమెంట్‌కు గ్రాఫిక్స్‌ జోడించి ఔరా అనిపించాలన్నా కోడి రామకృష్ణకే చెల్లింది.

కన్నుమూసిన దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1949 జులై 23న జన్మించిన కోడి రామకృష్ణ... నాటక రంగం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. విద్యార్థి దశ నుంచే లలిత కళాంజలి సంస్థ ద్వారా నాటకాలు ప్రదర్శించేవారు. ఏఎన్‌ఆర్‌ను అమితంగా అభిమానించి ఎక్కువగా ఆయన్నే అనుకరించేవారు. తాతామనవడు సినిమా విజయోత్సవ సభలో దాసరితో ఏర్పడిన పరిచయం తర్వాత ఆయన వద్దే శిష్యుడిగా చేరిపోయారు. కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రస్థానమే ఓ ప్రభంజనంగా సాగింది. చిరంజీవికి దర్శకత్వం వహించిన తొలిచిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఏకంగా 525 రోజులు ఆడి సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత తరంగిణి, ఆలయశిఖరం, ముక్కుపుడక చిత్రాలతో నిలదొక్కుకున్న కోడి రామకృష్ణ... మంగమ్మగారి మనవడు, మాపల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య, మన్నెంలో మొనగాడు, తలంబ్రాలు చిత్రాలతో విజయవంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. మురళీకృష్ణుడు, స్టేషన్ మాస్టర్, ఆహుతి, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు సినిమాల ద్వారా కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగానూ మెప్పించారు. అంకుశం సినిమా ద్వారా రాజకీయ కథా చిత్రంతో సంచలనం సృష్టించారు. యాంగ్రీ యంగ్ మెన్‌గా రాజశేఖర్‌ కెరీర్‌లో మరపురాని చిత్రాన్నందించారు. మధ్యలో శత్రువు, పెళ్లాం చెబితే వినాలి వంటి చిత్రాలు రూపొందించినా... భారత్ బంద్, రాజధాని, పోలీస్ లాకప్ వరకూ అదే పంథా కొనసాగించారు.

సామాజిక, మహిళా ప్రాధాన్యమున్న కథలతోపాటు ఆధ్యాత్మిక కథలు, సోషియో ఫాంటసీ కథలతో ప్రేక్షకులను రంజింపచేసిన కోడి రామకృష్ణ... తెలుగు సినీ రంగంలో అత్యధికంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాలు తీసిన దర్శకుడిగా రికార్డు సృష్టించారు. 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు చిత్రం ఆయన జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి గ్రాఫిక్స్ మాయాజాలాన్ని అందించింది.. భక్తి చిత్రానికి గ్రాఫిక్స్ జోడించి రూపొందించి తెలుగునాట సంచలనం సృష్టించారు. అదే బాటలో దేవి, దేవీపుత్రుడు, అంజి, అరుంధతితో ప్రేక్షకుల ముందు మరో లోకాన్ని ఆవిష్కరింపజేశారు.
తెలుగు చలన చిత్ర రంగంలో 30 ఏళ్లపాటు తనదైన ముద్ర వేసి ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన కోడి రామకృష్ణ.. సుమన్, అర్జున్, భానుచందర్, రామిరెడ్డి, బాబూమోహన్ లాంటి ఎంతో మంది నటీనటులను తెరకు పరిచయం చేసి... తిరుగులేని దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. కోడి రామకృష్ణ దర్శకుడిగానే కాదు.. నటుడిగా సైతం కొన్ని చిత్రాల్లో అలరించారు. నాలుగైదు చిత్రాల్లో అతిథి పాత్రలో నటించారు. మూడిళ్ల ముచ్చట, ఇంటి దొంగ, అత్తగారూ స్వాగతం, ఆస్తి మూరెడు - ఆశ బారెడు, దొంగాట చిత్రాల్లో తెరపై కనిపించి బహుముఖ ప్రజ్ఞ చాటారు.
సినీ కళామతల్లి సేవకుగాను 2012 రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 10 నంది పురస్కారాలు, 2 ఫిల్మ్​ఫేర్ పురస్కారాలు కోడి రామకృష్ణ నివాసంలో కొలువు దీరాయి. 2014లో వచ్చిన అవతారం ఆయన చివరి తెలుగు చిత్రం. 2016లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో కన్నడంలో వచ్చిన నాగరహవు చిత్రం.. తెలుగులోకి నాగాభరణంగా విడుదలైంది. దర్శకుడిగా ఇదే కోడి రామకృష్ణ చివరి చిత్రం.

ABOUT THE AUTHOR

...view details