ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / science-and-technology

ఇవి ఇంట్లో ఉంటే.. ఆరోగ్యం మీ వెంటే..! - new gadjets do not infect the corona virus

కొత్తగా రూపొందిస్తోన్న గ్యాడ్జెట్లలో కరోనాని సోకనివ్వని వాటిదే హవా. అందులో భాగంగా మాస్క్‌లూ డిజెన్ఫెక్టెంట్‌లూ ఎయిర్‌ ప్యూరిఫయర్లూ టచ్‌లెస్‌ టెక్నాలజీ పరికరాలూ ఇలా ఎన్నో ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. అదేసమయంలో ఇటు కొవిడ్‌నీ అటు భవిష్యత్తు అవసరాల్నీ దృష్టిలో పెట్టుకుని దైనందిన జీవనంలో ఉపయోగపడేలా రూపొందించినవీ ఉన్నాయి. అలాంటివాటిల్లో కొన్ని...

gadgets donot affect corona virus
gadgets donot affect corona virus

By

Published : May 23, 2021, 8:54 PM IST

స్మార్ట్‌ మాస్క్‌...గాలినీ పసిగట్టేస్తుంది!

ఇది మాస్క్‌ల యుగం. సమీప భవిష్యత్తులో మాస్క్‌లేని ముఖం కనిపించకపోవచ్చు. ఒక్క వైరస్‌ అనే కాదు, పెరుగుతోన్న కాలుష్యం వల్లా అది నిత్యావసరంగా మారిపోనుంది. అందుకే ఎయిర్‌పాప్‌ కంపెనీ ఆరోగ్యాన్ని రక్షించే యాక్టివ్‌ ప్లస్‌ అనే సరికొత్త స్మార్ట్‌ మాస్క్‌ని రూపొందించింది. ఈ హైటెక్‌ మాస్క్‌లో అమర్చిన సెన్సర్‌, నిమిషానికి ఎన్నిసార్లు గాలి పీలుస్తున్నాం, ఎంత పీల్చుకుంటున్నాం, ఆ రోజు ఎంతసేపు మాస్క్‌ పెట్టుకున్నామన్న విషయాలతోపాటు గాలి నాణ్యతనీ పసిగట్టేస్తుందట. మాస్క్‌లోపలి ఫిల్టర్‌ సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్న విషయాన్ని దీనికి అనుసంధానమై ఉన్న ఆప్‌కి పంపిస్తుంది. ఇక, ఇందులోని ఫిల్టర్‌ గాల్లోని కలుషితవాయువుల్నీ, దుమ్మూధూళినీ,
అలర్జీలకు కారణమయ్యే పుప్పొడి... వంటి వాటినీ వడబోస్తుందట. పైగా కాసేపు మాస్క్‌ని ముక్కు కిందకి లాగితే చుట్టుపక్కల ఉన్న గాల్లోని నాణ్యతను గుర్తించి మాస్క్‌ పెట్టుకోవాలని హెచ్చరిస్తూ చిన్నపాటి శబ్దం చేస్తుందట. మంచి విషయమే కదూ!

ఇంట్లో యూవీ దీపం!

ఇంటాబయటా ఎక్కడికెళ్లినా గుండెలనిండా గాలి పీల్చుకోవాలన్నా కరోనా వెంటాడుతున్నట్లే ఉంటుంది. ఆ భయమే రోగానికి సగం కారణం. అందుకే ఫిలిప్స్‌తో సహా అనేక కంపెనీలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే యూవీ-సి ల్యాంపుల్ని తయారుచేస్తున్నాయి. వీటిని ఆన్‌ చేసి ఆయా గదుల్లో కాసేపు ఉంచితే గాల్లోని వైరస్‌ చనిపోతుందట. వాటినుంచి వచ్చే అతినీలలోహిత కాంతి వైరస్‌ పైభాగంలోని ప్రొటీన్‌ను దెబ్బతీయడంతో అది నిర్వీర్యమైపోతుంది. ఈ ల్యాంపుల్లో కొన్ని చేత్తో పట్టుకుని వస్తువుల్ని శుభ్రం చేసుకునేవీ వస్తున్నాయి. ఎల్‌జీ కంపెనీ అయితే కృత్రిమ మేధస్సునీ జోడించి యూవీ-సి డిజెన్ఫిక్టింగ్‌ రోబోలకు రూపకల్పన చేసింది. ఇది గదిలోని గాలినే కాదు, బల్లలూ కుర్చీలమీద ఉన్నవాటినీ శుభ్రం చేసేస్తుందట. నిజానికి యూవీ కాంతి చర్మానికీ కళ్లకీ మంచిదికాదు. అందుకే ఆ కాంతికి ఎదురుగా లేకుండా ఆపరేట్‌ చేయాలి. అయితే ఎన్‌ఎస్‌ నానోటెక్‌ కంపెనీ, కొత్తగా రూపొందించిన షార్ట్‌వేవ్‌ లైట్‌ ప్యూరిఫయర్‌ను అయితే నిశ్చింతగా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. దీన్నుంచి 230 నానోమీటర్లకన్నా తక్కువ తరంగదైర్ఘ్యంతో వచ్చే యూవీకాంతి, సూక్ష్మజీవుల ఆర్‌ఎన్‌ఏను నాశనం చేస్తుందట.

డాక్టర్‌ టాయ్‌లెట్‌!

మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్న విషయాన్ని టాయ్‌లెట్టే కనిపెట్టేసే రోజులూ రానున్నాయి. టోటో కంపెనీ రూపొందించిన వెల్‌నెస్‌ టాయ్‌లెట్‌ ఇంటర్‌నెట్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. మలాన్ని పరీక్షించడం ద్వారా ఇది మనం సరైన పోషకాహారం తింటున్నామా లేదా అందులో పీచు శాతం ఎంత... వంటి వాటిని ఇట్టే పసిగట్టేసి ఫోను ద్వారా ఆప్‌కి పంపించేస్తుందట. ఏమేమి తినాలో కూడా సూచిస్తుందట. అంతేకాదు, దీని సీటు మీద కూర్చుంటే చాలు, గుండె వేగాన్నీ గుర్తించి రీడింగ్‌ పంపించేస్తుంది. అంటే ఇది ఇంట్లో ఉంటే అంతా నిశ్చింతే అన్నమాట.

రిస్ట్‌ బ్యాండ్‌... హెచ్చరిక!

ఆరోగ్యాన్ని కాపాడే వేరబుల్‌ డివైసెస్‌ ఇప్పటికే చాలానే వచ్చాయి. కానీ వైరస్‌ను అడ్డుకునే క్రమంలో రూపొందించినదే ఈ ఇమ్యునోటచ్‌ రిస్ట్‌బ్యాండ్‌. చేతులతో రకరకాల వస్తువుల్ని పట్టుకుంటాం. అదే చేతుల్ని గభాల్న ముఖంమీదా ముక్కులోనూ కళ్లలోనూ నోట్లోనూ పెట్టుకున్నప్పుడు- చేతులకేమైనా వైరస్‌ ఉంటే, అది కళ్లూ ముక్కు ద్వారా నేరుగా లోపలకు వెళ్లిపోతుంది. ఆ కారణంతోనే చేతుల్ని ముఖమీదకి వెళ్లనీయొద్దు అంటున్నారు. అయితే దురదని ఆపుకోలేకో లేదా అలవాటుకొద్దో వద్దన్నా చెయ్యి అటు వెళుతూనే ఉంటుంది. కొందరయితే మాటిమాటికీ తలలోనూ పెట్టుకుంటుంటారు. అదే ఈ బ్యాండ్‌ చేతికి ఉంటే అందులోని యాక్సెలెరోమీటర్‌ చేతి కదలికల్ని గుర్తించి ముఖానికి దగ్గరగా గానీ వెళ్తుంటే గుయ్‌ మంటూ శబ్దం చేస్తుంది.
అప్పటికీ వినకుండా కంట్లోకో నోట్లోకో చెయ్యి వెళితే ఎన్నిసార్లు ఎక్కడెక్కడ పెట్టారన్న విషయాన్ని లెక్కించి మరీ దాంతో అనుసంధానించిన ఆప్‌లో చూపిస్తుంది కాబట్టి అలవాటుని మానుకునే ప్రయత్నం చేయవచ్చు.

ఇంట్లోనే మెడికల్‌ ల్యాబ్‌!

భవిష్యత్తులో ఎవరి ఆరోగ్య పరీక్షలు వాళ్లే చేసుకుని, ఫలితాల్ని మాత్రమే వైద్యులకి పంపించాల్సి రావచ్చు. అందుకోసం తయారైనదే బిసు బాడీ కోచ్‌. ఇది యూరిన్‌, సెలైవా శాంపుల్స్‌ని పరీక్షించడమే కాదు, అందులోని రిపోర్టుతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రెండు నిమిషాల్లో ఫోనులోని ఆప్‌కి పంపించేస్తుంది. పరీక్షించుకోవడానికి ఆయా శాంపుల్స్‌కోసం స్టిక్స్‌ ఉంటాయి.
శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్ల శాతాన్ని లెక్కించి తీసుకోవాల్సిన పండ్లూ కూరగాయల్నీ కూడా సూచిస్తుందట. ఇది మార్కెట్లోకి వచ్చాక భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యం, సంతానసాఫల్యత... వంటివి పరీక్షించుకునేలా దీన్ని రూపొందించాలని అనుకుంటోందా కంపెనీ.

భలే మంచి బాటిల్‌!

ఇంట్లో ఉంటే సరే, కానీ ఎక్కడకు వెళ్లినా వెంట వాటర్‌బాటిల్‌ తప్పనిసరి. అయితే అన్నిచోట్లా యూవీ, ఆర్‌వీతో పనిచేసే ఫిల్టర్లే ఉండవు. అది దృష్టిలో పెట్టుకునే లార్క్‌, క్రేజీక్యాప్‌, మహాటన్‌... వంటి కంపెనీలు- వాటంతటవే నీటినీ, లోపలి భాగాన్నీ శుభ్రం చేసుకునే వాటర్‌బాటిళ్లను తయారుచేస్తున్నాయి. యూవీకాంతితో పనిచేసే ఈ బాటిళ్లలో రెండు రకాల మోడ్స్‌ ఉంటాయి. మొదటి మోడ్‌లో పెడితే నిమిషంలో 99.99, రెండో మోడ్‌లో ఉంచితే మూడు నిమిషాల్లో 99.9999 శాతం సూక్ష్మజీవుల్ని పోగొట్టేలా వీటిని డిజైన్‌ చేశారు. యూవీ-సి కాంతితో పనిచేసే ఈ సీసాల్ని వాడకాన్ని బట్టి రెండు వారాల నుంచి రెండు నెలలకోసారి ఛార్జ్‌ చేసుకుంటే సరిపోతుందట. అన్నింటికన్నా సీసాలోపల బ్రష్షుని దూర్చి కడిగే బాధా బ్యాక్టీరియా, వైరస్సుల బెడదా తప్పుతుంది.

మాస్క్‌ కేస్‌!

మాస్క్‌... ఇప్పుడనే కాదు, మున్ముందూ మనకో అత్యవసర యాక్సెసరీనే. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌ పెట్టుకునే బయలుదేరినా ఎప్పుడైనా మర్చిపోతామన్న భయంతోగానీ లేదా దాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడుగానీ ముందు జాగ్రత్తగా బ్యాగులోనూ మరొకటి పెట్టుకోక తప్పనిసరి పరిస్థితి. అయితే అన్నింటితో కలిపి పెట్టేస్తే, బ్యాగులోని ధూళిరేణువులతోపాటు అక్కడ ఉన్న సూక్ష్మజీవులూ దానికి అతుక్కునే ప్రమాదం ఉంది. అందుకే అనేక కంపెనీలు మాస్క్‌ కేసుల్ని తయారుచేస్తున్నాయి. నునుబెబె వంటి కంపెనీ చేసిన బాక్సులో మాస్క్‌ను ఇరవై నిమిషాలు ఉంచితే అది అధికంగా ఉన్న తడిని పీల్చి, వాసన రాకుండానూ చేస్తుందట. సన్‌ నొమాడ్‌ కంపెనీ యూవీకాంతిని చొప్పించి చేసిన కేస్‌ అయితే, వాడిన మాస్క్‌నీ పూర్తిగా శుభ్రం చేసేస్తుంది. పలుచగా తేలికగా ఉండే ఈ కేసులు ఎంత చిన్న పర్సులోనయినా సులభంగా
పట్టేస్తాయి. మగవాళ్లయితే జేబులోనూ పెట్టుకోవచ్చు.

ఆ లైటుతో అన్నీ శుభ్రం!

బయటకు వెళ్లి వచ్చిన వెంటనే దుస్తులయితే ఉతకడానికి వేస్తాం. కానీ చేతిలోని ఫోనూ కీఛెయినూ వ్యాలెట్టూ... వంటి చిన్న వస్తువుల్ని ఏం చేస్తాం? అసలే ఫోనుమీద వేలకొద్దీ బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చైనాకి చెందిన ఫ్రాంక్‌ చూ అనే డిజైనర్‌, యూవీ కాంతితో పనిచేసే స్టెరిలైజ్‌డ్‌ ల్యాంప్‌ని డిజైన్‌ చేశాడు. టేబుల్‌ల్యాంప్‌లా ఉండే దీనికి అడుగున ఉన్న బౌల్‌లాంటి దాంట్లో చిన్న వస్తువులన్నీ వేసి చిన్నగా టచ్‌ చేస్తే చాలు, లైటు వెలిగి వస్తువుల్ని నిమిషంలో శుభ్రం చేసేస్తుంది. ఇదిలా ఉంటే, ఒబ్లియో-ఎ అనే కంపెనీ ఏకంగా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను రూపొందించింది. గ్లాసులా ఉండే ఇందులో ఫోను పెడితే, అందులోని యూవీ ఎల్‌ఈడీ టెక్నాలజీ దాన్ని శుభ్రం చేయడమే కాదు, ఛార్జింగ్‌ కూడా చేసేస్తుందట.

ఇంకా, ఇంట్లోని వస్తువులమీద ఉన్న సూక్ష్మజీవుల్ని నాశనం చేసేందుకు చిల్లీ ఇంటర్నేషనల్‌ సంస్థ కిల్లర్‌ 100 బ్లూ రే మెషీన్‌ని తీసుకొస్తే; ఎలాంటి హానికర రసాయనాలూ లేకుండా కేవలం ఎలక్ట్రోలైజ్‌డ్‌ నీటి ద్వారానే స్టెరిలైజ్‌ర్‌, డియోడరైజర్‌, ఎయిర్‌ప్యూరిఫయర్‌గానూ పనిచేసే ఈవో బ్లాస్టర్‌ను రూపొందించింది ఎగ్రెట్‌ కంపెనీ. ఇలాంటివే మరెన్నో..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details