ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / priya

చీకటి దారిలో కొత్త వెలుగులు వెతికింది యువ టెకీ

ఉద్యోగం పోయిందని ఏడుస్తూ కూర్చోలేదు. భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడనూ లేదు. ఆర్థిక సమస్యల రూపంలో తన ఆశలకు అడ్డంకులెదురైనా తట్టుకుని నిలబడింది. చీకటి కమ్ముకున్న దారిలో కొత్త వెలుగులు వెతికింది. తనలాంటి ఎందరికో ఆ వెలుగుల్ని వెతికే మార్గం చెబుతూ.. ఆదర్శంగా నిలుస్తోంది.. హైదరాబాద్‌కు చెందిన యువ టెకీ శారద.

software engineer at vegetable vendor
చీకటి దారిలో కొత్త వెలుగులు వెతికింది యువ టెకీ

By

Published : Jul 27, 2020, 10:25 AM IST

Updated : Jul 27, 2020, 3:12 PM IST

కొలువు పోగొట్టుకొని.. ఐదంకెల జీతాన్ని వదులుకుని వచ్చేసింది ఇంటికి. దిగాలుగా చూశాడు తండ్రి. భవిష్యత్తు ఎలా? అని చూస్తుండిపోయారు ఇంట్లోవాళ్లు. శారద ముఖంలో ఏ ఆందోళనా లేదు. మర్నాడు ఉదయాన్నే లేచి తయారై చకచకా బయటకు వెళ్లిపోయింది.

హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో ఫుట్‌పాత్‌పై కూరగాయల కొట్టు. ఒకప్పుడు బండెడు సంసారాన్ని నెట్టుకొచ్చిన దుకాణం అది. ఈ కష్టకాలంలో ఆదుకోకపోతుందా అనే నమ్మకంతో కౌంటర్‌ మీద కూర్చుంది శారద. తండ్రి వెంకటయ్య ఆశ్చర్యపోయాడు. కూతుర్ని తేరిపారా చూశాడు. శారద ముఖంలో ఏ ఆందోళనా కనిపించలేదు. ఆమె కళ్లల్లో నమ్మకం. నిన్నటి దాకా.. టిప్‌టాప్‌గా తయారై సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు కనిపించిన కూతురే.. ఇప్పుడు అక్కడా కనిపిస్తోంది.

పాతికేళ్ల కిందట వరంగల్‌ జిల్లా గన్నారం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు వెంకటయ్య, సారమ్మ దంపతులు. వెంట ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారం పెట్టుకొని పిల్లలను చదివించారు. కూరగాయలు అమ్ముతూనే.. కూలీ పనులకూ వెళ్లేవాళ్లు దంపతులిద్దరూ.

వీరి రెండో కూతురే శారద. బాగా చదివేది. చురుగ్గా ఉండేది. బీటెక్‌ చదివి.. 2016లో దిల్లీ దగ్గర్లోని గురుగ్రామ్‌లో పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం తెచ్చుకుంది. 2018లో హైదరాబాద్‌కు వచ్చి.. ఇక్కడ మరో కంపెనీలో చేరింది. పెద్ద కూతురు ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. చిన్న కూతురు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ఉద్యోగి. కొడుకు కూరగాయల వ్యాపారం చూసుకునేవాడు. హాయిగా గడుస్తున్నాయ్‌ రోజులు.

కరోనా కల్లోలంతో శారద కొలువు పోయింది. అయినా అధైర్యపడలేదామె! భవిష్యత్‌ గురించి బెంగ పడలేదు. కూరగాయల దుకాణం నిర్వహిస్తూ.. తనవారికి అండగా ఉంటోంది. ఉద్యోగాలు పోయాయని బావురుమంటున్న ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ.. దటీజ్‌ శారద అనిపించుకుంటోంది. ‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసి.. కూరగాయలు అమ్ముతుంటే నామోషీగా లేదా అంటున్నారు కొందరు. కానీ, నా స్వశక్తితో చేస్తున్న పని ఇది. ఇందులో అవమానమేముంది. కష్టాన్ని నమ్ముకొని.. ధర్మబద్ధంగా ఏ పని చేసినా మంచిదే కదా!’ అంటోంది శారద.

ఇవీ చూడండి:ఆ రైతింట 'సోనూ'లిక ట్రాక్టర్​

Last Updated : Jul 27, 2020, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details