ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

అన్‌లాక్‌-5లో చిన్నారులకు కష్టకాలం

పిల్లలను మందలిస్తే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కనపడకుండా పోతున్నారు.. లేదా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అన్‌లాక్‌-5లో చిన్నారులు కష్టకాలం ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో జాగ్రత్త ముఖ్యమని హెచ్చరిస్తున్నారు.

students problems
students problems

By

Published : Nov 20, 2020, 12:37 PM IST

పిల్లలకు ఏమైంది..? గుంటూరు జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో అందరి నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న ఇది. ఆన్‌లైన్‌ తరగతుల కోసం పిల్లల చేతికి అందుతున్న చరవాణులు వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఎక్కువ సమయం పిల్లలు సెల్‌ఫోన్లతోనే గడుపుతుండడంతో తల్లిదండ్రులు మందలిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కరోనా అన్‌లాక్‌-5లో చిన్నారులు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నట్లు జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. అదృశ్యాలు.. ఆత్మహత్యలు.. ప్రమాదాల బారినపడిన బాల్యం తల్లిదండ్రుల్లో తీరని వేదన మిగులుస్తోంది. పిల్లల సంరక్షణకు జాగరూకతతో మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • గంటల తరబడి చరవాణిలో అతుక్కుపోయి చదువును అశ్రద్ధ చేస్తున్నాడని తండ్రి మందలించడంతో సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి మరో మైనర్‌తో కలిసి సినీఫక్కీలో కిడ్నాప్‌ నాటకం ఆడి కుటుంబీకులు, పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. తెలియనితనంతో చేసిన తప్పునకు ఇద్దరూ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • ఆన్‌లైన్‌ తరగతుల కోసం ఇచ్చిన చరవాణి ఎక్కువగా ఉపయోగిస్తోందని తల్లిదండ్రులు మందలించడంతో ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన పదో తరగతి విద్యార్థిని మరో ముగ్గురు విద్యార్థినుల్ని వెంట తీసుకుని ఇంట్లో నుంచి మాయమైంది. నలుగురు విద్యార్థినుల అదృశ్యం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నెల 12న నలుగురు బాలికల్ని వినుకొండలో పోలీసులు పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.
  • క్రోసూరు మండలంలోని 88 తాళ్లూరుకు చెందిన 15 ఏళ్ల బాలుడు సైకిల్‌ రిపేరు చేయించుకుంటానంటూ ఈ నెల 6న తన తాత వద్ద రూ.వెయ్యి నగదు తీసుకుని మాయమయ్యాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా హైదరాబాద్‌లోని బాబాయి వద్దకు అతడు వెళ్లిన క్రమంలో కుటుంబ సభ్యులకు విషయం తెలియక ఆందోళన చెందారు. చివరకు హైదరాబాద్‌ పోలీసులు అతడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
  • సత్తెనపల్లి పట్టణంలోని అశోక్‌నగర్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి, పెదకూరపాడు మండలంలోని కంభంపాడుకు చెందిన పదో తరగతి విద్యార్థి ఇటీవల అదృశ్యమయ్యారు. తల్లిదండ్రుల మందలింపుతోనే ఇద్దరు కనిపించకుండాపోయారని కేసులు నమోదయ్యాయి. పెదకూరపాడు మండలంలోని పాటిబండ్లకు చెందిన నాలుగేళ్ల చిన్నారి కీర్తి, అమరావతిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడి జాడ నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు తెలియరాలేదు.
  • ఆన్‌లైన్‌ తరగతులకు సరిగ్గా హాజరవ్వక ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని తండ్రి మందలించడంతో ముప్పాళ్ల మండలానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాళ్లపట్టీ పొగొట్టుకుందని తల్లి మందలించడంతో ఇరుకుపాలెంకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక.. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారని వినుకొండలో పదేళ్ల చిన్నారి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వినుకొండలోనే పదో తరగతి విద్యార్థి, వట్టిచెరుకూరులో 17 ఏళ్ల బాలుడు ఇదేతరహాలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
  • అన్‌లాక్‌లో తల్లిదండ్రులు పనులకు వెళ్లి ఇంటి వద్ద ఉన్న పిల్లలు ఆడుకుంటూ ప్రమాదాల బారినపడుతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. గుంటూరు నగర శివార్లలోని చెరువులో పడి 7, 8 వయస్సు కలిగిన ఇద్దరు బాలురు, వినుకొండలో నీటిగుంతలో పడి మూడేళ్ల చిన్నారి, ఈపూరులో ఈతకు వెళ్లి 12 ఏళ్ల బాలుడు, తుళ్లూరు మండలంలోని రాయపూడిలో ఈతకు వెళ్లి బాలుడు, క్రోసూరు మండలంలోని తాళ్లూరులో వాగులోపడి పదేళ్ల బాలుడు మృతి చెందారు.

మనసెరిగి మార్పునకు ప్రయత్నించండి..

పిల్లల చేతికి చరవాణి చిక్కడంతో వారు పక్కదారి పట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. బడుల్లేని వేళ వారి స్నేహాలు, అలవాట్లలోనూ లోపాలుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తప్పు చేస్తున్నారని ఒక్కసారిగా పిల్లలపై తల్లిదండ్రులు కోపగించుకోవడం.. వారిని కొట్టడం లాంటివి చేస్తే తీవ్ర నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంటుంది. పిల్లల మనసెరిగి మార్పునకు ప్రవర్తించాలి. ఎలక్ట్రానిక్‌ పరికరాలు కాకుండా పుస్తక పఠనం, వ్యాయామం, ఆటలు, పెరటితోట, తల్లిదండ్రుల వృత్తుల్లో ఎక్కువ సమయం గడిపేలా చేయాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి ఆలోచనలు, ప్రవర్తనలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దే ప్రయత్నం చేస్తే బాల్యం పక్కదారిపట్టే అవకాశం ఉండదు. -ఆర్‌.విజయభాస్కరరెడ్డి, డీఎస్పీ. సీనియర్‌ పోలీసు అధికారి.

లేత మనసులు.. రాకూడని ఆలోచనలు..

పిల్లలు చూడకూడని.. వినకూడని మాటలు, చిత్రాలు వారి కళ్ల ముందు చరవాణుల రూపంలో ప్రస్తుతం కదలాడుతున్నాయి. దీంతో లేత మనసుల్లో రాకూడని ఆలోచనలు వస్తున్నాయి. సాధారణంగా ఇంట్లోకంటే పిల్లలు ఎక్కువ సమయం బడుల్లో గడుపుతారు. ఇప్పుడా అవకాశం లేకపోయింది. దీనికితోడు అన్‌లాక్‌-5లో జీవనోపాధి కోసం పిల్లల్ని ఇళ్లల్లో వదిలి తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. మరికొందరు పిల్లల పట్ల అతి గారాబంతో వారికి డబ్బుపై వ్యామోహం పెంచుతున్నారు. చరవాణి పట్ల ఏర్పడిన వ్యామోహాన్ని తగ్గించాలంటే ప్రత్యామ్నాయాల్ని పిల్లలకు అలవాటు చేయాలి. తల్లిదండ్రులు పిల్లల్ని తమవద్ద కూర్చోబెట్టుకుని ఆటపాటలు నేర్పిస్తే వేరే ఆలోచనలకు సమయం, అవకాశం ఉండదు. ప్రవర్తనాపరమైన లోపాల్ని సైకాలజిస్టుల కౌన్సెలింగ్‌ ద్వారా అధిగమించే ప్రయత్నం చేయాలి. -డాక్టర్‌ టి.సుగంధరావు, సైకాలజిస్టు.

ఇదీ చదవండి:అలల సిరులవేణి.. సస్యసీమల రాణి

ABOUT THE AUTHOR

...view details