ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

నయా ట్రెండ్​: క్యారవాన్‌లో టూర్​ - భారత్​లో క్యారవాన్​ టూరిజం

కరోనా కారణంగా పర్యటనలకు బ్రేక్‌ పడింది. కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఉన్నా రైళ్లూ, బస్సులూ ఎక్కడానికీ, హోటళ్లలో ఉండటానికీ, బయట తినడానికీ ఎవరూ ఇష్టపడట్లేదు. మరి ఇవన్నీ లేకుంటే పర్యటక రంగం ఏం కావాలి?! ఈ ఆలోచనతోనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ, పలు టూరిజం స్టార్టప్‌లూ హోటళ్లూ, రెస్టారెంట్ల అవసరం లేకుండా సకల వసతులతో కూడిన క్యారవాన్‌లను పర్యటకులకు పరిచయం చేస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో మొదలైన ఈ నయాట్రెండ్‌ విశేషాలివి...

క్యారవాన్‌లో టూరుకు వెళ్లొద్దాం ...
క్యారవాన్‌లో టూరుకు వెళ్లొద్దాం ...

By

Published : Sep 13, 2020, 5:18 PM IST

ఇప్పటివరకూ రాజకీయ నాయకులు తమ పర్యటనలపుడూ, హీరోలు షూటింగుల సమయంలోనూ మాత్రమే క్యారవాన్‌లను వాడేవారు. మనం చాలా అరుదుగా వినే ఆ విలాసాన్ని మధ్యతరగతికీ చేరువ చేస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ, స్టార్టప్‌లూ. కొవిడ్‌-19 కారణంగా కుదేలైన పర్యటకరంగానికి క్యారవాన్‌ల ద్వారా కొత్త ఊపిరులూదాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిల్లోనైతే ఎక్కువమందితో కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ‘భౌతిక దూరం’ సమస్య రాదు. ఇందులోనే నిద్ర, స్నానపానాదులూ, వంటావార్పులన్నింటికీ వసతులు ఉండటం వల్ల ఏ హోటల్లోనో బసచేయాల్సిన అవసరమూ లేదు. అందుకే, క్యారవాన్‌లతో కూడిన సరికొత్త పర్యటక ప్యాకేజీలు వస్తున్నాయి. ఆ వాహనాలను మన గుమ్మం వద్దకే తెస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌ ముందడుగు

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయంలో తొలి అడుగువేసింది. పర్యటకుల కోసం రెండురకాల క్యారవాన్‌లని సిద్ధం చేసింది. వీటిని మధ్యప్రదేశ్‌లో మాత్రమే కాదు దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చని చెబుతోంది. వీటిలో డీలక్స్‌ రకం క్యారవాన్‌లో నలుగురు, లగ్జరీ రకం క్యారవాన్‌లో ఎనిమిది మందీ ప్రయాణించవచ్చు. వీటిలోని వసతులూ, తీసుకునే రకాన్ని బట్టి ధర ఉంటుంది. వసతుల విషయానికొస్తే ఇందులో ఏసీ పడకగదులతోపాటూ డైనింగ్‌, హోమ్‌ థియేటర్‌, వైఫై, లాకర్‌ వసతులూ, వంటగదిలో ఒవెన్‌, గ్యాస్‌, సింక్‌ ఇలా అన్నీ ఉంటాయి.

సోలార్‌ ప్యానల్‌తో పనిచేసే మరుగుదొడ్లూ, స్నానాల గదుల ఏర్పాటూ ఉంటుంది. మధ్యలో ఎక్కడ ఆగి క్యాంప్‌ వేయాలనుకున్నా... అందుకు కావాల్సిన బెంచ్‌లూ, కుర్చీలన్నీ కూడా ఉంటాయి. కొన్ని బస్సుల్లో అయితే లోపల ఎక్కువ స్థలం ఉండాలని స్టౌ, సింక్‌ వంటివి బస్సు బయట భాగంలోనే ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని బస్సుల్లో అయితే స్థానిక ప్రయాణాలకోసం కారుని కూడా బస్సులో తీసుకెళ్లే సౌలభ్యం కల్పిస్తున్నారు. అలానే క్యారవాన్‌లో మనతోపాటూ ఓ డ్రైవర్‌, గైడ్‌ కూడా ప్రయాణిస్తారు. అవసరం లేదనుకుంటే మన డ్రైవర్‌నే తీసుకెళ్లొచ్చు.

కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడుస్తోంది. జూన్‌లోనే ఈ తరహా టూరిజాన్ని ప్రారంభించింది ఆ రాష్ట్రప్రభుత్వం. పర్యటక ప్రాంతాలకు నెలవైన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా క్యారవాన్‌ టూరిజానికి పెద్ద పీట వేసింది. పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తెచ్చింది. పలు పర్యటక ఏజెన్సీలకూ అనుమతులు ఇవ్వడంతో అవి కూడా రకరకాల ప్యాకేజీలతో పర్యటకుల్ని అలరించడానికి సిద్ధమయ్యాయి. దాంతో ఇతర రాష్ట్రాల్లోనూ వ్యక్తిగత వాహనాలను పర్యటనలకు అనుగుణంగా మార్చేసి అద్దెకిచ్చే ట్రెండ్‌ కూడా మొదలైంది. ఈ మార్పుల నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారు ఎలాంటి భయం లేకుండా కొత్త ప్రదేశాలకెళ్లి అక్కడి అందాల్ని ఆస్వాదిస్తున్నారు. పైగా బస, తిండి ఖర్చు లేకపోవడంతో డబ్బూ ఆదా అవుతోంది. కరోనా భయం కూడా ఉండదు. కుటుంబంతోనో, బంధువులూ, స్నేహితులతో కలిసో ఎంచక్కా టూర్‌కెళ్లి ఎంజాయ్‌ చేసి రావొచ్చు. బావుంది కదా!

ABOUT THE AUTHOR

...view details