ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

తొలి వైద్యురాలి బయోపిక్ ఈ నెల 15న విడుదల - biopic

దేశంలో తొలి వైద్యురాలిగా పేరుగాంచిన ఆనంది గోపాల్ జీవితం ఆధారంగా మరాఠి చిత్రం ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తొలి వైద్యురాలి బయోపిక్

By

Published : Feb 4, 2019, 2:59 PM IST

'ఆడపిల్లను రక్షిద్దాం-ఆడపిల్లను చదివిద్దాం'... ఇది నేటి మాట. కానీ వందేళ్ల క్రితం పరిస్థితి వేరు. ఆడవాళ్లు చదువుకుంటామంటే చావగొట్టేవాళ్లు! అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని చదవడమే కాదు.. దేశంలో తొలి ఫిజిషియన్​గా రికార్డు సృష్టించారు మహారాష్ట్రకు చెందిన ఆనంది గోపాల్. ప్రస్తుతం ఈమె జీవితం ఆధారంగా మరాఠిలో ఓ చిత్రం రూపొందించారు.
ఫిబ్రవరి 15న ఆనంది గోపాల్​ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. భార్యను చదివిస్తున్న భర్త కష్టాల్ని... కట్టుబాట్లను కూలదోసి వాళ్లు పడిన అవస్థల్ని హృదయాన్ని హత్తుకునేట్లు ట్రైలర్​లో చూపించారు.
సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిశోర్ అరోరా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ మిలింద్ ఆనంది గోపాల్ పాత్రను పోషిస్తున్నారు.
ఇదీ కథ...
మహారాష్ట్రలో 1865 మార్చి 31న జన్మించిన ఆనందిగోపాల్ అసలు పేరు యమున. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే తన కంటే 20 ఏళ్ల పెద్దవాడైన గోపాల్​రావుతో వివాహమయ్యింది. ఆనంది భర్త ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. మహిళలు చదువుకోవాలనే ఆశయంతో భార్యను వైద్య కోర్సు పూర్తి చేయమని అమెరికా పంపిస్తారు. 14 ఏళ్ల వయస్సులోనే బిడ్డకు జన్మనిచ్చినా... సరైన వైద్యం అందక శిశువుని కోల్పోయారు ఆనంది. తను పడిన వేదన మరొకరు పడకూడదనే తలంపుతో పట్టుదలగా రెండేళ్ల వైద్య డిగ్రీని అమెరికాలో పూర్తి చేశారు. 1886లో దేశానికి తిరిగొచ్చి కొల్హాపూర్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్ ఆసుపత్రిలో ఫిజిషియన్​గా సేవలందించారు. దురదృష్టవశాత్తు 1887లో క్షయతో మరణించారు ఆనంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details