గూగుల్‌లో ఏదైనా వెతికితే బోల్డన్ని వెబ్ పేజీలు కుప్పలుగా వచ్చేస్తాయి. వాటిల్లో కావాల్సిన వాటిని వెతికి ఓపెన్ చేస్తాం. ఇలా పదే పదే కళ్లు కాయలు కాసేలా సెర్చ్ రిజల్ట్‌లను వెతికే పని లేకుండా విద్యార్థులు వినూత్నంగా గూగుల్ సెర్చ్ చేసేలా ‘ఇంటరాక్టివ్ క్విజ్’లు జత అయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్.. వాటిని ఇట్టే యాక్సెస్ చేయొచ్చు. కరోనా కారణంగా చదువులు ఇంటికే పరిమితం అయిన నేపథ్యంలో గూగుల్ ఈ తరహా రిమోట్ లెర్నింగ్‌కి అవకాశం కల్పిస్తోంది. అదెలాగంటే.. గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి Physics Practice Problems అని ఎంటర్ చేసి చూడండి. సెర్చ్ రిజల్ట్‌ల ప్రారంభంలో చూడండి. ప్రత్యేక ఫార్మాట్‌లో క్విజ్‌లు కనిపిస్తాయి. పలు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు అందించే వాటిని ఒక్కొక్కటిగా యాక్సెస్ చేయొచ్చు. క్విజ్‌లకు మీరిచ్చే సమాధానాల ఆధారంగా ఆయా పాఠ్యాంశాలపై మీకెంత పట్టు ఉందో తెలుసుకోవచ్చు. Trigonometry Problems అనే కీవర్డ్‌తో గణితశాస్త్ర ప్రశ్నలతో కూడిన పజిల్‌ని చూడొచ్చు. సాధన చేయొచ్చు.
ఆగ్మెంటెడ్ రియాలిటీ..
వాస్తవ ప్రపంచాన్ని వర్చువల్ వరల్డ్‌ని టెక్నాలజీ మిళితం చేసేస్తోంది. దానికి నిదర్శనమే అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్). ఎలాంటి అదనపు యాక్ససరీస్‌తో అవసరం లేకుండా.. కేవలం మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్‌తోనే ఏఆర్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌లలో ఈ ఏఆర్ టెక్నాలజీని వాడుకుని రిమోట్ లెర్నింగ్‌ని మరింత వినూత్నంగా మార్చేయొచ్చు. ఎంపిక చేసుకున్న అంశాల్ని 3డీలో చూడడంతో మీరున్న చోటే ఏఆర్‌లోనూ ప్రదర్శించి చూడొచ్చు. ఉదాహరణకు రసాయన శాస్త్రంలోని ‘కెమికల్ బాండ్’ గురించి చూద్దాం అనుకుంటే.. ఫోన్‌లోని గూగుల్ సెర్చ్‌లో chemical bondకీవర్డ్‌ని ఎంటర్ చేయండి. సెర్చ్ ఫలితాల్లో ‘వ్యూ ఇన్ 3డీ’ కనిపిస్తుంది. ట్యాప్ చేసి 3డీలో చూడొచ్చు. ఒకవేళ మీ ఫోన్‌లో ఏఆర్ సపోర్టు ఉంటే.. ‘వ్యూ ఇన్ యువర్ ప్లేస్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఉన్నచోటే ఏఆర్‌లో కెమికల్ బాండ్ డయాగ్రామ్‌ని చూడొచ్చు.
ఇదే మాదిరిగా భౌతికశాస్త్రానికి సంబంధించిన పాఠ్యాంశాల్ని 3డీ, ఏఆర్‌ని వాడుకుని చదువుకోవచ్చు. ఇప్పటికైతే ఈ మొత్తం రిమోట్ లెర్నింగ్ ఇంగ్లిష్ భాషలోనే అందిస్తున్నారు. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ గూగుల్ అందించేందుకు సిద్ధం అవుతోంది. డెస్క్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లలోనూ ఈ గూగుల్ సెర్చ్ ఫీచర్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. వీటితో పాటు మరికొన్ని స్క్రీన్ రీడర్స్‌ని అందించే పనిలో ఉంది. దీంతో అంధులు ఇతరుల సాయం లేకుండానే రిమోట్ లెర్నింగ్ సేవల్ని వాడుకోవచ్చు.