ఇప్పుడు ప్రపంచమంతా పర్యావరణహిత మంత్రమే జపిస్తోంది. భోజనం చేసే పళ్లాల నుంచి టీ తాగే కప్పులదాకా ప్రకృతికి హాని చేయని వస్తువులు వాడాలన్నదే ప్రకృతి ప్రేమికుల ఆకాంక్ష. ప్రభుత్వాలూ ఇదే విషయాన్ని చెబుతున్నా... ప్రజలు కొత్త వస్తువులకీ, పద్ధతులకీ మారడం మాత్రం కొంత నత్తనడకనే సాగుతోంది. కానీ, ఇంతకాలం మనమంతా ప్రకృతికి పెనుముప్పుగా భావిస్తూ వచ్చిన మతాబులు మాత్రం ఎవరూ ఊహించనంత వేగంగా పర్యావరణహితంగా మారిపోతున్నాయి! ఈ దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌గా కొత్త అవతారంతో మనముందుకొస్తున్నాయి. సుప్రీంకోర్టూ, శాస్త్ర పరిశోధన వ్యవస్థ, మతాబుల పరిశ్రమా... మూడూ కలిసి ఈ ఏడాది సాధించిన ఓ అద్భుతం ఇది.
ఆందోళనతో మొదలై..
చెవుల్ని చిల్లులుపెట్టే శబ్దాలూ, ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేసే పొగాలేని దీపావళి ఉండాలనే వాదన ఎప్పటినుంచో ఉన్నా... ఈ దశాబ్దంలో అది ఉద్యమరూపాన్ని దాల్చింది. ముఖ్యంగా దీపావళి తర్వాతి రోజు కొన్ని నగరాల్లో గాలిలోని ‘పీఎం 2.5’ రేణువుల సంఖ్య భారీగా పెరుగుతోందని గ్రహించారు. వెంట్రుకవాసికన్నా సన్నటి సూక్ష్మ రేణువులివి. సాధారణంగా వీటి సంఖ్య 250 మైక్రో గ్రాములకంటే ఎక్కువుంటే ప్రజలుఅనారోగ్యానికి గురవుతారని చెబుతారు. అలాంటిది, దీపావళి తర్వాత అది 800 మైక్రో గ్రాములు ఉంటున్నట్టు తేలింది! చిన్నారులనీ, ఊపిరితిత్తుల సమస్యలున్న వాళ్లనీ ఇది ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే, దిల్లీకి చెందిన రెండేళ్లు కూడా నిండని ముగ్గురు పిల్లల తరఫున వారి తండ్రులు సుప్రీంకోర్టులో మతాబుల పరిశ్రమని మూసివేయాలంటూ 2015లో కేసువేశారు. దానిపైన విచారణ జరిపిన కోర్టు 2017లో టపాసుల తయారీపైన ‘తాత్కాలిక’ నిషేధాన్ని విధించింది. ఇది నాణేనికి ఓ వైపు. మరోవైపు, నిషేధంతో ఈ పరిశ్రమని నమ్ముకున్న దాదాపు పాతికలక్షలమంది పొట్టకొట్టొద్దంటూ ఆందోళన మొదలైంది. దాంతో అటు పరిశ్రమా దెబ్బతినకుండా, ఇటు పర్యావరణానికి పెద్దగా హాని లేకుండా కొత్తతరం మతాబుల్ని తయారు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అలా, కొత్తతరహా టపాకాయల్ని సృష్టించడానికి శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్‌ఐఆర్) శాస్త్రవేత్తలు నడుం బిగించారు.