దారి దోపిడీలు, గంజాయి, మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే ముఠాలను ప్రకాశం జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా సింగరాయికొండ సర్కిల్ పరిధిలో రాత్రి పూట లారీ డ్రైవర్లను బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బు, నగలు, మొబైల్ ఫోన్లతో పాటు.. లారీల్లోని సరకునూ దోపిడీ చేస్తున్న ముఠాపై వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రహదారులపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ - ప్రకాశంజిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్
రహదారిపై రాత్రి సమయంలో లారీ చోదకులను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఓ చిన్న చోరీ కేసును దర్యాప్తు చేస్తుండగా ఈ ముఠా పట్టుపడటం విశేషం.
ఈ నెల 7న జాతీయ రహదారిపై నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వేరు వేరు ప్రాంతాల్లో మూడు చోట్ల దారి దోపిడీ జరిగిట్లు ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ప్రకాశం జిల్లా పోలీసులు.. టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి ఓ కారు గుర్తించారు. అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి.. వాళ్లపై నిఘా పెట్టారు.
ఫోన్ల సిగ్నల్ ఆధారంగా...
దొంగిలించిన ఫోన్ల సిగ్నల్ ఆధారంగా వారిని పట్టుకున్నారు. వీరంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారే. మొండి నవీన్, ఆతాపాకం అజిత్, అబీబుల్ మహమ్మద్, ఙ్ఞానేశ్ రెడ్డి, వేమనబోయిన సాయి సందీప్ ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి కారు, రూ. 5 వేల నగదు, కత్తి, 7 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.