స్థోమత లేదంటూ... ఆడశిశువు విక్రయం
మగ పిల్లవాడు పుడతాడని ఎదురుచూశారు. మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టిందని నిరాశ చెంది... ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా శిశువును విక్రయించేందుకు బేరసారాలు మాట్లాడుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా లచ్చీరాం తండాకు చెందిన కవిత, భిక్షపతికి మొదటి రెండు కాన్పులలో ఆడపిల్లలు జన్మించారు. మగబిడ్డ కావాలనుకున్న వారికి మూడో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడం కలచివేసింది. ఎలాగైనా ఈ పాపను వదిలించుకోవాలని ఉద్దేశంతో బేరసారాలు మొదలుపెట్టారు. రఘునాథపల్లి చెందిన ఓ దంపతులు ఆసుపత్రిలో బిల్లు కట్టి ఆ పాపను తీసుకుని వెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ తంతు... ఎవరి ద్వారానో శిశు సంక్షేమ శాఖకు తెలిసింది. అధికారులు తండాకు వెళ్లి విచారణ జరపగా మాకు పాపను పెంచే స్థోమతలేదని, అందుకే దత్తత ఇచ్చామని తెలిపారు. అక్రమ దత్తత చెల్లదని పాపను వద్దనుకుంటే ఐసీడీఎస్ అధికారులకు తెలియజేస్తే, మేమే పాపను తీసుకుని శిశు విహార్‌కు తరలిస్తామని తెలిపారు. వెంటనే పాపను తీసుకుని రావాలని సూచించారు.