కొవిడ్ కష్టకాలంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. అందరి కంటే తమకే అధికంగా కరోనా ముప్పు పొంచి ఉందని తెలిసినా వృత్తి ధర్మానికే ఓటు వేస్తున్నారు. ఈక్రమంలో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, కంటి మీద కునుకు లేకుండా కొవిడ్ రోగుల సేవలకే తమ సమయాన్నంతా కేటాయిస్తున్నారు. రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అత్యవసరమైతే తప్ప సెలవులు తీసుకోవడం లేదు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నాన్సీ అయేజా మిస్త్రీ అనే నర్సు కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. ప్రస్తుతం 4 నెలల గర్భంతో ఉన్న ఆమె ఓవైపు రంజాన్ ఉపవాస దీక్ష పాటిస్తూ, మరోవైపు కొవిడ్ విధులకు హాజరవుతోంది. అక్కడి అటల్ కొవిడ్ సెంటర్‌లో రోజూ 8 నుంచి 10 గంటల పాటు కరోనా రోగులకు అవసరమైన సేవలందిస్తోంది.
డ్యూటీనే నాకు ముఖ్యమనిపించింది!
సాధారణంగా గర్భిణులు ఉపవాస దీక్షను పాటించడమే కష్టమైన పని. అలాంటిది గంటల పాటు కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా కొవిడ్ బాధితులకు సేవలందిస్తోంది నాన్సీ. కరోనా మొదటి దశ వ్యాప్తి సమయంలోనూ ఆమె ఇక్కడే విధులు నిర్వర్తించింది. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి అడిగితే.. ‘నేను గతంలో కూడా ఇక్కడ పనిచేశాను. అయితే ఈసారి నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. అయినా ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో నా డ్యూటీనే నాకు ముఖ్యమనిపించింది. దేవుడి దయ వల్ల పవిత్ర రంజాన్ మాసంలో రోగులకు సేవ చేసే అవకాశం లభించింది. ఇక కడుపులో బిడ్డ అంటారా... తన క్షేమం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. పైగా కరోనా నుంచి కోలుకున్న వారందరూ నన్ను, నాకు పుట్టబోయే బిడ్డను మనసారా ఆశీర్వదించి ఇంటికి వెళ్తున్నారు. ఈ దీవెనలే నా బిడ్డను రక్షిస్తాయి’ అంటూ చిరునవ్వుతో చెబుతోందీ కరోనా వారియర్.