కంచె చేనును మేస్తే? ఇక కాపాడేదెవరు? కొవిడ్-19 పిల్లలను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే పడేస్తోంది. జబ్బు నుంచి కాపాడే యాంటీబాడీలను విపరీతంగా పుట్టించి, శరీరానికి ఎదురు తిరిగేలా చేస్తోంది. సాధారణంగా ఏదైనా ఇన్‌ఫెక్షన్ తగ్గాక గానీ టీకా వేసుకున్నాక గానీ ఒంట్లో నిర్వీర్య (న్యూట్రలైజింగ్) యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. మళ్లీ ఎప్పుడైనా అవే బ్యాక్టీరియా, వైరస్‌లు దాడిచేస్తే ముందుండి ఎదుర్కొనేవి, వాటిని నిర్వీర్యం చేసేవి ఇవే. ఇలా ఆయా ఇన్‌ఫెక్షన్ల నుంచి జీవితాంతం కాపాడుతూ వస్తుంటాయి. మామూలుగానైతే కొవిడ్ యాంటీబాడీ పరీక్ష చేస్తే నిర్వీర్య యాంటీబాడీలు 30-50 వరకు కనిపిస్తుంటాయి. కానీ కొవిడ్ తగ్గిన తర్వాత (లక్షణాలు తలెత్తకపోయినా) పిల్లల్లో ఈ యాంటీబాడీల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
కొందరు పిల్లల్లో 100 కన్నా మించిపోతున్నాయి. దీనికి కారణం పిల్లల్లో యాంటీబాడీల ప్రతిస్పందన ఉద్ధృతంగా ఉండటమే. నిజానికి పిల్లల్లో రోగనిరోధకశక్తి పూర్తి స్థాయిలో రూపొందదు. కానీ రోగనిరోధక ప్రతిస్పందన మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరిలో టీకాలు సమర్థంగా పనిచేస్తుంటాయి. చిన్న వయసులోనే టీకాలు ఇవ్వటానికి కారణమూ ఇదే. అయితే కొవిడ్-19 బారినపడ్డ పిల్లల్లో జబ్బు తగ్గిన తర్వాత యాంటీబాడీల సంఖ్య అనూహ్యంగా, విపరీతంగా పుట్టుకొస్తుండటమే మిస్సీకి దారితీస్తోంది.
యాంటీబాడీలు ఆయా అవయవాల్లో వాపు ప్రక్రియను ప్రేరేపిస్తూ రకరకాల ఇబ్బందులకు బీజం వేస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే- కొవిడ్ తగ్గిన తర్వాత 2-3 వారాల నుంచి 2-3 నెలల వరకు మిస్సీ తలెత్తే అవకాశముండటం. కాబట్టి పిల్లల్లో ఎలాంటి అనుమానాస్పద లక్షణాలు కనిపించినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. జబ్బు తీరుతెన్నులు, లక్షణాలు, చికిత్సలపై ప్రజలతో పాటు డాక్టర్లకూ అవగాహన అత్యవసరం.
మూడు రకాలుగా..
మిస్సీలో మూడు రకాలున్నాయి.
1. టాక్సిక్ షాక్ సిండ్రోమ్
ఉన్నట్టుండి దాడి చేసే ఇందులో రక్తపోటు బాగా పడిపోతుంది. గుండె వేగం, ఆయాసం పెరుగుతాయి. చివరికి పిల్లలు షాక్‌లోకి వెళ్లిపోతారు.
2. గుండె పనితీరు మందగించటం
మామూలుగా గుండె పంపింగ్ సామర్థ్యం 70% వరకు ఉండాలి. వీరిలో ఇది 40% కన్నా తక్కువకు పడిపోతుంది. తగినంత రక్తం సరఫరా కాదు. గుండె చుట్టూ నీరు చేరుతుంది (పెరికార్డియల్ ఎఫ్యూజన్). ఊపిరితిత్తుల్లో, కడుపులోనూ నీరు చేరుతుంది. రక్తపోటు, గుండె వేగం తగ్గిపోవటంతో పాటు ఆయాసమూ ఎక్కువగా వేధిస్తుంది.
3. కవాసాకి మాదిరి జబ్బు
ఇందులో శరీరమంతా దద్దు, నొప్పులు తలెత్తుతాయి. కళ్లు, పెదాలు, నోరు ఎర్రగా అవుతాయి. పెదాలు పగిలిపోతుంటాయి. చిన్న పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. కాస్త పెద్ద పిల్లలైతే చిరాకు పడుతుంటారు. స్కాన్ చేస్తే కొందరిలో గుండె రక్తనాళాలు అక్కడక్కడా ఉబ్బిపోయి (అన్యూరిజమ్) కనిపిస్తాయి.
ఇతర జబ్బుల మాదిరిగానూ..
మిస్సీలో లింఫ్ గ్రంథులు, సూక్ష్మ రక్తనాళాలు ఎక్కువగా ప్రభావితం అవుతుండటం వల్ల ఇతరత్రా జబ్బులుగా పొరపడేలా చేస్తోంది. అపెండిక్స్ వాపు, పేగుల్లో లింఫ్ గ్రంథుల వాపు (మిసెంట్రిక్ లింఫాడెనైటిస్), జీర్ణకోశవ్యవస్థ వాపు (గ్యాస్ట్రైటిస్) మాదిరిగానూ కనిపిస్తోంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటివి బయలుదేరుతున్నాయి. అపెండిక్స్ వాపుగా భావించి, శస్త్రచికిత్స చేయిస్తున్నవారూ లేకపోలేదు. ఏడాదిలోపు పిల్లల్లో మూత్ర ఇన్‌ఫెక్షన్‌నూ తలపిస్తోంది. వీరిలో మూత్రంలో చీము కణాలు పెద్దమొత్తంలో ఉంటున్నాయి. మూత్రాశయం గోడల్లో వాపు తలెత్తి, ఎర్రగా అవుతుంది.
ఇన్‌ఫెక్షన్ లేకపోవటం వల్ల మూత్రంలో మంట వంటి ఇబ్బందులేవీ ఉండవు. దీన్నే స్టెరైల్ పయూరియా అనీ అంటారు. కొందరిలో మలద్వారం చుట్టూరా ఎర్రగా అయ్యి, చర్మం ఊడిపోవటమూ (పెరియానల్ ఎక్స్‌కోరియేషన్) కనిపిస్తోంది. మలంలో ఆమ్లగుణం పెరగటం, బ్యాక్టీరియా సంబంధ విషతుల్యాలు దీనికి కారణం కావొచ్చు. కొందరు పిల్లల్లో కాలేయ ఎంజైమ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగని కాలేయం వాపు (హెపటైటిస్) గానీ ఇన్‌ఫెక్షన్ గానీ ఏమీ ఉండవు. మామూలుగా రాళ్లు ఏర్పడినప్పుడు పిత్తాశయం వాపు (కొలిసిస్టైస్) తలెత్తుతుంటుంది. కానీ కొందరిలో రాళ్లు లేకుండానే పిత్తాశయం పూర్తిగా పైత్యరసంతో నిండిపోయి, వాపు తలెత్తుతోంది.
ఎప్పుడు అనుమానించాలి?
కొవిడ్‌లో జ్వరం అంతగా రాకపోయి ఉండొచ్చు గానీ మిస్సీలో 101-104 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు జ్వరం ఉండొచ్చు. ఇది విడవకుండా వేధించొచ్చు. అందువల్ల ఇంట్లో ఎవరికైనా కొవిడ్ వచ్చి తగ్గినా.. పిల్లలకు కొవిడ్ వచ్చి, తగ్గిన తర్వాతనైనా అకారణంగా తీవ్ర జ్వరం మొదలైతే మిస్సీయేమోనని అనుమానించాలి. చిరాకు, హఠాత్తుగా స్పహ తప్పటం, ఉన్నట్టుండి ఆయాసం రావటం వంటి లక్షణాలు కనిపిస్తే తాత్సారం చేయొద్దు. వీరిలో ప్రొటీన్ తగ్గిపోయి కాళ్లలో నీరు చేరొచ్చు. ఇది కాళ్ల వాపులకు దారితీస్తుంది. నాలుగేళ్ల లోపు చిన్నారుల్లో ఇది ఎక్కువ. కాబట్టి కాళ్ల వాపులు గమనిస్తే నిర్లక్ష్యం పనికిరాదు. శరీరం మీద దద్దు, నాలుక, పెదాలు ఎర్రగా అయ్యి పెదాలు పగిలిపోయినా, కళ్లు ఎర్రబడినా మిస్సీగా అనుమానించాలి.
కచ్చితంగా నిర్ధరిస్తేనే..
ఇతరత్రా జబ్బులను పోలి ఉంటుండటంతో మిస్సీని కచ్చితంగా నిర్ధరణ చేయటం చాలా ముఖ్యం. ఇందుకు కొన్ని పరీక్షలు ఉపయోగపడతాయి. ఇవి చికిత్స తీరుతెన్నులను నిర్ణయించుకోవటానికీ సాయం చేస్తాయి.
ఆర్‌టీపీసీఆర్ పరీక్ష: నిజానికి మిస్సీ కొవిడ్ తగ్గిన తర్వాత మొదలయ్యేదే అయినా కొందరికి కొవిడ్ ఉన్నప్పుడూ ఆరంభం కావొచ్చు. అందువల్ల ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయటం మంచిది.
యాంటీబాడీ పరీక్ష: మిస్సీని అనుమానిస్తే యాంటీబాడీ పరీక్ష తప్పనిసరి. ఐజీజీ, ఐజీఎం.. రెండింటిలో ఏది పాజిటివ్‌గా ఉన్నా కొవిడ్ వచ్చిపోయిందనే అర్థం. వీటి సంఖ్య విపరీతంగా పెరిగినట్టు తేలితే మిస్సీగానే భావించాలి.