జీవితానికి మించిన ఎన్‌సైక్లోపీడియా మరొకటి లేదంటుంది తెలంగాణ ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భాగ్యలక్ష్మి. చదువుకోవడం కోసం చిన్నప్పట్నుంచీ పోరాటమే చేసిందామె. డిగ్రీలో చేరడానికి ఎన్నో కష్టాలు పడిన భాగ్యలక్ష్మి వాటిని ఆత్మస్థైర్యంతో ఎదిరించి ఎమ్మెస్సీ జువాలజీ, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎంఫిల్ చేసి శెభాష్ అనిపించుకుంది.
‘మాది నల్గొండ జిల్లా హాలియా. మేం ఐదుగురు సంతానం. ఒక అన్న, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ నాకు చదువంటే ఇష్టం. ఇంటర్‌లో నేనే కాలేజ్ టాపర్‌ని. మా ఊరిలో అక్కడి వరకే ఉండటంతో డిగ్రీ చదవడానికి నల్గొండ వెళ్లాల్సిందే. కానీ ఆర్థిక సమస్యలు, దూరం వల్ల అమ్మానాన్న వద్దన్నారు. దాంతో ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. ఆ వచ్చిన డబ్బుతో నల్గొండలోని డిగ్రీ కళాశాలకు దరఖాస్తు చేసుకుంటే సీటొచ్చింది. ఇంట్లో కూడా సరేనన్నారు. కానీ హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి డబ్బులు కావాలిగా. అందుకోసం అక్కడ కూడా ట్యూషన్లు చెబుతూ వచ్చిన డబ్బుతో హాస్టల్ ఫీజు కట్టేదాన్ని. అంత చేసినా డబ్బు చాలకపోయేసరికి డిగ్రీలో మొదటి సంవత్సరం పూర్తవ్వగానే చదువు చాలన్నారు. దీంతో చేసేదిలేక మా కులవృత్తి అయిన నేతపని నేర్చుకుని కార్మికురాలిగా చేరా. కానీ చదువు మీద ఇష్టంతో డబ్బులు దాచుకుని చాలా కష్టాలు పడి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తి చేశా. 2008లో జూనియర్ లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించా. నాకిష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డా’ అంటారామె.