కొవిడ్ రెండోదశ ఉధ్ధృతి ఇంకా ముగియనే లేదు. అప్పుడే మూడోదశ గుబులు మొదలైంది. ఈ దశలో చిన్నారులపై మహమ్మారి తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశముందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సర్కారు ఆ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టిపెట్టింది. తెలంగాణలో సుమారు 30 లక్షలమంది చిన్నారులు వైరస్ బారినపడే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరిలో సుమారు 6000-8000 మంది వరకూ ఐసీయూలో చికిత్స పొందే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇందులోనూ 1 శాతంమంది చిన్నారుల్లో ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సి)’ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బాలలకు మెరుగైన వైద్యసేవలందించడానికి సర్కారు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కొవిడ్ నిపుణుల కమిటీ సమావేశమై.. ముందస్తు సన్నాహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సర్కారు వైద్యం బలోపేతం
ప్రస్తుతం చిన్నారులకు ఏ కష్టమొచ్చినా హైదరాబాద్‌లోని నిలోఫర్ లేదా గాంధీ ఆసుపత్రులకు వెళ్లాల్సిందే. బోధనాసుపత్రుల్లో మినహా జిల్లాల్లో అయితే ప్రత్యేకంగా పిల్లల వార్డులే లేవు. దీంతో ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వ రంగంలో పిల్లల పడకలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లోనూ పిల్లల వైద్యానికి అవసరమైన పడకల సంఖ్యను పెంచనున్నారు.
ఆగస్టులోపే ప్రమాదకర కేసులు
కొవిడ్ తొలిదశలో చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించలేదు. రెండోదశలో మాత్రం ముప్పు కొద్దిగా పెరిగింది. గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో తొలి, మలి దశల్లో మొత్తం 81,967 మంది పిల్లలు కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ రెండు దశల్లోనూ ఒక శాతం కూడా ఆసుపత్రుల్లో ప్రమాదకర స్థితిలో చికిత్స పొందలేదని వైద్యవర్గాలు విశ్లేషించాయి. అయితే జూన్-ఆగస్టు మధ్య ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సి)’ కేసులు పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు నెలల్లోనే సుమారు 1000-1200 వరకూ ఈ కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. అందుకే ఇప్పటి నుంచే అప్రమత్తమవ్వాలని వైద్యశాఖ భావిస్తోంది. మూడోదశ కనీసం 2-3 నెలల పాటు ఉండే అవకాశం ఉంటుందని అంచనా.
మూడోదశలో సుమారు 30 లక్షల మంది వరకూ పిల్లలు కొవిడ్ బారినపడే అవకాశాలున్నాయని భావిస్తున్నా 24 లక్షలమందికి ఎటువంటి లక్షణాలూ ఉండకపోవచ్చని.. మధ్యస్థ లక్షణాలుండేవారు దాదాపు 6 లక్షలమంది ఉండవచ్చని అంచనా. వారిలోనూ ఐసీయూలో చికిత్స పొందాల్సిన అవసరం పడే వారు సుమారు 6000-8000 మంది వరకూ ఉండొచ్చని ఒక భావన. ఇన్ని వేలమంది బాలలకు ఐసీయూ సేవలు అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సాధ్యమైనంత వరకూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా వ్యాప్తిని ముందుగానే నియంత్రించాలనే వ్యూహాన్ని కూడా అమలు చేయాలని భావిస్తోంది.
ప్రత్యేకంగా 5,000 పడకలు
ప్రత్యేకంగా బాలల కోసం 5,000 పడకలను కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో 2000 వరకూ ఐసీయూ ఏర్పాట్లు ఉంటాయి. మిగిలినవాటిలో ఆక్సిజన్ సేవలు లభిస్తాయి. అధునాతన ప్రాణవాయు పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ కనీసం 20 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 10 ఐసీయూ వెంటిలేటర్ పడకలుంటాయి. బోధనాసుపత్రుల్లో స్థాయిని, అవసరాలను బట్టి పడకల సంఖ్యను పెంచుతారు.