తెలంగాణలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2019 గణాంకాల ప్రకారం సగటున రోజుకు 7 చొప్పున నేరాలు నమోదవుతున్నాయి. మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్న నేరగాళ్లు క్షణాల్లో ఖాతాల్లో డబ్బంతా కొల్లగొట్టేస్తున్నారు. అవగాహనా లోపంతో కొందరు, ఆశకు పోయి ఇంకొందరు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, వాటి నివారణకు అప్రమత్తంగా ఉండటంతోబాటు కొన్ని జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని రకాల సైబర్ మోసాలను పరిశీలిస్తే..
కేవైసీ మోసాలు
ఈ మోసాలు ఎక్కువగా మొబైల్ వాలెట్ లక్ష్యంగా జరుగుతున్నాయి. పేటీఎం వంటి వాలెట్ వినియోగదారుల వివరాలను తస్కరిస్తున్న నేరగాళ్లు ముందు వారి ఫోన్‌కు కాల్ చేసి ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ)’ వివరాలు తక్షణమే నమోదు చేయాలని, లేకపోతే వాలెట్ సేవలు నిలిపివేస్తామని చెబుతూ ఒక లింకును పంపుతున్నారు. లింకు తెరవగానే ఫోన్లో టీంవ్యూయర్, ఎనీడెస్క్ వంటి సాఫ్ట్‌వేర్ లోడ్ అవుతుంది. ఆ క్షణం నుంచి ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లినట్లే. కేవైసీ అప్‌డేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ముందు డెబిట్, క్రెడిట్‌కార్డు నంబర్లతోపాటు వెనుక ఉండే సీవీవీ నంబర్ ఎంటర్ చేయమంటారు. ఇంట్లో ఉన్న వాళ్ల అందరి ఫోన్ నంబర్లు, కార్డుల వివరాలూ ఇలానే నమోదు చేయిస్తారు. దీంతో నంబర్ల వివరాలే కాదు వాటికి వచ్చే ఓటీపీ వివరాలూ నేరగాళ్ళకు కనిపిస్తుంటాయి. వాటి ఆధారంగా అప్పటికప్పుడు ఏదో ఒక ఈ-కామర్స్ సైట్ ద్వారా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసి వీరిని ముంచేస్తారు.
జాగ్రత్తలు
- ఏ బ్యాంకూ ఆన్‌లైన్లో కేవైసీ వివరాలు అడగదు.
- కేవైసీ వివరాల నమోదుకు డెబిట్, క్రెడిట్‌కార్డు వివరాలు అవసరం లేదు.
- అసలు సీవీవీ నంబరు ఏ బ్యాంకూ అడగదు.
- అపరిచితులు పంపించే లింక్ ఏదీ తెరవకూడదు.
ఓఎల్‌ఎక్స్‌లో...
ఓఎల్‌ఎక్స్‌లో వస్తున్న ప్రకటనలను నేరగాళ్లు జాగ్రత్తగా గమనిస్తుంటారు. ఉదాహరణకు ద్విచక్రవాహనం అమ్ముతామని ఎవరైనా ప్రకటన పెట్టగానే సైబర్ నేరగాళ్లు సదరు వ్యక్తికి ఫోన్ చేస్తారు. వాహనం కొంటామంటారు. వాహనం ఆర్సీ, యజమాని ఆధార్‌కార్డు వంటివి పంపమంటారు. ఆ తర్వాత కొంత డబ్బు ఉదాహరణకు రూ.30వేలు వాలెట్ ద్వారా పంపుతున్నానంటూ నేరగాడు ఒక క్యూఆర్ కోడ్ పంపుతాడు. దీన్ని తెరవగానే డబ్బు జమ అవుతుందని నమ్మబలుకుతాడు. వాహనం అమ్మకందారు ఈ క్యూఆర్‌కోడ్ తెరవగానే అతని ఫోన్లో ఉన్న యూపీఐ యాప్ ద్వారా రూ.30 వేలు సైబర్ నేరగాడి యాప్‌లో జమ అవుతాయన్నమాట.
- వాహనం తాలూకూ ఆర్సీ, ఆధార్‌కార్డు వివరాలు దొరికాయి కాబట్టి మరో మోసానికి తెరలేపుతాడు. ఏదో ఒక వాహనం ఫొటో ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి తక్కువ ధరకు అమ్మేస్తానని ప్రకటన ఇస్తాడు. ఎవరైనా సంప్రదిస్తే అప్పటికే కొట్టేసిన ఆర్సీ చూపించి బురిడీ కొట్టిస్తాడు.
- ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి వాహనం కొనుగోలుకు రూ.40వేలకు ఒప్పందం కుదుర్చుకొని రూ.65వేలు చెల్లించి మోసపోయాడు.
జాగ్రత్తలు
- ఓఎల్‌ఎక్స్‌తోపాటు ఆన్‌లైన్‌లో వాడిన వస్తువులు అమ్మే ప్రకటనలను చూసి వెంటనే తొందరపడవద్దు.
- ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇలాంటి ప్రకటనలను అసలు నమ్మవద్దు.
- వస్తువు చేతికి అందకుండా ఎట్టిపరిసితుల్లోనూ పైసా చెల్లించకూడదు.
- అలానే వస్తువు అమ్ముకునేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.