గ్రామీ అవార్డులు! సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారాలు. సినిమా రంగంలో ఆస్కార్‌ను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో... యువ గాయనీగాయకులు, సంగీత దర్శకులు, రచయితలు... ఈ గ్రామీ కోసం అంతగా తపిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలల్ని 18 ఏళ్లకే నిజం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది అమెరికా యువ గాయని బిల్లీ ఐలిష్. 62వ గ్రామీ అవార్డుల సంచలనం మరిచిపోకముందే నయా జేమ్స్‌బాండ్ సినిమాకు థీమ్ సాంగ్ పాడి వార్తల్లో నిలిచింది.
జేమ్స్‌బాండ్ గత సినిమాలకు ఎడిలె, శామ్ స్మిత్‌లు థీమ్ సాంగ్‌లు అందించగా... ఈసారి ఆ బాధ్యత బిల్లీకి అప్పగించారు నిర్మాతలు. ఎన్నో అంచనాలున్నా ఈ పాటను ఎలాంటి హంగామా లేకుండా ఇంటి పడక గదిలోని స్టూడియోలోనే రికార్డు చేసింది. 'నో టైమ్ టూ డై' కథకు తగినట్లు మోసపోవడం, గుండె పగిలిపోవడం వంటి భావాలను ప్రతిబింబించేలా థీమ్ సాంగ్‌ను రక్తికట్టించింది. సినీ, సంగీతాభిమానుల మెప్పు పొందుతోంది బిల్లీ.
బిల్లీ ఐలిష్.. 2016లో ఓషన్ ఐస్ అనే సింగిల్ ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 11 ఏళ్ల వయసులో రూపొందించిన తొలి పాటతోనే సంగీతాభిమానుల్ని మెప్పించిన బిల్లీ.. తర్వాత 'డోంట్ స్మైల్ ఎట్ మీ' అనే ఆల్బమ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాటి నుంచి నేటివరకు విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త పాటలతో అలరిస్తూనే ఉంది.
లాస్ ఏంజిల్స్‌లోని హైలాండ్ పార్క్‌లో పుట్టి పెరిగిన బిల్లీ... చిన్నతనం నుంచే పాటలు పాడేది. సంగీతంలో ప్రవేశం ఉన్న తల్లిదండ్రుల ప్రాథమిక శిక్షణలో ఓనమాలు నేర్చుకుంది. లాస్ ఏంజిల్స్ చిల్డ్రన్ సింగర్స్ బృందంలో సభ్యురాలిగా చేరి సంగీతంలో మెలకువలు నేర్చుకుంది. 11 ఏళ్లకే సొంతంగా పాటలు రాయడం, స్వరకల్పన నేర్చుకుంది. ఆమె అన్నయ్య ఫిన్నెయాస్ పాటలు రాసి ఇవ్వటమే కాక రూపకల్పనలో సాయంగా ఉండేవాడు. అలా సోదరుడి సహకారంతో పాప్ సంగీతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బిల్లీ.