ప్రాణాధారమైన నీటిలో ఉండాల్సినవేంటి? ఉంటున్నవి ఏమిటి? ఆధునికత, సాంకేతికత పెరుగుతున్న నేటి రోజుల్లో అందరికీ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరిగింది. రక్షిత మంచినీరు తాగాలనే ఆలోచనా మొదలైంది. ఇదే సమయంలో ప్రభుత్వం సరఫరా చేసే తాగునీటిపై అపనమ్మకం ప్రైవేటు ఆర్వో ప్లాంట్లు డబ్బాల్లో నింపి సరఫరా చేస్తున్న నీళ్లపై మక్కువ పెంచుకునేలా చేసింది. వందలు కాదు వేల సంఖ్యలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఆర్వో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు.. కుటీరపరిశ్రమగా మారిన నీటి శుద్ధిప్లాంట్లలో నుంచి మార్కెట్‌లోకి వస్తున్న నీరు సురక్షితమేనా? ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా నిబంధనలను పాతేసి.. ఇష్టారాజ్యంగా ఏర్పాటవుతున్న ఆర్వో ప్లాంట్ల నుంచి తెచ్చుకుని మనం తాగుతున్న నీటిలో ఉండేవి ఏమిటి? లేనివి ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారు?
ఖనిజాలు.. లవణాలు ఉండాల్సిందే
నిజానికి ఎలాంటి రంగు, రుచి, వాసన లేని నీరే ఆరోగ్యానికి మూలం. తాగేనీటిలో సహజ సిద్ధంగా లవణాలు, క్యాల్షియం, మెగ్నీషియం, నైట్రేట్, ఫ్లోరైడ్‌లు నిర్దేశించిన మేరకు ఉండాలి. అవి పూర్తిగా లేకున్నా.. పరిమితికి మించి ఉన్నా ఆరోగ్యానికి నష్టం. నీటికి ఎలాంటి ఆమ్లత్వం ఉండకూడదు. టీడీఎస్, కొన్ని రకాల లవణాలను పూర్తిగా తొలగిస్తే మనిషి శారీరక అవసరాలకు అవి అందకుండా పోతాయి. ముఖ్యంగా టీడీఎస్, కాల్షియం, ఫ్లోరైడ్ వంటివి నిర్ణీత ప్రమాణాల మేరకు అవసరం. కాల్షియం తగినంత లేకపోతే ఎముకలు బలహీనపడటం, ఎదుగుదల తగ్గడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. అలాగే ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉంటే ప్రమాదకరం. అదే సమయంలో ఫ్లోరైడ్ తగినంత లేకపోతే దంత సమస్యలు వస్తాయి.
ఉపరితల జలాలే సురక్షితం
తాగునీటికి నదులు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లోని ఉపరితల జలాలు అత్యంత సురక్షితమైనవి. వీటిని సాధారణ విధానంలో శుద్ధి చేసి తాగడానికి వినియోగించుకోవచ్చు. కలుషితం కాని ఉపరితల జలాలను ఎక్కువగా ఉపయోగించే చోట నీటి సంబంధిత వ్యాధులకు అవకాశం తక్కువే. చాలా లోతునుంచి తీసుకునే భూగర్భజలాల్లో ఖనిజాలు, లవణాలు నిర్దేశించిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటాయి.
కోటిమందికి జలమండలి నీరు
హైదరాబాద్‌లో జలమండలి గోదావరి, కృష్ణాజలాలను ట్రీట్‌ప్లాంట్లలో శుద్ధి చేసి కోటిమందికి సరఫరా చేస్తోంది. నీటిలో సహజంగా ఉండే లవణాలు, ఖనిజాలు నిర్దేశించిన మేరకు ఉండేలా చూస్తుంది. ఇది నేరుగా తాగేందుకు అవసరమైన ప్రమాణాల మేరకు ఉంటుంది. నాణ్యత నియంత్రణ విభాగం అత్యాధునిక ప్రయోగశాలలో పరీక్షించి ప్రమాణాలను పర్యవేక్షిస్తుంది.
నిర్జీవంగా మారుస్తున్న ఆర్వో ప్లాంట్లు
ప్రమాణాలు పాటించకుండా, ఎలాంటి నియంత్రణ లేకుండా పుట్టగొడుగుల్లా వేల సంఖ్యలో పుట్టుకువచ్చిన రివర్స్ ఆస్మాసిస్ (ఆర్వో) నీటి శుద్ధి ప్లాంట్లలోని నీరు సురక్షితమని భావించి నిత్యం లక్షలమంది తాగుతున్నారు. ఆర్వో విధానంలో ప్రమాణాలు పాటించకపోవడంతో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ ప్లాంట్లలో నీటిలో సహజసిద్ధంగా ఉండే లవణాలు, ఖనిజాలను పూర్తిగా తొలగిస్తున్నారు. ఇలాంటి నీరు తాగితే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆర్వో ప్లాంట్లలో నీటిశుద్ధికి మెంబ్రేన్‌ను వినియోగిస్తారు. ఇది నీటిలో ఉండే లవణాలు, ఖనిజాలను పూర్తిగా తీసేస్తుంది. అలా ఇక్కడ సజీవ జలం కాస్తా నిర్జీవ జలంగా మారుతోంది. అంతేకాదు నీటిని శుద్ధి చేశాక లవణాలను, ఖనిజాలను నిర్దేశించిన మోతాదులో కలపాలి. కానీ ప్రముఖ సంస్థలు, బీఐఎస్ గుర్తింపు కలిగినవాటిలో మాత్రమే ఇది జరుగుతోంది. ఆర్వో ప్లాంట్లలో లవణాల శాతం టోటల్ డిజాల్వ్‌డ్ సాలిడ్స్‌ను తొలగిస్తారు. నీటిలో శరీరానికి అవసరమైన పీహెచ్ తగ్గి ఆమ్లత్వం పెరుగుతుంది. లవణాలను పూర్తిగా తీసేస్తారు. లేదంటే అతి తక్కువగా ఉంటాయి. ఈ నీటిని తాగితే కావాల్సిన లవణాలు అందక శరీరం నీరసపడిపోతుంది. అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె, రక్తనాళాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. కాల్షియం స్థాయి తగ్గితే ఎముకల పెరుగుదల లోపిస్తుంది. ఎముకల్లో పటుత్వం తగ్గి పెళుసుగా మారుతాయి.