బయట భోజనాలు చేసేవారు కాస్తా ఇప్పుడు పూర్తిగా ఇంటి భోజనానికి పరిమితం అయ్యారు. పరిశుభ్రత పెరిగింది. అందం మీద ఆసక్తి అధికం అయింది. దీనికి సంబంధించిన వస్తువుల అమ్మకాలు పెరిగినట్లు నీల్సన్ విశ్లేషించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించింది.
అనిశ్చితికి సిద్ధమవుతున్నారు...
‘కరోనా’తో ఉద్యోగాలు, జీతభత్యాల్లో కోత, వ్యాపార సంస్థలు మూతబడిపోవటంతో ప్రజల్లో అభద్రత ఏర్పడింది. దీంతో ఎక్కువ మంది తీవ్రమైన ఒత్తిడికి లోనుకావటం, మానసిక సమస్యలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో ఇంతకంటే కష్టం కాలం ఎదురయితే ఎలా..? అనే సందేహం ఏర్పడింది. ఫలితంగా ముందు జాగ్రత్త పెరిగింది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం, తప్పనిసరి అయితేనే ఖర్చు పెట్టటం వంటి అలవాట్లు ఏర్పడ్డాయి. అదే సమయంలో ఆరోగ్యంపై దృష్టి సారించటం, వ్యాయామం చేయటం కనిపిస్తోంది.
పరిశుభ్రత, రోగ నిరోధక శక్తి పెంచుకునే దిశగా..
‘కరోనా’ భయంతో ప్రజల్లో పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచన వచ్చి అదే అలవాటుగా మారింది. ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, బట్టలు, ఇతర వస్తువులను శుభ్రంగా పెట్టుకోవటం... సాధారణ చర్యలు అయ్యాయి. ఈ అలవాట్లు భవిష్యత్తులోనూ దీర్ఘకాలం పాటు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల లిక్విడ్ సోప్‌లు, రోగ నిరోధక శక్తిని పెంపొందించే మందులు, ఇతర సాధ నాలకు గిరాకీ పెరిగిపోయింది. చవన్‌ప్రాశ్, తేనె వాడకం అధికం అయింది.
దూరం... దూరం...
ప్రజలు గతంలో మాదిరిగా ఒకరికొకరు దగ్గరగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ‘భౌతిక దూరం’ పాటించటం అనేది సాధారణ చర్యగా మారింది. నగరాల్లోని ప్రజలు ఏమైనా వస్తువులు కావాలంటే ‘హోమ్ డెలివరీ’ తెప్పించుకుంటున్నారు. ఈ-కామర్స్ పోర్టళ్లలో తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తుంటే అవి ఇంటికే వస్తున్నాయి. ప్రయాణాలు దాదాపు మానుకున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు వచ్చే ఆరు నెలల పాటు దూర ప్రయాణాలు చేసేదే లేదని స్పష్టం చేశారు.