ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

'షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు: తలసాని'

తెలంగాణలో షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గురువారం మంత్రి తలసానితో సినిమా, టెలివిజన్‌ రంగ ప్రముఖులు ఎంసీహెచ్‌ఆర్డీలో సమావేశం అయ్యారు. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు ఎలా చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సెట్‌లో ఎంతమంది ఉండాలి? ఎంత సేపు షూటింగ్‌ చేయాలి? తదితర అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.

By

Published : May 28, 2020, 5:54 PM IST

actor naresh give clarity on shootings restart
actor naresh give clarity on shootings restart

చిత్ర, టీవీ రంగాన్నిసంక్షోభం నుంచి గట్టెక్కించడంపై మంత్రి తలసానితో టాలీవుడ్ సినీ ప్రముఖులు చర్చలు జరిపారు. షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని సమావేశం అనంతరం తెలంగాణ మంత్రి తలసాని తెలిపారు. షూటింగ్‌ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలోనే షూటింగ్‌లు ప్రారంభిస్తాం

ఈ రోజు చలన చిత్ర పరిశ్రమ, టీవీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై సమావేశం జరిగింది. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు ఎలా ప్రారంభించాలన్న అంశంపై నిన్నా, ఈరోజు విధి విధానాలను తయారు చేశాం. షూటింగ్‌లు పునః ప్రారంభంపై చర్చలు జరిగాయి. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన అంశాలను కూలంకషంగా మాట్లాడుకున్నాం. ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. షూటింగ్‌లకు ఎప్పుడు అనుమతి ఇస్తామో తెలియజేస్తాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఇబ్బంది లేదు కాబట్టి, ఇప్పటికే వాటికి అనుమతులు ఇచ్చాం. ఇప్పుడప్పుడే థియేటర్లు తెరిస్తే కొన్ని సమస్యలు వస్తాయి. థియేటర్లు తెరవాల్సిన సమయం వచ్చినప్పుడు వాటిపై చర్చిస్తాం. బాలకృష్ణ వ్యాఖ్యలను చూసిన తర్వాతే స్పందిస్తా. ఆ విజువల్స్‌ ఇప్పటివి కాదని కొందరు అంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటా. ఈ సమావేశాలకు కూడా ఇండస్ట్రీలోని ఉన్న వాళ్లందరినీ పిలవలేదు. ఎవరైతే ఈ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారో వాళ్లనే పిలిచాం. ఇది దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌కు సంబంధించిన అంశం. అందుకే వాళ్లతో మాట్లాడాం. అందరినీ పిలిచి సమావేశం పెట్టాలని ఎవరైనా అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ సమావేశానికి కూడా వచ్చి మాట్లాడతా.

- తెలంగాణమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌.

‘‘కేసీఆర్‌ గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని గారికి మేమెంతో రుణపడి ఉన్నాం. కళాకారుల పెన్షన్‌కు కూడా జాబితా సిద్ధం చేసి పంపిస్తాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలోనే షూటింగ్‌లు ప్రారంభిస్తాం. సినిమా పరిశ్రమను ఎలా గట్టెక్కించాలన్న దానిపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో విధానపర నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి ముఖ్యమంత్రి పరిశీలనకు వెళ్తాయి. ఆయన ఓకే చేసి అనుమతి ఇస్తే, మిగిలిన జాగ్రత్తలు ఫిలిం ఛాంబర్‌, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఇతర సంస్థలు తీసుకుంటాయి. చిత్ర పరిశ్రమలో చిన్న చిన్న మనస్పర్థలు ఉంటాయి. మా అధ్యక్షుడినైనా అన్ని కార్యక్రమాలకు నన్ను పిలవలేదు. నిన్న, ఈరోజు పిలిచారు. వచ్చి సూచనలు ఇచ్చాను. పిలిస్తే, రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. బాలకృష్ణ ఏం మాట్లాడారో నాకు తెలియదు’’ -మా అధ్యక్షుడు నరేశ్‌

‘‘ప్రస్తుతం అందరం కరోనాతో ఇబ్బంది పడుతున్నాం. చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైనది. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు ఎక్కువ కలిసి ఉండాల్సిన పరిస్థితి. ఒకరినొకరు తాకుతూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని జాగ్రత్తలతోనే షూటింగ్స్‌ ప్రారంభమవుతాయి. కొన్ని నెలలు షూటింగ్స్‌ జరిగిన తర్వాత థియేటర్లు తెరుస్తారు. దేశమంతా ఒకేసారి థియేటర్లు తెరవమని కోరాం. కరోనా వల్ల దెబ్బతిన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’’- నిర్మాత డి. సురేశ్‌బాబు

‘‘మేము అడిగిన వెంటనే ఒకసారి, అడగకపోయినా మరోసారి మాకు సాయం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారికి, సినిమా, టీవీ ఇండస్ట్రీ తరపున ధన్యవాదాలు చెబుతున్నా. కేసీఆర్‌గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’-దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి

‘‘ప్రభుత్వం చాలా త్వరగా స్పందించింది. మాకు కావాల్సినవన్నీ చేశారు. వాళ్లు అనుమతులు ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ, అంతా మా చేతుల్లోనే ఉంది. మేము క్రమశిక్షణతో, జాగ్రత్తగా సినిమా షూటింగ్స్‌ ఎలా మొదలు పెట్టాలి? అని ఆలోచించాలి. ఈ విషయంపై మాతోనే కాదు, ఇండస్ట్రీని అన్ని వర్గాలతో మంత్రి చర్చిస్తున్నారు’’ -అగ్ర నటుడు నాగార్జున

ఇవీ చూడండి:ఆకలేసి ఏడుస్తుంటే ఇంటి నుంచి గెంటేశాడు!

ABOUT THE AUTHOR

...view details