Emma Heesters Srivalli Song: సంగీతానికి భాషతో సంబంధం లేదు. హృదయాన్ని హత్తుకునే రాగాన్ని ఎవరు స్వర పరిచినా అది విశ్వవ్యాప్తం అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఎందరో సంగీత దర్శకులు, గాయకులు ఈ విషయాన్ని నిరూపించారు. ఇప్పుడు డచ్ గాయని ఎమ్మా హీస్టర్స్... ఇదే నిజమనిపిస్తోంది.
డచ్ సింగర్ నోట.. శ్రీవల్లి పాట
అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్పలోని శ్రీవల్లి పాటని ఇంగ్లిష్‌లో తనదైన శైలిలో పాడి సంగీత శ్రోతల్ని విశేషంగా అలరిస్తోంది. చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్య మాయనే అని తెలుగులోనూ ఆలపించి ఫిదా చేస్తోంది. ఈ పాటకు స్వరాలు సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ ఎమ్మా వీడియోను ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్మా హీస్టర్స్ పాటని విన్నవాళ్లంతా.. పాట చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.
నెదర్లాండ్స్‌కు చెందిన ఎమ్మాకు చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ. తల్లి సంగీత అధ్యపకురాలు కావడంతో.. ఆమె దగ్గరే సంగీత పాఠాలు నేర్చుకుంది.. ఈ యువతి. చిన్నప్పటి నుంచి సంగీతానికి దగ్గరగా పెరగడంతో సంగీతంపై మంచి పట్టు సాధించింది. చదువు పూర్తయ్యాక స్వయంగా కవర్ సాంగ్స్ చేయటం ప్రారంభించింది.. ఎమ్మా హీస్టర్స్.
యూట్యూబ్‌లో పాటలు..
యూట్యూబ్ వేదికగా సంగీత ప్రపంచానికి తన ప్రతిభను పరిచయం చేసింది.. ఈ యువతి. మంచి సంగీతం అందిస్తుండడంతో.. కొద్ది రోజుల్లోనే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. వివిధ భాషల్లోని పాపులర్ పాటల్ని ఇలా తనదైన శైలిలో ఆలపిస్తూ.. ఆయా అభిమానులకు దగ్గరైంది.