నచ్చిన దుస్తులతో ఉత్సాహంగా..!
చాలామంది ఎలాగూ ఇంటి నుంచే పనిచేయడం కదా ఏ డ్రస్ వేసుకుంటే ఏమవుతుందిలే అంటూ ఏ నైటీనో లేదంటే నైట్ సూటో వేసేసుకొని కంప్యూటర్ ముందు వాలిపోతారు. అయితే మనం వేసుకునే దుస్తులు, వాటి రంగులు మన మనసుపై ప్రభావం చూపుతాయంటున్నారు మానసిక నిపుణులు. ఇంట్లో ఉన్నా సరే.. మనకు నచ్చిన, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల మన మనసు మరింత చురుగ్గా మారుతుంది. దీని ప్రభావం మనం చేసే పనిపై కూడా పడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా వార్డ్‌రోబ్‌లో మీకు నచ్చిన డ్రస్ తీసుకొని ధరించండి. అప్పుడు మీకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. తద్వారా రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా చురుగ్గా పనిచేసుకోవచ్చు. ఇలా పనిచేయడం వల్ల రోజు పూర్తయ్యే సరికి మీరు చేసిన పనికి సంబంధించిన నాణ్యమైన అవుట్‌పుట్‌ను మీరు అందించవచ్చు.
కొత్త ప్రయోగాలు చేయండి..!
కొన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో డ్రస్ కోడ్ ఉంటుంది. మరికొన్ని ఆఫీసుల్లో ధరించే దుస్తులు ఏవైనా సరే ప్రొఫెషనల్‌గా ఉండాలంటూ కొన్ని నిబంధనలు పెడుతుంటారు. ఇంకొన్ని ఆఫీసుల్లో జీన్స్ వేసుకోవడం నిషిద్ధం. అలాంటప్పుడు మన మనసుకు నప్పే డ్రస్ ధరించే అవకాశం రాకపోవచ్చు. అయితే అందుకు ఈ లాక్‌డౌన్ సమయమే సరైంది. ఇంటి నుంచి పని చేసే క్రమంలో అలాంటి ప్రొఫెషనల్ డ్రస్ నిబంధనలు ఉండవు. కాబట్టి మనకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. అందుకే మీరు ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు వేసుకోవడానికి వీలు కావట్లేదు అనుకున్న దుస్తులన్నీ ఇప్పుడు బయటికి తీయండి. రోజుకొకటి చొప్పున ధరించి.. ఆయా దుస్తులు ధరించినప్పుడు మీరు ఎలా రడీ కావాలనుకున్నారో అలా తయారైపోండి. ఇలా మీకు నచ్చినట్లుగా తయారవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. అదే ఆనందంతో పని మొదలుపెడితే ఇక మీకు తిరుగుండదు.
కాస్త పట్టించుకోండి!
లేచామా, ఇంటి పనులన్నీ చేసుకున్నామా, ఆఫీసుకెళ్లామా.. ఉద్యోగం చేసే ఆడవారికి ఈ పనులతోనే సరిపోతుంది. ఇక వాళ్ల గురించి వాళ్లు పట్టించుకోవడానికి అసలు సమయమే ఉండదు. అయితే ఇలా మన గురించి మనం పట్టించుకోనప్పుడు ఇక మిగతా విషయాలపై కూడా అంతగా శ్రద్ధ పెట్టలేకపోవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ఎలాగూ ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు మీకు నచ్చినట్లుగా తయారవడానికి సమయం ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంటి నుంచి పనిచేసే క్రమంలోనైనా ఉదయం అన్ని పనులు త్వరత్వరగా ముగించుకొని ఒక అరగంట మీకోసం మీరు కేటాయించుకునేలా సమయం మిగుల్చుకునే ప్రయత్నం చేయండి. ఆ సమయాన్ని మీకు నచ్చినట్లుగా తయారవడానికి కేటాయించండి. తద్వారా మనకోసం మనం కాస్త సమయం కేటాయించామన్న భావనతో మనసుకు ఏదో తెలియని సంతోషం, సంతృప్తి కలుగుతాయి. అవి రోజంతా మీరు చేసే పనిపై సానుకూల ప్రభావం చూపుతాయి. కావాలంటే ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి.