వారణాసిలో గత 11 రోజులుగా జరుగుతున్న రుద్ర మహాయజ్ఞ యాగం నేటితో పూర్తయింది. జగద్గురు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో హాజరైన భక్తుల మధ్య... మహా పూర్ణాహుతితో ఈ యాగం ముగిసింది. దీంతోపాటు చండీయాగం నిర్వహించారు. పవిత్ర గంగాజలం, పాలు, తేనె వంటి ద్రవ్యాలతో భక్తులు శివుడికి అభిషేకం చేశారు. పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి యజ్ఞపురుషులకు వివిధ వస్తువులను సమర్పించి మహా పూర్ణాహుతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి వారసుడు శ్రీదత్ విజయానంద్ స్వామి, సాధువులు హాజరయ్యారు. భక్తులు యజ్ఞ మండపంలో గురువు నుంచి దుస్తులు, దండలు, సిద్ధ యంత్రాలు నైవేద్యం రూపంలో పొందారు.
ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ హాజరయ్యారు. అతిరుద్ర మహాయాగం కాశీలో జరగటం చాలా విశేషమనీ.. ఈ యాగం చూసిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందుతారని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. దేశం సుభిక్షంగా ఉండడానికి, యుద్ధ భయం పోవడానికి, వాతావరణం సమతుల్యంగా ఉండేందుకు, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి యాగం నిర్వహించినట్లు తెలిపారు. అతి రుద్రయాగానికి తెలుగు భక్తులు ఎక్కువగా రావటం సంతోషకరమన్నారు.