ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

అప్పుడు క్యాన్సర్‌ను జయించింది.. ఇప్పుడు రోదసీలోకి వెళ్తోంది ! - life style news

క్యాన్సర్‌.. ఈ మహమ్మారి బారిన పడ్డామంటే ఇక జీవితం అంతమైపోయినట్లే అనుకుంటాం.. అయితే తాను మాత్రం అలా జీవచ్ఛవంగా బతకాలనుకోలేదు. పదేళ్ల వయసులో ఏ క్యాన్సర్‌ అయితే తనని కబళించడానికి ప్రయత్నించిందో.. దానికే ఎదురెళ్లి పోరాటం చేయాలనుకుంది. ఈ క్రమంలో తాను చికిత్స తీసుకున్న ఆస్పత్రిలోనే నర్సుగా చేరి.. వివిధ అనారోగ్యాలతో అక్కడ చికిత్స పొందుతోన్న పిల్లలకు సేవలు చేసింది. అంతటితో ఆగిపోకుండా.. ఈ ఏడాది చివర్లో స్పేస్ ఎక్స్‌ చేపట్టబోయే తొలి ప్రైవేట్‌ అంతరిక్ష యాత్ర ద్వారా రోదసీలోకి వెళ్లే అరుదైన అవకాశాన్ని సైతం దక్కించుకుందామె. ఈ క్యాన్సర్‌ విజేత కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Jared Isaacman success story
ఇసాక్​మ్యాన్ సక్సెస్ స్టోరీ

By

Published : Feb 24, 2021, 8:08 PM IST

అమెరికాకు చెందిన బిలియనీర్‌, వ్యాపారవేత్త, పైలట్‌ అయిన జేర్డ్‌ ఇసాక్‌మ్యాన్‌ ఈ ఏడాది చివర్లో చేపట్టబోయే తొలి ప్రైవేట్‌ అంతరిక్ష యాత్ర గురించి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌ అనే ఏరోస్పేస్‌ కంపెనీ నుంచి ‘స్పేస్ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌’ను కూడా కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం నాలుగు సీట్లుండే ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో మూడు సీట్లు సాధారణ వ్యక్తులకు కేటాయించగా, నాలుగో సీటును సెయింట్‌ జ్యూడ్‌ చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ ఆసుపత్రి కోసం కేటాయించారు. క్యాన్సర్‌, లుకేమియా, లింఫోమా.. వంటి వ్యాధుల బారిన పడిన చిన్నారుల కోసం నిధుల సమీకరణే ముఖ్యోద్దేశంగా ఈ యాత్ర సాగనుంది. ఈ క్రమంలో చిన్నతనంలోనే క్యాన్సర్‌ బారిన పడి, ధైర్యంగా దాన్ని జయించడంతో పాటు.. అదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ ఎంతోమంది చిన్నారుల్లో బతుకు పట్ల ఆశను రేకెత్తిస్తోన్న 29 ఏళ్ల అమెరికన్‌ మహిళ హేలే ఆర్సెనాక్స్‌ ఈ అంతరిక్ష యానానికి ఎంపికైంది. దీంతో కృత్రిమ అవయవంతో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి వ్యక్తిగా, అతిపిన్న అమెరికన్‌గా చరిత్ర సృష్టించనుంది హేలే.

పదేళ్లకే క్యాన్సర్‌ బారిన పడ్డా!

అంతరిక్షంలోకి వెళ్లడమంటే మాటలు కాదు.. అందుకు శారీరకంగా, మానసికంగా పూర్తి సన్నద్ధం కావాల్సి ఉంటుంది. దాంతో పాటు ఒకవేళ వెళ్తే ఏమవుతుందోనన్న భయం కూడా ఉంటుంది. ఇలా ఏదైనా అరుదైన సాహసం చేయాలనుకుంటే మనకంటే ఎక్కువగా మన ఇంట్లో వాళ్లే భయపడిపోతుంటారు. కానీ తన తల్లి మాత్రం ఈ యాత్రకు సంతోషంగా ఒప్పుకుందని చెబుతోంది హేలే. తనకు ఈ అరుదైన అవకాశం దక్కినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందంటూనే తన కథను ఇలా మన ముందుంచిందీ డేరింగ్‌ లేడీ.

'మాది లూసియానాలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌విల్లే అనే చిన్న పట్టణం. అప్పుడు నాకు 10 ఏళ్లుంటాయనుకుంటా. అందరు పిల్లల్లాగే నేనూ ఎంతో చలాకీగా ఉండేదాన్ని.. అదెంతలా అంటే తైక్వాండోలో అప్పటికే నాకు బ్లాక్‌బెల్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఎందుకో నా ఎడమ కాలు బాగా నొప్పి పెట్టడం మొదలైంది. ఈ విషయం అమ్మకు చెప్పా. అప్పుడు తను పరీక్షించి చూసే సరికి ఎడమ మోకాలిపై చిన్న గడ్డలాగా చర్మం నుంచి పొడుచుకొచ్చినట్లు కనిపించింది. దీంతో మా ఇంటికి దగ్గర్లోని పిల్లల డాక్టర్ దగ్గరికి అమ్మ నన్ను తీసుకెళ్లింది.. అక్కడి వైద్యుడు పరీక్షించి ఇది చూడ్డానికి క్యాన్సర్‌ గడ్డగా ఉందని చెప్పేసరికి మేము ఒక్కసారిగా షాక్‌ తిన్నాం.

క్యాన్సర్ వస్తే ఇక చావే అన్నారు!

నాకు క్యాన్సర్‌ అని తెలియగానే నాలో, మా అమ్మలో ఏదో తెలియని భయం ఆవహించింది. దీనికి తోడు అంతా.. ‘క్యాన్సర్‌ వస్తే ఇక చావే శరణ్యం’ అంటూ మరింత భయాందోళనలకు గురి చేశారు. అదే సమయంలో నా వ్యాధిని నిర్ధారించుకోవడానికి సెయింట్‌ జ్యూడ్‌ చిల్డ్రన్‌ రీసెర్చ్‌ ఆసుపత్రికి వెళ్లాం. అక్కడి వైద్యులు మాకో శుభవార్త చెప్పారు.

నీకు క్యాన్సర్‌ సోకిన మాట వాస్తవమే.. కానీ అది ఇతర శరీర భాగాలకు ఇంకా వ్యాపించలేదు.. కాబట్టి చికిత్స ద్వారా ఈ మహమ్మారి నుంచి బయటపడచ్చు..’ అంటూ వారు మాలో ధైర్యం నింపారు. అలా కీమోథెరపీ, వంటి చికిత్సలతో పాటు మోకాలికి ఆపరేషన్‌ చేసి కృత్రిమ కాలి ఎముకలు (టైటానియం రాడ్‌) అమర్చారు. అయితే ఆ చికిత్సలతో నేనెంత బాధను అనుభవించానో.. నా మనసు అంతకంటే దృఢంగా తయారైంది. అందుకే నాలా క్యాన్సర్‌, ఇతర వ్యాధులతో బాధపడుతోన్న చిన్నారులకు నా వంతుగా సహాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే సెయింట్‌ జ్యూడ్‌ ఆస్పత్రి కోసం నిధుల సమీకరణకు నడుం బిగించాను. ఇందుకు గాను ‘లూసియానా పబ్లిక్‌ బ్రాడ్కాస్టింగ్‌’ కంపెనీ నుంచి ‘యంగ్‌ హీరోస్‌’ అవార్డును అందుకున్నా.

అమ్మ అందుకు హ్యాపీగా ఒప్పుకుంది!

నర్సింగ్‌ కోర్స్‌ చేసి వివిధ అనారోగ్యాలతో బాధపడుతోన్న చిన్నారులకు సేవలందించడంతో పాటు నా క్యాన్సర్‌ అనుభవాలను వారికి వివరిస్తూ వారిలో ధైర్యం నింపాలని నిర్ణయించుకున్న నాకు సెయింట్‌ జ్యూడ్‌ ఆస్పత్రే అండగా నిలిచింది. అందుకే నర్సు కావాలనుకున్న నా కలను నెరవేర్చుకొని ఏడాది కిందట అదే ఆస్పత్రిలో ఫిజీషియన్‌ అసిస్టెంట్‌/నర్సుగా విధుల్లో చేరాను. ఈ క్రమంలో క్యాన్సర్‌, లుకేమియా, లింఫోమా.. వంటి వివిధ రకాల వ్యాధుల బారిన పడి చికిత్స నిమిత్తం ఇక్కడికి వచ్చే చిన్నారులకు సేవ చేయడంతో పాటు వారు మానసికంగా దృఢంగా మారేందుకు నా వంతుగా కృషి చేస్తున్నా. అయితే ఇంతలోనే అంతరిక్ష యాత్రలో పాల్గొనే అరుదైన అవకాశం నాకు దక్కడం పట్టరానంత సంతోషంగా ఉంది.. ముందు ఈ విషయం ప్రకటించినప్పుడు వెంటనే అమ్మకు చెప్పా. తను కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంది.

ఆ కల ఇలా నెరవేరబోతోంది!

ప్రపంచమంతా పర్యటించాలనేది నా జీవితకాలపు కల. అది ఇలా నెరవేరుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదు.. క్యాన్సర్‌ బాధితులు ఏమైనా చేయగలరు.. ఎక్కడిదాకానైనా వెళ్లగలరు అని ఈ లోకమంతా చాటి చెప్పాలని ఆ క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. మీరూ ఈ యాత్రలో భాగమవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన ఇతర వివరాలు, మీరిచ్చే విరాళం.. తదితర అంశాల కోసం https://inspiration4.com/ అనే వెబ్‌సైట్‌ చూడండి. ఈ మంచి పనిలో మీరూ పాలుపంచుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రలో భాగమయ్యే అరుదైన అవకాశం దక్కించుకోండి..’ అంటూ తన జర్నీని పంచుకుంది హేలే.తాను క్యాన్సర్‌ను జయించడమే కాదు.. అలాంటి వ్యాధులతో బాధపడుతోన్న ఇతర పిల్లల్లో స్ఫూర్తి నింపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది కాబట్టే ఈ అంతరిక్ష యానం కోసం హేలేను ఎంపిక చేశామని చెబుతున్నారు జేర్డ్‌. హేలేతో పాటు మరో ముగ్గురితో ఈ ఏడాది చివర్లో రోదసీలోకి బయల్దేరనున్న ఈ అంతరిక్ష యాత్ర కోసం వీరు ముందుగా శిక్షణ తీసుకోనున్నారు. ఈ క్రమంలో వారి శారీరక, మానసిక స్పందనలు పరిశీలించి వారిని ఈ యాత్ర కోసం సన్నద్ధం చేయనున్నారు. ఇక ఈ యాత్రలో భాగంగా బయల్దేరే స్పేస్ క్రాఫ్ట్‌ అంతరిక్ష కేంద్రానికి వెళ్లకుండా భూకక్ష్యలోనే మూడు నాలుగు రోజులు పయనించి.. తిరిగి భూమికి చేరుకోనుందట!

ఇదీ చూడండి:హైదరాబాద్​: రోడ్డు భద్రతా వారోత్సవాల్లో జూ. ఎన్టీఆర్ సందేశం

ABOUT THE AUTHOR

...view details