తక్కువ సమయంలో ఎక్కువ దృఢత్వాన్ని పొందాలన్న ఉద్దేశంతో తెగ వ్యాయామాలు చేసేస్తుంటారు కొంతమంది. ఈ క్రమంలో ఇంట్లో అయినా, జిమ్‌లో అయినా వివిధ రకాల జిమ్ పరికరాలతో ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. అయితే ఇలా అతిగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్య పరంగా పలు నష్టాలున్నాయంటున్నారు నిపుణులు.
ఒత్తిడి తగ్గడం కాదు.. పెరుగుతుంది!
ప్రస్తుత జీవన విధానంలో ఒత్తిడి, ఆందోళనలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. మరి, వీటిని దూరం చేసుకోవడానికి చాలామంది ఎంచుకునే మార్గం వ్యాయామం. ఈ క్రమంలో డోపమైన్ అనే ఫీల్‌గుడ్ హార్మోన్ విడుదలవుతుంది. అదే వర్కవుట్స్ మితిమీరితే ఒత్తిడి తగ్గడానికి బదులు మరింతగా పెరుగుతుందట! ఇందుకు కారణం అధిక వ్యాయామం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఎక్కువగా విడుదలవడమే! తద్వారా మనసుతో పాటు శరీరం కూడా అలసిపోతుంది. అందుకే రోజూ అరగంట నుంచి నలభై నిమిషాల పాటు వ్యాయామాలకు కేటాయిస్తే చాలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఏడెనిమిది గంటల సుఖ నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు.
అది ఆకలిని పెంచుతుంది!
అధికంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. తద్వారా ‘అనొరెక్సియా’ అనే సమస్య తలెత్తుతుంది. దీనివల్ల ఆకలి పెరగడం, తీసుకునే ఆహారం విషయంలో అడ్డూ-అదుపూ ఉండకపోవడం, నచ్చిన పదార్థాలు మోతాదుకు మించి లాగించడం.. వంటివి చేస్తాం. ఇది క్రమంగా బరువు పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో మనం ఏ వ్యాయామాల వల్లైతే బరువు తగ్గి నాజూగ్గా మారాలనుకున్నామో.. అది నెరవేరదు సరికదా.. అధిక బరువు వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడే అవకాశాలూ లేకపోలేదు.
రోగనిరోధక వ్యవస్థపైనా ప్రభావం!
ఎలాంటి అనారోగ్యాలనైనా తట్టుకునే శక్తిని కూడగట్టుకోవాలంటే మన రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ముఖ్యం. కానీ అధికంగా వ్యాయామాలు చేసే వారిలో రోగనిరోధక శక్తి స్థాయులు క్రమంగా తగ్గుతున్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వ్యాయామాల పేరుతో శరీరాన్ని అతిగా కష్టపెట్టడం వల్ల దాని ప్రభావం జీవక్రియల మీద కూడా పడుతుందట! ఫలితంగా రక్తహీనత తలెత్తడంతో పాటు ఎముకల సాంద్రత కూడా తగ్గుతుందంటున్నారు నిపుణులు.