ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

నేతన్నలకు చేయూత నందిస్తున్న "చేనేత సంత" - అమీర్​ పేటలో చేనేత మార్కెట్స్

చేనేత మన వారసత్వ సంపద...! ఓ వెలుగు వెలిగిన ఆ కళ ఇప్పుడు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఆధునికత ప్రభావంతో చేనేత వస్త్రాలకు గిరాకీ తగ్గిపోతోంది. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా ఆ వస్త్రాలకు మంచి డిమాండ్ కల్పన కోసం "చేనేత సంత" పేరిట నిర్వహిస్తున్న ప్రదర్శనలకు మంచి స్పందన లభిస్తోంది.

Handloom Weavers' Market ameerpet
చేనేత సంత

By

Published : Dec 12, 2020, 4:05 PM IST

చేనేత సంత

చేనేత వైభవాన్ని కాపాడి... నేతన్నలకు బాసటగా నిలిచేందుకు చేనేత చైతన్య వేదిక సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2 నెలలకొకసారి హైదరాబాద్‌లో 'చేనేత సంత' పేరిట నిర్వహిస్తున్న ప్రదర్శనలకు విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం మూడు రోజులపాటు అమీర్‌పేటలో జరుగుతున్న చేనేత సంతకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

గుజరాత్‌ నుంచి చీరలు

చేనేత సంతలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా గుజరాత్‌ నుంచి భుజోడి కాటన్ చీరలు, చైన్నై నుంచి ఆర్గానిక్ షర్టులు, కుర్తీస్, పొందూరు, బంగాల్‌ ఖాదీజామ్దాని వస్త్రాలు, దిల్లీ నుంచి ఎంబ్రాయిడరీ కుర్తాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన నారాయణపేట, గద్వాల్‌, పోచంపల్లి చీరలు, హుజూరాబాద్ లుంగీలు, దుప్పట్లు, వరంగల్ దరీలు, నాగర్‌కర్నూలు ఖాదీ, బంజార, టెర్రకొట నగలు, వెంకటగిరి, ఉప్పాడ, మచిలీపట్నం, శ్రీకాళహస్తి కలంకారీ, పెన్‌ కలంకారీ... గొల్లభామ, బొబ్బిలి డిజైన్‌ వస్త్రాలు కనువిందు చేస్తున్నాయి.

ప్రతి రెండు నెలలకు

ఐదేళ్లుగా ప్రతి రెండు నెలలకు ఒకటిచొప్పున ఆరు ప్రదర్శనల ఏర్పాటుతో వినియోగదారులు, ఉత్పత్తిదారుల మధ్య చేనేత చైతన్య వేదిక వారధిగా మారింది. సంతలకు నేరుగా తయారీదారులు... వచ్చి స్టాళ్లల్లో వినియోగదారులకు విక్రయించడం వల్ల దళారీ వ్యవస్థ ఉండదని.. వినియోగదారులకు అసలైన చేనేత, ఖాదీ వస్త్రాలు దొరుకుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొవిడ్‌ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో చైతన్య వేదిక చక్కని మార్గం చూపుతోందని తయారీదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చేనేత సంతలకు ప్రభుత్వం మరింత సహకారమందిస్తే.... ఉత్తమ ఫలితాలు వస్తాయని చేనేత ప్రేమికులు చెబుతున్నారు.

ఇదీ చూడండి :నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details