ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

పసిప్రాయాన్ని కర్కశంగా కాటేస్తోన్న సాంకేతికత..! - Say no to sexual harassment

సమాజంలో ఆడపిల్లంటే.. ఆటబొమ్మగా మారింది. అపరిచితుల పరిచయాలు.. తెలిసినవారితో పరిధి దాటే స్నేహాలు.. అరచేతిలో అశ్లీలం.. వనితను కాటేస్తున్నాయి. విశృంఖలత, విచ్చలవిడి సంస్కృతి వల్ల తప్పటడుగులు పడుతున్నాయి. ఆకర్షణ, పరిచయాలతో ఆడపిల్లలు మోసపోతున్నారు. మృగాళ్ల మాయమాటలకు అతి దారుణంగా మోసపోతున్నారు.

Sexual Harassment Workplace

By

Published : Nov 4, 2019, 1:47 PM IST

పని ఒత్తిడి.. సంపాదన క్రమంలో తీరిక లేకుండా గడిపే తల్లిదండ్రులు.. ఒంటరితనంలో నేనున్నానంటూ అరచేతిలోనే అన్నీ చూపించే సాంకేతికత.. మీట నొక్కితే మేటలకొద్దీ వచ్చిపడే అశ్లీల వెబ్‌సైట్లు.. పలకరిస్తే చాలు ప్రేమ అని పొరపాటుపడే యవ్వనపు ఆకర్షణ.. ఇవన్నీ కలిసి పిల్లలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.

శృంగారం చేయడం.. గర్భవిచ్ఛిత్తికి సిద్ధపడడం

తెలంగాణలోని హయత్‌నగర్‌లో జరిగిన కీర్తి ఉదంతమే ఈ పెడధోరణికి నిదర్శనం. పదహారేళ్లకే కీర్తి శృంగారానికి వెనుకాడకపోవడం, గర్భం దాల్చడం, ఆ తర్వాత అన్నయ్య అని పిలిచే మరో యువకుడి సాయంతో గర్భవిచ్ఛిత్తికి సిద్ధపడడం.. ఆ సాకుతో బెదిరించి అతడు కీర్తిని వలలో వేసుకోవడం.. ఆ వ్యామోహం చివరకు కీర్తి తన తల్లినే కడతేర్చేవరకూ దారితీసిన ఉదంతం నేపథ్యంలో పసిప్రేమలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

Sexual Harassment Workplace

పదో తరగతి నుంచే మొదలు!

ఒకప్పుడు యుక్తవయసులో యువత ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు కౌమారం కూడా దాటని పిల్లలకు చేరాయి. పదో తరగతిలోనే ప్రేమ, పగ మొదలవుతున్నాయి. తమ విద్యార్థుల్లో కొంతమంది వ్యవహార శైలి చూస్తే ఒళ్లు జలదరిస్తోందని నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్‌ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్‌ వాపోవడం.. వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

బయటికొచ్చేవి కొన్నే.. మరి కేసులెన్ని..?

  1. ప్రభుత్వశాఖలో పనిచేస్తూ మరణించిన ఒక ఉద్యోగికి ముగ్గురు కుమార్తెలు. పదో తరగతి చదువుతున్న అమ్మాయికి ఫేస్‌బుక్‌లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ వ్యామోహంలో పడిన బాలిక ఒకరోజు ఇంట్లో నుంచి డబ్బు తీసుకొని పారిపోయింది. ఇద్దరూ కలిసి ఒకరోజంతా రిసార్టులో ఉన్నారు. మర్నాడు ఆ బాలుడు చెప్పాపెట్టకుండా పారిపోయాడు. ఆందోళనలో ఉన్న ఆ అమ్మాయిని పోలీసులు రక్షించారు. ప్రేమపేరిట అబ్బాయి చేసిన మోసాన్ని తెలుసుకుని కొన్ని నెలల పాటు ఆమె మానసిక రుగ్మతలోకి వెళ్లిపోయింది.
  2. ఒక రాంగ్‌ మిస్డ్‌కాల్‌తో పొరుగు రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల ఒక అమ్మాయికి అబ్బాయి పరిచయమయ్యాడు. కొన్నినెలల పాటు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఆ మాటలు నమ్మి హైదరాబాద్‌కు వచ్చేసింది. రైల్వేస్టేషన్‌కు చేరుకున్న తరువాత అబ్బాయి నుంచి ఫోన్‌ రాలేదు. పోలీసులు రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కౌన్సెలింగ్‌ తరువాత మామూలు స్థితికి చేరుకుంది.
  3. పేదరికంలో ఉన్నప్పటికీ చక్కగా చదువుకుంటున్న ఒకమ్మాయి తన తోటి స్నేహితులతో సమానంగా స్మార్ట్‌ఫోన్‌ కావాలని తండ్రిని కోరింది. ఈ ఫోన్‌ అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. మిస్డ్‌కాల్‌ రూపంలో పరిచయమైన ఒక అబ్బాయి చేతిలో మోసపోయింది. ఫోన్‌ కొనివ్వకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదంటూ ఒక తండ్రి విలపించాడు.

పోలీసుల వరకు వెళ్లని కేసులెన్నో

  • 18 ఏళ్లలోపు అమ్మాయి కనిపించకుండా పోయిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ పరువు పోతుందన్న భయంతో ఫిర్యాదు చేయని కేసులు ఎన్నో ఉంటున్నాయి.
  • కొన్ని సందర్భాల్లో బాధితురాలి ఫిర్యాదు చేసినప్పటికీ మోసం చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఆలస్యమవుతోంది. ఒక కేసులో అమ్మాయి మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత నిందితుడిని పట్టుకునేందుకు ఏడు నెలలు పట్టింది. అప్పటికే ఆమె ఏడు నెలల గర్భవతి. చివరకు పాపకు జన్మనిచ్చి ప్రభుత్వ సంరక్షణ గృహానికి అప్పగించి వెళ్లిపోయింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రేమ పేరిట ఏమీ తెలియని చిన్నారులు మోసాలకు గురవుతున్నారు. కౌమార దశలోని ఆకర్షణను ప్రేమగా గుడ్డిగా నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

స్మార్ట్‌ఫోన్లలో అశ్లీలం..

  1. స్మార్ట్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడం వల్ల అశ్లీలం అరచేతిలోకే వచ్చింది.
  2. ఇంటర్నెట్‌ వినియోగం పెరిగి అవకాశం దొరికినప్పుడల్లా అశ్లీల వెబ్‌సైట్లు చూస్తున్నారు.
  3. ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాట, స్నేహితుల స్నేహితులతో పరిచయాలు పెడధోరణివైపు నడిచేలా చేస్తున్నాయి.
  4. ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలే ఎక్కువగా మోసపోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
  5. మోసపోతున్న బాలికల వయసు 9-15 ఏళ్లుగా నమోదవుతోంది.
  6. 50 శాతం: ప్రతియేటా పెరుగుతున్న కేసుల సంఖ్య.
  7. 14 - 15 ఏళ్లు: అత్యధిక కేసులు నమోదవుతున్న వయసు.
  8. గత ఐదేళ్లుగా ప్రేమపేరిట మోసపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది.

‘ప్రస్తుతం సమాజంలో తొమ్మిదో తరగతి నుంచే చిన్నారుల్లో ఆకర్షణ పెరుగుతోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో హద్దులు దాటుతున్నారు. తాము చేస్తున్న తప్పును గుర్తించడం లేదు. చివరకు అబ్బాయి ముఖం చాటేయడం సర్వసాధారణమైంది’

-పిల్లల మీద అత్యాచారాలపై అధ్యయనం చేస్తున్న నిపుణురాలు

‘మా దగ్గరకు వచ్చే కేసులను వింటుంటే కన్నీళ్లు వస్తుంటాయి. ప్రేమపేరిట మోసం చేసి వ్యభిచార గృహాలకు విక్రయించిన ఘటనలు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో పాఠశాలల్లో అనారోగ్యానికి గురైనపుడు వైద్యుల వద్దకు తీసుకెళ్తే జరిగిన అనర్థం బయటపడుతోంది’
- ఒక పోలీసు అధికారి

‘పిల్లలు ఇప్పుడు చాలా చురుగ్గా ఉంటున్నారు. తల్లిదండ్రులు వారేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఈ విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అవసరమైతే టెక్నాలజీపై అప్‌డేట్‌ కావాలి. ఫేస్‌బుక్‌లో ఎవరిని కలిశారు.. వీడియోలేం చూశారు.. వెబ్‌ బ్రౌజింగ్‌లో ఏ వెబ్‌సైట్లు తెరిచారో అప్పుడప్పుడూ అయినా చూస్తూ ఉండాలి. పిల్లలు వినియోగించే ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు సెక్యూరిటీ సెట్టింగ్స్‌, ఫైర్‌వాల్‌ ఏర్పాటుచేస్తే తప్పుదోవ పట్టించే వెబ్‌సైట్ల నుంచి వారిని కొంత వరకు కాపాడుకోవచ్చు’
- పిల్లల మానసిక నిపుణురాలు

ABOUT THE AUTHOR

...view details