ఫుడ్ వ్లోగర్‌గా స్థిరపడాలని ముందే అనుకున్నారా?
ఆశ్రిత:మనం చేసే ప్రతీ పనిలో సంతోషం వెతుక్కుంటాం. అలా ఆహారం, ప్రయాణాలపై ఉన్న అభిరుచితో వేసిన అడుగులే... నాకో కొత్త కెరియర్ని పరిచయం చేశాయి. నిజానికి ఈ రంగంలోకి వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. అనుకోనివి జరగడమే జీవిత చమత్కారమేమో కదా!
మీకు వంటలు - ప్రయాణాలపై ఆసక్తి ఎలా పెరిగింది?
ఆశ్రిత:నా(Ashritha daggubati) మధుర జ్ఞాపకాల్లో కుటుంబం, స్నేహితులతో కలిసి డైనింగ్ టేబుల్ మీద గడిపినవే ఎక్కువ. బహుశా వీటిపై ఇష్టం పెరగడానికి మా ఇంటి వాతావరణమూ ఓ కారణమేమో! నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు నాన్న దగ్గుబాటి వెంకటేశ్, పెద్దనాన్న సురేష్‌బాబు ఆఫ్రికా, యూరోప్ లాంటి ఖండాలకు షూటింగ్‌ల నిమిత్తం వెళ్లేవారు. తిరిగి వచ్చాక అక్కడి రుచులు, విశేషాలను మాకు చెప్పేవారు. అప్పుడే కొత్త ప్రాంతాలు చూడాలనీ, వింతలూ విశేషాలు తెలుసుకోవాలనీ, ఆయా ప్రాంతాల వంటకాల రుచిని ఆస్వాదించాలనే ఆలోచన వచ్చింది.
మిమ్మల్ని మెప్పించి...స్ఫూర్తినిచ్చిన వంటకం ఏదైనా ఉందా?
ఆశ్రిత:మా జేజమ్మ (తాతమ్మ), అమ్మమ్మ చాలా బాగా వంట చేస్తారు. నాన్న భోజన ప్రియులు. ఆయన ఖీమా, నెయ్యి, వేడి వేడి అన్నం కలిపి మొదటి ముద్దను తన చేతులతో మాకు తినిపించే వారు. ఆయన అమెరికాలో చదువుకున్న రోజుల్లో స్వయంగా వండుకునేవారట. నేనూ అలాగే చేయాలనుకున్నాను. అలా నన్ను ఆకర్షించిన మొదటి వంట ఖీమా. ఈ రోజుకీ కూడా ఎప్పుడైనా నాకు ఇల్లు కానీ, నాన్న కానీ గుర్తొస్తే చేసేది అదే.
మొదటిసారి వంట చేసింది ఎప్పుడు?
ఆశ్రిత:మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్లా. అప్పటికి నాకు వంట పెద్దగా రాదు. ఒంటరిగా ఉండేదాన్ని. మొదటి రెండు నెలలు బయటే తిన్నా. అది ఆరోగ్యానికి సరి పడలేదు. దాంతో చిన్న చిన్నగా వంటలు చేయడం మొదలుపెట్టా. కొన్ని నెలలు గడిచేసరికి స్నేహితులంతా నా వంట తినడానికి ఆసక్తి చూపించడం ఉత్సాహాన్నిచ్చింది. అప్పుడే నాకూ వంటచేసి ఇతరులకు తినిపించడంలో ఉన్న ఆనందం తెలిసింది.
బ్లాగింగ్ చేయడం ఎప్పుడు ఎలా మొదలుపెట్టారు?
ఆశ్రిత:ఇంట్లో వండినా.. పర్యటనల్లో రుచి చూసినా... ఆ పదార్థాలను ఫొటోలు తీసుకోవడం అలవాటుగా మారింది. వాటిని అందరితో పంచుకోవాలని బ్లాగ్ రాయాలనుకున్నా. అందుకు ఇన్స్టాగ్రామ్ చక్కని వేదిక అనిపించింది. అలా ఐదేళ్లక్రితం పుట్టింది ఇన్ఫినిటీ ప్లాటర్(Infinity Platter). తర్వాత యూట్యూబ్‌లోనూ ఛానెల్ ఏర్పాటు చేశా. ఇన్‌స్టాలో లక్షా యాభై తొమ్మిది వేల మంది, యూట్యూబ్‌లో 81 వేలమంది ఫాలో అవుతున్నారు.
మీకు నచ్చే బ్లాగర్ ఎవరు?
ఆశ్రిత:వంటల ఈ విషయంలో ‘నైజెల్లా లాసన్’ వీడియోలు స్ఫూర్తినిస్తుంటాయి. కొత్త ఆలోచనలకోసం ఆవిడ కార్యక్రమాలు తరచూ చూస్తుంటా. తను తయారు చేసిన పదార్థాలన్నీ నేనూ ప్రయత్నించా.
బ్లాగర్‌గా మీకు గుర్తింపు వచ్చాకే... మీరెవరో తెలిసింది ఎందుకిలా?
ఆశ్రిత:ఇన్‌స్టాగ్రాంలో ఇన్ఫినిటీ ప్లాటర్ మొదలు పెట్టినప్పుడు నేనెవరో ఎవరికీ తెలియదు. మొదటి 3-4 సంవత్సరాలు ‘ఫుడ్ అండ్ ట్రావెల్’ మీద ఆసక్తి ఉన్నవారు మాత్రమే నా పేజ్ ఫాలో అయ్యేవాళ్లు. ఏడాదిగా నన్ను గుర్తు పట్టడం మొదలుపెట్టారు. చిన్నప్పటి నుంచీ మమ్మల్ని మేం పరిచయం చేసుకునేటప్పుడు ఫ్యామిలీ పేరుని, వారికున్న ప్రతిష్టనీ ప్రస్తావించకూడదు అని నేర్పారు. నాకు ఇప్పటికీ మా కుటుంబం పేరు వాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబ నేపథ్యం వల్లే నాకన్నీ చాలా సులభంగా వచ్చాయని జనం ఊహించుకుంటారు. అందుకే... నాది స్వయంకృషి అని నిరూపించడానికే నా కలల్ని నా అంతట నేనే నెరువేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు నాన్న, అన్నయ్య, వదిన వాళ్ల సోషల్ మీడియా పేజీల్లో నన్ను ట్యాగ్ చేస్తున్నారు. కానీ మొదట నాకు నేనుగానే గుర్తింపు తెచ్చుకున్నా.