ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

urban wood interiors: వ్యాపకాన్ని వ్యాపారంగా మలుచుకుని.. కోట్ల టర్నోవర్ సాధించి.. - urban wood interiors founder padmaja

ఇది మగ పని, ఇది ఆడ పని అంటూ ప్రత్యేకంగా ఉండవు.. ఆసక్తి ఉండాలే కానీ ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనే పద్మజ.. రెడీమేడ్‌ హోమ్‌ ఇన్‌స్టలేషన్స్‌ తయారీలోకి మూడేళ్ల క్రితం అడుగుపెట్టారు. తన సృజనాత్మకత, సామర్థ్యాలతో దిగ్గజాలను పక్కకు నెట్టి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌, ఐఐఎస్‌సీ సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఇంటీరియర్స్‌(urban wood interiors) సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. వ్యాపకాన్ని వ్యాపారంగా మలచుకుని కోట్ల టర్నోవర్‌ని సాధిస్తున్నారు.

urban wood interiors
urban wood interiors

By

Published : Jul 30, 2021, 2:09 PM IST

మా ఫ్యాక్టరీ కొచ్చినవాళ్లు చాలామంది ‘సార్‌ ఉన్నారా?’ అని అడుగుతారు. ‘సార్‌ కాదు మేడమ్‌’ అని మా వర్కర్లు చెబితే ఆశ్చర్యపోతారు. సాధారణంగా మగవాళ్లు మాత్రమే అడుగుపెట్టే ఈ రంగంలోకి నేను రావడం చూసేవాళ్లకు చిత్రంగానే అనిపిస్తుంది. బీకాం అయ్యాక ఇన్ఫోసిస్‌, యాక్సెంచర్‌, డాయిష్‌ బ్యాంకు వంటి సంస్థల్లో పనిచేశాను. మంచి జీతం వచ్చినా మనసులో ఏదో వెలితి. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టే నాటికి అదింకా ఎక్కువయ్యింది. మనసుకు నచ్చిన పనే చేయాలనే భావన బలపడింది. అది గ్రహించిన మావారు... ‘నీకు నచ్చిందే చెయ్‌’ అని ప్రోత్సహించారు. వెంటనే ఉద్యోగం మానేశాను. మావారిది తిరుపతి. ఆయన ఉద్యోగరీత్యా ఏడెనిమిదేళ్లు హైదరాబాద్‌లో ఉన్నాం. ఆయనకు బదిలీ కావడంతో బెంగళూరు వెళ్లాం. అక్కడే ఇల్లు కొన్నాం. దానికి ఇంటీరియర్‌ డెకరేషన్‌ దగ్గరుండి చేయించుకున్నా. చాలా మందికి ఆ డిజైన్‌ నచ్చింది. ఫ్రెండ్స్‌, బంధువులు మాకూ అలా డిజైన్‌ చేసి పెడతావా అని అడగడంతో నాలో ఆసక్తి పెరిగింది.

ఇంకేముంది... కార్పెంటర్లు, ఆర్కిటెక్చర్‌ విద్యార్థుల సాయం తీసుకుని కొన్ని ఇళ్లు సొంతంగా డిజైన్‌ చేశాను. అంతకంటే ముందు దగ్గర్లోని ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ.. పని నేర్చుకున్నా. దీనికి సంబంధించి కోర్సుల కోసం వెతికితే అక్కడ డ్రాయింగ్‌ మాత్రమే నేర్పేవారు. అది నచ్చలేదు. కొన్ని సైట్ల నుంచి డిజైన్లు సేకరించి వాటికి నా పద్ధతిలో మెరుగులు దిద్ది, మాడ్యులర్‌ కిచెన్లు, వార్డ్‌ రోబ్‌లు, గ్లాస్‌ పార్టిషన్లు వంటివి ఫ్యాక్టరీల్లో తయారు చేయించి ఇచ్చే దాన్ని. అలా మొదట్లోనే కోటి రూపాయల వ్యాపారం చేశాను. నా వర్క్‌ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేదాన్ని. అవి చాలామందికి నచ్చడంతో నెమ్మదిగా ఆర్డర్లు రావడం మొదలయ్యింది. కొంతమంది ఇల్లు, ఇంటీరియర్స్‌ రీమోడల్‌ చేసిమ్మనేవారు. ఇవన్నీ చేస్తూ కాస్త ధైర్యం వచ్చాక బ్యాంకు రుణం తీసుకుని 4000 గజాల స్థలంలో బెంగళూరులో 2019లో ‘అర్బన్‌ వుడ్‌ ఇంటీరియర్స్‌(urban wood interiors)’ పేరుతో సంస్థని ప్రారంభించాను.

ఒకప్పుడు నాకున్న ఆర్డర్లను ఇతర ఫ్యాక్టరీలకు ఇచ్చి చేయించుకునే దాన్ని. ఇప్పుడు నేనే కార్పెంటర్లని పెట్టి చేయిస్తున్నా. ఆధునిక సాఫ్ట్‌వేర్ల సాయంతో ప్లై వుడ్‌లో వృథాని అరికట్టి తక్కువ సమయంలో వేగంగా పని కానిస్తున్నాం. అన్ని రకాల ఫర్నిచర్‌నీ మా ఫ్యాక్టరీలో చేస్తాం. మొదట్లో చాలామంది ‘ఆడవాళ్లు ఇంటీరియర్స్‌(urban wood interiors), ఫర్నిచర్‌ చేయడమా... ఫినిషింగ్‌ ఎలా ఉంటుందో ఏమో?’ అని వెనుకంజ వేసేవాళ్లు. ఆ అభిప్రాయాన్ని నా పనిలోని నాణ్యతే మార్చేసింది. అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడి బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సు సెంటర్‌కీ, ఇలా మరెన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు పని చేసే అవకాశాల్ని పొందాను. ఇప్పటి వరకూ 80 ప్రాజెక్టులు పూర్తి చేశాను. ప్రస్తుతం రెండున్నర కోట్లకుపైగా టర్నోవర్‌ చేస్తున్నాం.మా ఫ్యాక్టరీలో 18 మంది పని చేస్తున్నారు. మగవాళ్లతో పని చేయడం ఇబ్బంది కాలేదా అంటారు చాలా మంది.. వాళ్లతో చెప్పి చేయించుకోవడం నాకు తెలుసు. నా దగ్గర ఎందుకు పనిచేయాలి అని వాళ్లు అనుకోలేదు. కాకపోతే పని డిమాండ్‌ ఉన్న రోజుల్లో ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకుని అందుబాటులోకి రానప్పుడు మాత్రం టెన్షన్‌ తారస్థాయికి చేరుకుంటుంది. నాకు ఇద్దరమ్మాయిలు. ఒకరు పదో తరగతి, మరొకరు ఆరు చదువుతున్నారు. హైదరాబాద్‌లో ప్రాజెక్టులకు వచ్చినప్పుడు వాళ్లని మా చెల్లెలు ఇంట్లోనో, తోటికోడలికో అప్పగించి వస్తాను. అన్నట్టు గత సంవత్సరం గ్లోబల్‌ ఆంత్రప్రెన్యూర్‌ సంస్థ మాకు బెస్ట్‌ స్టార్టప్‌ అవార్డుని ఇచ్చింది.- పద్మజ.

ABOUT THE AUTHOR

...view details