ఒకప్పుడు ఏసీబీ దాడుల్లో దొరికిపోయిన అవినీతి అధికారి ఇంటిని సోదా చేస్తే.. లక్షల్లో మాత్రమే అవినీతి సొమ్ము దొరికేది. కానీ.. ఇప్పుడు పరిస్థితి వేరు. రెవెన్యూఅధికారుల లంచాల దాహాం.. లక్షలు దాటి కోట్ల రూపాయలకు చేరింది. ఏ అవినీతి అధికారి లంచాల లెక్కలు చూసినా.. నోట్ల కట్టలు కోట్లు దాటుతున్నాయి. రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం దగ్గర్నుంచి.. సోదాలు చేసే వరకు.. వ్యవహారమంతా కోట్లలో ఉండడం గమనార్హం. ఒక్కో కేసు.. ఒక్కో రికార్డును సృష్టిస్తూ.. అవినీతి రికార్డులు తిరగరాస్తోంది.
పదేళ్ల క్రితం తక్కువే..
తెలంగాణలో .. అధిక మొత్తంలో లంచాలు తీసుకుంటూ.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి చర్చనీయాంశమైన కేసులు చాలానే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో గతేడాది.. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ.. వీఆర్వో అంతయ్య అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. విచారణలో భాగంగా అప్పటి తహశీల్దార్ లావణ్య పేరు బయటపడింది. ఏసీబీ అధికారులు హయత్‌నగర్‌లోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా.. రూ.93 లక్షల నగదు.. 40 తులాల బంగారం బయటపడింది. అవినీతి నిరోధక శాఖ సోదాల్లో అంత పెద్ద ఎత్తున నగదు దొరకడం అదే తొలిసారి కావడం వల్ల అటు అధికారులతో పాటు.. సామాన్య ప్రజలు కూడా నోళ్లు వెళ్లబెట్టారు.
అవినీతి తిమింగలం నాగరాజు..
ఇటీవలి కాలంలో అనిశా అధికారుల గాలానికి చిక్కన మరో అవినీతి చేప.. కీసర తహశీల్దారు నాగరాజు చేతివాటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భూవివాదంలో స్థిరాస్థి వ్యాపారుల నుంచి ఏకంగా.. రూ.1.1 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం కలకలం రేపింది. బయటపడిన లంచాల వ్యవహారం కోటి మార్కును దాటడం అదే తొలిసారి. అనిశా చరిత్రలోనే రికార్డుగా నమోదైంది. 2010 నుంచి లక్ష రూపాయల నుంచి ఆ పైన లంచాలు తీసుకుంటూ చిక్కిన అధికారులు 15 మంది ఉన్నారు. వారంతా కలిపి తీసుకున్న లంచం రూ.48 లక్షలే. కానీ.. కీసర తహశీల్దార్ నాగరాజు ఒక్కడే అంతకంటే రెట్టింపు సొమ్ము తీసుకున్నాడు. అన్ని కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు.. అనిశా అధికారులు దాడులు చేస్తారు. కానీ.. ఈ కేసులు అనిశా మాటు వేసి నాగరాజును పట్టుకున్నారు. అనిశా చరిత్రలో ఇది కూడా ఓ అరుదైన ఘటనే.
పెరుగుతున్న లంచావతారాలు..
వందల కోట్ల రూపాయల బీమా సద్య సేవల విభాగం కుంభకోణంలో మరో చిత్రం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు దేవికారాణి. సహనిందితురాలు నాగలక్ష్మి అక్రమంగా కాజేసిన సొమ్మును స్థిరాస్తి కొనుగోలు కోసం వ్యాపారికి ముట్టజెప్పారు. కుంభకోణం బయటపడడంతో సదరు స్థిరాస్తి వ్యాపారే ముందుకొచ్చి ఆ లావాదేవీ గురించి అనిశాకు సమాచారం అందించడం గమనార్హం. దీంతో అనిశా అధికారులు గత వారం 4.4 కోట్ల రూపాయలు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణి చెక్కు రూపంలో స్థిరాస్తి వ్యాపారికి అందజేసిన మరో 2 కోట్లకు పైగా సొమ్ము స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా కేసు దర్యాప్తులో ఉండగానే వేర్వేరు వ్యక్తుల వద్ద అక్రమాధికారులు దాచిన కోట్ల సొమ్మును జప్తు చేయడం అనిశా చరిత్రలో ఓ రికార్డు. అనిశా వలకు చిక్కే వారిలో సాధారణంగా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందే ఎక్కువగా ఉంటారు. లంచాల మేత మేసేది ఉన్నతాధికారులే అయినా... వారి తరపున సొమ్ము నేరుగా తీసుకుంటూ చిక్కేది మాత్రం వీరే. అయితే ఓ అదనపు జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి అనిశాకు నేరుగా చిక్కడం సంచలనం రేపింది. మెదక్ అదనపు కలెక్టర్ ఏకంగా రూ.1.12 కోట్లు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి దొరకడం తీవ్ర చర్చనీయాంశమైంది. గత అయిదేళ్ల కాలంలో రెవెన్యూ శాఖపై అనిశాలో 114 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:ఇంట్లో ఉంటే వైద్యం అందదంతే!