ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

Vaccine: గర్భిణికి టీకా అభయం.. అపోహవీడి తీసుకోవడమే నయం - corona vaccine feeding mothers

అంతర్జాతీయ ప్రయోగ పరీక్షలు, అధ్యయనాలు.. స్థానిక అనుభవాలు, ముప్పులను దృష్టిలో పెట్టుకొని నిపుణులు చేసిన సూచనలు ఎట్టకేలకు ఫలించాయి.  కొవిడ్‌-19 టీకా ఇకపై గర్భిణులకూ అందుబాటులోకి రానుంది. కొవిడ్‌-19 తీవ్రమైతే గర్భిణులకు ప్రమాదకరంగా మారే ముప్పు ఎక్కువ. ఇది తల్లీ బిడ్డల ప్రాణాల మీదికీ రావొచ్చు. కరోనా రెండో విజృంభణలో గర్భిణులు సైతం మృత్యువాత పడటమే దీనికి నిదర్శనం. ఇలాంటి కరోనా కంపిత వాతావరణంలో గర్భిణులకు ఇది నిజంగా తీపి కబురే. ఇప్పుడు కావాల్సిందల్లా సందేహాలు, అపోహలు, భయాలను పక్కనపెట్టి టీకా తీసుకోవటానికి సన్నద్ధం కావటమే.

corona
corona

By

Published : Jul 6, 2021, 11:38 AM IST

దృష్టం కొద్దీ కొవిడ్‌-19 బారినపడ్డా గర్భిణుల్లో చాలామందికి ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు. కొందరికి మామూలు లక్షణాలతోనే తగ్గిపోతోంది. సుమారు 90% మంది ఇలాంటివారే. శిశువుల్లోనూ ఎవరికీ అవయవాల లోపం రావటం లేదు. కానీ కొందరిలో నెలలు నిండకముందే కాన్పు అవటం, ఉమ్మనీరు తగ్గటం, పిల్లలు కాస్త తక్కువ బరువుతో పుట్టటం వంటివి కనిపిస్తున్నాయి. అంతే తప్ప పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండటం లేదు. ఒకసారి ఇన్‌ఫెక్షన్‌ నుంచి బయటపడితే అంతా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే జబ్బు తీవ్రమైతేనే ప్రమాదం. దీంతో ఆరోగ్యం వేగంగా క్షీణించొచ్చు. ఇది పిండానికీ హాని చేయొచ్చు. గర్భిణుల్లో సహజంగానే రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. శరీరం పిండాన్ని తిరస్కరించకుండా ఉండటానికిది రక్షణగా తోడ్పడుతుంది. అయితే దీంతో ఇన్‌ఫెక్షన్లు తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదు.

మరోవైపు పిండం ఎదుగుతున్నకొద్దీ గర్భసంచి పెద్దగా అవుతుంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులు వ్యాకోచించటం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యుమోనియా వస్తే తట్టుకోవటం కష్టం. ఇది ఊపిరితిత్తులు విఫలమవటానికి దారితీయొచ్చు. ఆయాసం ఎక్కువగా రావటం, విడవకుండా దగ్గు, జ్వరం ఎక్కువవుతూ రావటం, ఆక్సిజన్‌ శాతం తగ్గటం, వాపుప్రక్రియ సూచికలు పెరగటం వంటివి జబ్బు తీవ్రమవుతోందనటానికి సంకేతాలే. అధిక రక్తపోటు, ఊబకాయం, అప్పటికే రక్తం గడ్డలు ఏర్పడే స్వభావం ఉండటం, 35 ఏళ్లు పైబడిన గర్భిణుల్లో జబ్బు తీవ్రమయ్యే ముప్పు ఎక్కువ. కాబట్టి ముందు నుంచే కొవిడ్‌-19 బారినపడకుండా ఇతరులకు దూరంగా ఉండటం, మాస్కు ధరించటం, తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకపోయినా చాలామంది కొవిడ్‌-19 బారినపడటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో గర్భిణులకు టీకా అందుబాటులోకి రావటం కొత్త భరోసా కల్పిస్తోంది. మనదగ్గర ఏటా 2 కోట్ల మంది పిల్లలు పుడుతున్నారని అంచనా. టీకాలతో తల్లి, బిడ్డ.. ఇద్దరి ప్రాణాలనూ కాపాడుకోవటానికి వీలుంటుంది.

ఇన్నాళ్లు ఎందుకివ్వలేదు?

ఇప్పటివరకు గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు కొవిడ్‌-19 టీకా ఇవ్వకపోవటానికి కారణం టీకా ప్రయోగ పరీక్షల్లో వీరిని చేర్చకపోవటం. టీకా ప్రక్రియను వీలైనంత త్వరగా ఆరంభించాలనే ఉద్దేశంతో ఎలాంటి జబ్బులూ లేని ఆరోగ్యవంతుల మీదే ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. గర్భధారణ సమయంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. టీకాతో పిండానికి ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందనేది స్పష్టంగా తెలియదు. దీంతో ప్రాణాలను పణంగా పెట్టటం ఇష్టం లేక ప్రయోగ పరీక్షలు నిర్వహించలేదు. నిజానికి టీకా ప్రయోగ పరీక్షలేవైనా సరే.. గర్భిణులపై ఆలస్యంగానే ఆరంభిస్తుంటారు. కొవిడ్‌ టీకాల విషయంలోనూ దీన్నే అనుసరిస్తూ వచ్చారు.

రెండోసారి అనర్థంతో గుణపాఠం

కొవిడ్‌-19 రెండో విజృంభణలో గర్భిణులు కూడా మరణించారు. మొదటిసారి కన్నా రెండోసారి ఎక్కువమంది ఇన్‌ఫెక్షన్‌ బారినపడటం, తీవ్రత ఎక్కువగా ఉండటం, వైరస్‌ ప్రభావం భిన్నంగా ఉండటం వంటివన్నీ పెనుశాపంగా పరిణమించాయి. తొలిసారి విజృంభణ సమయంలో గర్భిణులు ఐసీయూలో చేరిన ఉదంతాలు చాలా అరుదు. కానీ రెండో విజృంభణ సమయంలో ఎంతోమందిని ఐసీయూలో చేర్చాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకే గర్భిణులకూ టీకా ఇవ్వటం మంచిదని గైనకాలజీ నిపుణులు ముందు నుంచే ప్రభుత్వానికి చెబుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వమూ సమ్మతించటం ముదావహం. ఇంతకన్నా ముందు పాలిచ్చే తల్లులకు టీకాలు ఇవ్వటం ఆరంభించారు. ఇవి తల్లికే కాదు, పిల్లలకూ రక్షణ కల్పిస్తున్నాయి. వీటితో తల్లి నుంచి పిల్లలకూ యాంటీబాడీలు సంక్రమిస్తున్నాయి. తాజాగా గర్భిణులకూ ఇవ్వచ్చని మార్గదర్శకాలు జారీచేశారు. టీకాతో ఒనగూరే ప్రయోజనాలతో పోలిస్తే నష్టాలు తక్కువగా ఉంటున్నందున గర్భిణులకు టీకా ఇవ్వచ్చనే ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు మేరకే మనదగ్గరా అనుమతించారు.

టీకాలు సురక్షితమేనా?

కొవిడ్‌-19 టీకా తీసుకున్నాక అది చాలావరకు కండర కణాలు, లింఫ్‌ గ్రంథుల్లోని రోగనిరోధక కణాలకే పరిమితమవుతుంది. డీఎన్‌ఏలో ఎలాంటి మార్పులు కలగజేయదు. అందువల్ల జన్యుపరమైన మార్పులేవీ తలెత్తవు. పైగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నవన్నీ మృత వైరస్‌ టీకాలు. కొవాగ్జిన్‌ టీకాను పూర్తిగా చనిపోయిన వైరస్‌తో తయారుచేశారు. సార్స్‌-కొవీ-2 ముల్లు ప్రొటీన్‌ను నిర్వీర్య అడినోవైరస్‌తో జతచేసి కొవిషీల్డ్‌ టీకాను రూపొందించారు. స్పుత్నిక్‌ టీకా కూడా అడినోవైరస్‌తో కూడుకున్నదే. వైరస్‌ ప్రొటీన్‌కు సంబంధించిన ఎంఆర్‌ఎన్‌ఏతో తయారుచేసినవి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు. వీటిల్లోనూ హానికారక వైరస్‌ ఏదీ ఉండదు. అందువల్ల గర్భిణికి, పిండానికి ఎలాంటి ముప్పూ ఉండదు. ఆ మాటకొస్తే గర్భిణులకు చాలాకాలంగా ఇన్‌ఫ్లూయెంజా, స్వైన్‌ఫ్లూ టీకాల వంటివి ఇస్తూనే ఉన్నాం. ఇవీ నిర్వీర్య వైరస్‌ టీకాలే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే కొవిడ్‌-19 టీకాల విషయంలో సందేహాలు, భయాలు అవసరం లేదు. వీటిని గర్భిణులకు ముందుగా అమెరికాలో ఇవ్వటం ఆరంభించారు. కొందరు గర్భం ధరించిన విషయం తెలియకుండానే టీకా తీసుకోవటం, వారికి ఎలాంటి అనర్థం తలెత్తకపోవటం శాస్త్రవేత్తలను ఆలోచింపజేసింది. వీరిని కొంతకాలం పరిశీలించిన తర్వాత ప్రత్యేకంగా గర్భిణులపైనా టీకా ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. గర్భిణులకు టీకా సురక్షితమని తేలటంతో అందరికీ సిఫారసు చేశారు. అక్కడ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలే ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిర్వీర్య, మృత వైరస్‌ టీకాలు తీసుకోవటానికి జంకాల్సిన అవసరం లేదు.

సార్స్‌-కొవీ-2 వేగంగా మారుతోంది. కొత్త కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. వీటిపైనా ప్రస్తుత టీకాలు బాగానే పనిచేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వైరస్‌ ఎంత మార్పు చెందినా ఎంతోకొంత రక్షణ లభిస్తుందని గుర్తించాలి.

దుష్ప్రభావాలుంటాయా?

అన్ని మందుల మాదిరిగానే టీకాతోనూ కొన్ని దుష్ప్రభావాలు ఉండొచ్చు. రెండు మూడు రోజులు కొద్దిగా జ్వరం, టీకా ఇచ్చిన చోట నొప్పి, ఒళ్లునొప్పులు, నలత వంటివి వేధించొచ్చు. కొందరికివి వారం పాటు ఉండొచ్చు. వైరస్‌ ముల్లు ప్రొటీన్‌తో రక్తం గడ్డలు ఏర్పడే ప్రమాదముంది. టీకాలు కూడా వైరస్‌లతో తయారైనవే కాబట్టి అరుదుగా.. పది లక్షల మందిలో ఒకరికి రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. నీళ్లు ఎక్కువగా తాగటం, ఎప్పుడూ ఒకేచోట కూర్చోకుండా కాస్త అటూఇటూ తిరగటం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. పిండం మీద గానీ పుట్టిన పిల్లల మీద గానీ దీర్ఘకాలం దుష్ప్రభావాలు ఉంటాయనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి భయాలు, అపోహలేవీ పెట్టుకోవద్దు.

జాగ్రత్తలు పాటించాలి

  • గర్భిణులు గైనకాలజిస్టుల పర్యవేక్షణలోనే టీకా తీసుకోవాలి.
  • జ్వరం, జలుబు లక్షణాలుంటే టీకా తీసుకోవద్దు. తగ్గిన తర్వాత తీసుకోవచ్చు.
  • సాధారణంగా గర్భిణులకు తొలి మూడు నెలల కాలంలో ఎలాంటి టీకాలు ఇవ్వరు. అందువల్ల తొలి త్రైమాసికంలో కొవిడ్‌-19 టీకా తీసుకోకపోవటమే మంచిది. ఒకవేళ తెలియకుండా టీకా తీసుకున్నా భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే తొలి మూడు నెలల్లో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా శిశువుకు అవయవాల లోపమేమీ రావటం లేదని ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి. ఒకవేళ ఒక మోతాదే తీసుకున్నట్టయితే రెండో మోతాదును 12 వారాలకు లేదూ రెండో త్రైమాసికంలోకి అడుగిడిన తర్వాత తీసుకోవాలి.
  • గర్భధారణ సమయంలో కొవిడ్‌-19 బారినపడినట్టయితే.. కాన్పు అనంతరం వీలైనంత త్వరగా టీకా తీసుకోవాల్సి ఉంటుంది.
  • టీకా తీసుకోవటానికి వెళ్లినప్పుడు క్రమశిక్షణ అవసరం. ఒకరి మీద ఒకరు పడకుండా దూరం పాటించాలి. నాణ్యమైన మాస్కు ధరించాలి.

రెండిందాలా మేలు

రెండు టీకాలు తీసుకున్నవారిలో జబ్బు తీవ్రత తక్కువగా ఉండటం చూస్తున్నాం. మొదట్లో వృద్ధులకు, మధుమేహం వంటి జబ్బులు గలవారికే టీకాలు ఇచ్చారు. చిన్నవయసువారంతా టీకా కార్యక్రమానికి దూరంగానే ఉన్నారు. రెండోసారి జబ్బు విజృంభణలో చిన్నవయసువారు ఎక్కువగా మరణించటానికి ఇదీ ఒక కారణం కావొచ్చు. గర్భిణులు సైతం ఎంతోమంది మరణించారు. అందువల్ల గర్భిణులు టీకా తీసుకుంటే కొవిడ్‌-19ను చాలావరకు నివారించుకోవచ్చు. అలాగని అసలే ఇన్‌ఫెక్షన్‌ రాదని చెప్పలేం. సుమారు 0.4% మందికి ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే- ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా టీకాలు తీసుకున్నవారిలో జబ్బు తీవ్రం కాకపోవటం, తేలికగా బయటపడుతుండటం. ఒక్క టీకా తీసుకున్నా మంచి రక్షణ లభిస్తోంది. టీకా తీసుకున్నవారి నుంచి ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించే అవకాశమూ తక్కువే. అంతేకాదు, గర్భస్థ శిశువుకూ రక్షణ లభిస్తుంది. పుట్టిన తర్వాత పిల్లల్లోనూ తల్లి నుంచి సంక్రమించిన యాంటీబాడీలు ఉంటాయి. ఇది శిశువులను కొవిడ్‌-19 బారినపడకుండా కాపాడుతుంది. కాబట్టి గర్భిణులంతా టీకా తీసుకోవటం మంచిది. పిల్లలకు కొవిడ్‌ టీకాలేవీ అందుబాటులో లేని నేపథ్యంలో ఇది మరింత అత్యవసరం.

ABOUT THE AUTHOR

...view details