మేఘాలయ రాష్ట్రంలో కాంగ్‌థాంగ్ అనే ఊరు ఒకటి ఉంది. అక్కడ ప్రజలకు మనలాగా పేర్లు ఉండవు. ‘మరి ఎలా పిలుచుకుంటారు?’ అని ఆలోచిస్తున్నారు కదూ!! కూని రాగాలతోనే ఒకరిని ఒకరు పిలుచుకుంటారు. ఎందుకంటే, అది వారి ఆచారం అని, పూర్వీకుల నుంచి ఆ సంప్రదాయం ఉందని చెబుతున్నారు.
30 సెకన్ల రాగం
ఈ మారుమూల గ్రామంలో జనాభా 700కి పైగా ఉంటుంది. ఇక్కడ పుట్టిన వారికి ఈల శబ్దం, పక్షుల అరుపులు లేదా సినిమా పాటల్లోని ట్యూన్ ఆధారంగా పేర్లు పెడుతుంటారు. అందరి పేర్లు వేర్వేరుగా.. పదాలు రాకుండా రాగాలతోనే 30 సెకన్లు ఉండేలా చూస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం పేరు కాకుండా మొదటి ఆరు సెకన్లు, పని మీద ఎవరైనా బయటకు వెళ్తే పూర్తిగా పిలుస్తారు. అడవిలో ఎవరైనా చిక్కుకుపోతే.. తమ పేరును అదే కూనిరాగాన్ని గట్టిగా పాడతారట. అది విని ఊళ్లో వాళ్లు వెళ్లి ప్రమాదంలో ఉన్నవారికి సహాయపడతారు.
తల్లి, తండ్రి వేర్వేరుగా..
పుట్టిన బిడ్డకు పేరు పెట్టేందుకు పెద్దలు భారీగా ఆలోచిస్తారు. తల్లి, తండ్రి వేర్వేరుగా కొన్ని రాగాలను కూరుస్తారు. అంతా కలిసి వాటిలో ఏది బాగుంటే దాన్ని ఎంపిక చేస్తారట. మనం స్నేహితులు, బంధువుల పేర్లను గుర్తుపెట్టుకున్నట్లే.. ఇక్కడి ప్రజలు రాగాలను గుర్తుపెట్టుకుంటారు. ఇలా రాగాలతో పేర్లు పెట్టే పద్ధతిని ‘జిగవా యోబి’ అని అంటారు. అంటే, అక్కడి వారి భాషలో ‘అమ్మ ప్రేమ’ అని దానర్థమట. ఇప్పుడు పుట్టే పిల్లలకు మాత్రం పాఠశాలలో రికార్డుల కోసం మామూలు పేర్లు పెడుతున్నా.. ఊళ్లో మాత్రం కూనిరాగాలతోనే పిలుస్తారు. భలే ఊరు.. భలే పేర్లు కదూ..!!