Omicron Variant: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై అంత భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అలా అని నిర్లక్ష్యంగా ఉండొద్దని భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షులు, ప్రఖ్యాత గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ శ్రీనాథరెడ్డి అన్నారు. అయితే దీనివల్ల ఇన్‌ఫెక్షన్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు. వ్యాక్సిన్ల ప్రభావమూ కొంతవరకు తగ్గుతోందన్నారు. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే అవకాశం కొవాగ్జిన్ తరహా టీకాలకు ఉందని ఆయన చెప్పారు. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా ఈ తరహా టీకాలు మెరుగైన రక్షణ కల్పించే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఇతర కారణాలతో ముప్పు పొంచి ఉన్నవారికి బూస్టర్ డోసు ఇవ్వాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిన నేపథ్యంలో.. ‘ఈటీవీభారత్’తో ముఖాముఖిలో డాక్టర్ శ్రీనాథరెడ్డి పలు అంశాలను వెల్లడించారు.
ఒమిక్రాన్.. కొత్త వేరియంట్ వచ్చేసింది. దీనిపై ప్రస్తుతమున్న టీకాలు పనిచేస్తాయా అనే సందేహాలున్నాయి?
Omicron Cases in India : టీకాల పనితీరు గురించి చర్చించడానికి ముందు.. వైరస్, టీకాల తయారీ గురించి తెలుసుకోవాలి. కరోనా వైరస్ ఎప్పటికప్పుడూ అతి వేగంగా ఉత్పరివర్తనాలు చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వినియోగిస్తున్న అత్యధిక వ్యాక్సిన్లు ఎక్కువగా ‘స్పైక్ ప్రొటీన్ల’పై కేంద్రీకృతమై రూపొందించినవే. వీటిలో కరోనా వైరస్‌లోని ‘స్పైక్ ప్రొటీన్’ జన్యుక్రమాన్ని విడదీస్తారు. వెలుపలికి తీసిన ‘స్పైక్ ప్రొటీన్’ను ‘ఎడినో వైరస్’తో సమ్మిళితం చేస్తారు. ఎడినో వైరస్ ఒక వాహకంగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోకి వెళ్లినా ఎటువంటి హాని కలగజేయదు. ‘స్పైక్ ప్రొటీన్ శరీరంలోకి వెళ్లగానే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించి దానిని ఎదుర్కొవడానికి వీలుగా యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. మళ్లీ తర్వాత ఎప్పుడైనా ఈ స్పైక్ ప్రొటీన్ ప్రవేశించినా.. శరీరం అందుకగుణంగా రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
Omicron Cases in Telugu states: కొవాగ్జిన్ తరహా టీకాలను నిర్జీవ కరోనా వైరస్ (ఇనాక్టివేటెడ్ వైరస్)తో తయారుచేస్తారు. ఇవి స్పైక్ ప్రొటీన్‌తో పాటు వైరస్‌లోని ఇతర భాగాలపైనా ప్రభావం చూపుతాయి. వైరస్‌లో స్పైక్ ప్రొటీన్ అనేది ఒక భాగం మాత్రమే. ఆ పదార్థం వచ్చి మన శరీరంలోని కణాలకు అతుక్కుపోతుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి అది మార్గం లాంటిది. సాధారణ భాషలో చెప్పాలంటే కరోనా వైరస్‌కు స్పైక్ ప్రొటీన్ తల లాంటిది. అయితే వైరస్‌కు ఇతర భాగాలు కూడా ఉంటాయి. ఇ ప్రొటీన్, ఎన్ ప్రొటీన్, ఓఆర్‌ఎఫ్ జన్యువు వంటివి ఉంటాయి. కొవాగ్జిన్ తరహా టీకాలు స్పైక్ ప్రొటీన్‌తో పాటు వైరస్‌లోని ఇతర భాగాలను కూడా లక్ష్యంగా చేసుకొని ఛేదిస్తాయి. ఒకవేళ వైరస్ ఉత్పరివర్తనం వల్ల స్పైక్ ప్రొటీన్‌లో మార్పులు వచ్చి సమర్థంగా ఎదుర్కోలేకపోయినా.. ఇతర భాగాలపైనా సమర్థంగా పనిచేసి రక్షణ కల్పిస్తుంది. అందువల్ల స్పైక్ ప్రొటీన్ ఆధారిత టీకాల కంటే.. ఇనాక్టివేటెడ్ టీకాలు ఒమిక్రాన్‌పైనా సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి.