రంగారెడ్డి చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై బోర్‌వెల్ వాహనం-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.
హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. హైదరాబాదులోని తాడ్‌బండ్‌కు చెందిన ఒకే కుటుంబంలోని 11 మంది కర్ణాటకలోని గుర్మిత్‌కల్‌కు తెల్లవారుజామున బయల్దేరారు. చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వీరు ప్రయాణిస్తున్న కారు.. ముందుగా వెళ్తున్న వాహనాలను ఓవర్‌టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్‌వెల్ లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఆరుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
అతివేగం..
అతివేగంగా వెళ్లడం, పొగమంచు కూడా కావడంతో పట్టు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. టైరు కూడా ఊడి గాలిలో ఎగిరి వాహనంలోకి దూసుకొచ్చిందంటే కారు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ఊహించుకోవచ్చు.