పుట్టింది గుడిసెలో.. కానీ గూగుల్‌లో వెతికితే తన గురించి తెలియాలని కోరిక!
ఐదువేళ్లు నోట్లోకి వెళ్తేనే గొప్ప.. అయినా ఎత్తైన పర్వతాలన్నీ అధిరోహించడం కల!
అవరోధాలెన్ని ఎదురైనా.. ఒక్కొక్కటిగా శిఖరాలను ఎక్కేస్తూనే ఉన్నాడు కర్నూలు జిల్లా గోనెగండ్ల కుర్రాడు జి.సురేశ్‌బాబు. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫ్రెండ్‌షిప్ పీక్‌నీ పాదాక్రాంతం చేసుకొని ఐదు ఖండాల్లోని ఏడు పర్వతాలు అధిరోహించిన పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు.
సురేశ్ అమ్మానాన్నలు దినసరి కూలీలు. చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కొనసాగింది. ఓసారి తను కొబ్బరి చెట్టు ఎక్కి, కింద పడ్డాడు. కాలు విరిగింది. చాలా ఏళ్లు మామూలుగా నడవలేకపోయాడు. తనకిష్టమైన క్రికెట్, కబడ్డీ, ఖోఖోలు ఆడలేని పరిస్థితి. తను కోల్పోయిన ఆనందాన్ని ఎలాగైనా తిరిగి పొందాలనీ, తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని కసిగా అనుకునేవాడు. ఇంటర్‌లో ఆ అవకాశం వచ్చింది.
పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇవ్వమని కోరారు తను చదువుతున్న గురుకుల విద్యాసంస్థలోని ఉపాధ్యాయులు. సురేశ్ వెంటనే స్పందించాడు. రకరకాల పరీక్షల అనంతరం డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెయిన్ ఇన్‌స్టిట్యూట్‌కి ఎంపికయ్యాడు. పర్వతారోహణకు దేశంలోనే అత్యుత్తమ శిక్షణా సంస్థ అది. అక్కడ మైనస్ 40 డిగ్రీల గడ్డకట్టే చలిలోనూ ఒడుపుగా శిఖరాలు ఎక్కడం నేర్చుకున్నాడు. అప్పట్నుంచి ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను ఒక్కొక్కటిగా అధిరోహిస్తూనే ఉన్నాడు.
వందలు, వేల మీటర్ల ఎత్తుండే శిఖరాలు ఎక్కడం మాటలు కాదు. ఒకరకంగా ప్రాణాలకు తెగించడమే. అలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాడు సురేశ్. నేపాల్‌లోని ‘లోత్స్’ని అధిరోహించే సమయంలో మంచుకొండలు విరిగి పడ్డాయి. తృటిలో తప్పించుకున్నాడు. నిచ్చెనలు, తాళ్లసాయంతో భారీ గుంతలు దాటాడు. కొన్నిసార్లు నీళ్లు దొరక్కపోతే కొండలపై ఉండే మంచును చప్పరిస్తూ గమ్యాన్ని చేరాడు.
ఓసారైతే కిందికి దిగే సమయంలో పర్వాతారోహణకు వచ్చి చనిపోయిన వ్యక్తి మృతదేహంపై పడ్డాడు. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది అంటాడు. అయినా లక్ష్యం చేరిన తర్వాత శిఖరంపై మువ్వన్నెల జెండాని ఎగరేసినప్పుడు కలిగే ఆనందం కోసం ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవడానికైనా సిద్ధమేనంటాడు ఈ 23 ఏళ్ల సాహసి. మొత్తానికి నాలుగేళ్లలో 18 శిఖరాగ్రాలను చేరి రికార్డు సృష్టించాడు. ఈ ప్రయాణంలో సురేశ్‌తో కలిసి చదువుకున్న సిల్వర్‌జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు అన్నిరకాలుగా అండగా నిలిచారు.
ఘనతలివీ..
- 2017 మేలో పదిహేనేళ్ల వయసులోనే మౌంట్ ఎవరెస్టుని అధిరోహించాడు.
- 2017 డిసెంబరులో దక్షిణాఫ్రికాలో 5,895 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతం అంచున కాలు మోపాడు.
- 2018 ఆగస్టులో యూరప్ ఖండంలోనే ఎత్తైన మౌంట్ ఎల్‌బ్రస్ శిఖరం చేరాడు.
- 2018లో 8,163 మీటర్ల మౌంట్ మానస్‌లు పర్వతాన్ని 40 రోజులు కష్టపడి ఎక్కాడు. దక్షిణ భారతదేశంలో ఈ ఘనత సాధించింది సురేశ్‌నే.
- 2019లో ఆస్ట్రేలియా ఖండంలో ఎత్తైన కోసియాజ్‌కో, దాని పక్కనున్న మరో తొమ్మిది పర్వతాలు ఎగబాకాడు.
- 2019లోనే దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన మౌంట్ అర్జెంటీనా శిఖరం చివరి భాగానికి వెళ్లొచ్చాడు.
- 2019 ఏప్రిల్ నెలలో నాలుగో ఎత్తైన 8,516 మీటర్ల లోత్స్ శిఖరాన్ని అధిరోహించి యంగెస్ట్ భారతీయుడిగా నిలిచాడు.