ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

మహేష్ హత్య కేసులో కాల్పుల సూత్రధారి ఎవరు..? - మహేష్ హత్య కేసు వార్తలు

విజయవాడ పోలీసు కమిషనరేట్‌ ఉద్యోగి మహేష్‌ హత్యపై పోలీసులు....ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడే పథకం రూపొందించాడా? ఆర్థిక లావాదేవీలేమైనా కారణమా అనే కోణంలో....శోధన సాగిస్తున్నారు. ప్రాథమిక ఆధారాల్ని బట్టి దీన్ని"మర్డర్ ఫర్‌ గెయిన్"‌ గా పోలీసులు అనుమానిస్తున్నారు.

mahesh murder
mahesh murder

By

Published : Oct 13, 2020, 4:44 AM IST

Updated : Oct 13, 2020, 7:05 AM IST

విజయవాడలో కాల్పుల కలకలంపై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. మహేష్‌ హత్య వెనుక స్నేహితుడు ఉన్నాడా..? అతనే పథకం రూపొందించాడా? అనుమానం రాకుండా తనపై కూడా కాల్పులు జరిపించుకున్నాడా...? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మహేష్‌ ప్రేమ వ్యవహారం గిట్టని వారెవరైనా దాడికి తెగబడ్డారా ? ఆర్థిక లావాదేవీలతో పాటు మరేమైనా ఇతర కారణాలేమైనా ఉన్నాయోమో అనే అనుమానంతో విభిన్న కోణాల్లో శోధిస్తున్నారు. ప్రాథమికంగా లభించిన ఆధారాల్ని బట్టి దీన్ని "మర్డర్ ఫర్‌ గెయిన్‌"గా అనుమానిస్తున్న పోలీసులు...కిరాయి ముఠాతోనే హత్య చేయించుంటారని భావిస్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నట్లు ఈ ఘటనలో ఇద్దరే పాల్గొన్నారా ? వారికి సహకరించిన వారెవరైనా ఉన్నారా ? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు. మహేష్‌ గొంతు, చాతీ మధ్య భాగంలో గురి చూసి తూటాలు దించటతో అతనే లక్ష్యంగా పక్కా ప్రణాళిక వేసుకునే ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు.

ముందుగానే రెక్కీ...!

నిందితులు ముస్తాబాద్‌రోడ్‌లో కారు వదిలి వెళ్లేటప్పుడు సీసీ కెమెరాల్లో చిక్కిన ఇద్దరు అనుమానితుల చిత్రాల్ని పోలీసులు సేకరించారు. అయితే ఆ ఇద్దరు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. ఆ విషయంలో స్పష్టత వస్తే కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. కారు వదిలేసిన హంతకులు అక్కడినుంచి ఎక్కడికి వెళ్లారు? ఎలా వెళ్లారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఏమైనా దృశ్యాలు నిక్షిప్తమయ్యాయా అని పరిశీలిస్తున్నారు. హత్య చేసిన తర్వాత ఎటువైపు పారిపోతే పట్టుబడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందనే దానిపై హంతకులు ముందే రెక్కీ నిర్వహించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చాకచక్యంగా తప్పించుకున్న నిందితులకు ఈ ప్రాంతం పైనా పూర్తి పట్టు ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. ముస్తాబాద్‌ రోడ్డు నుంచి చీకటిలో నడుచుకుంటూ వెళ్లిన నిందితులు కొంత సమయం తర్వాత వెనక్కు వచ్చి రామవరప్పాడు మీదుగా వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్లిన వాహనాల రాకపోకల్ని పరిశీలిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ సంఘటనా స్థలాన్ని మరోసారి పరిశీలించారు.

కాల్పులు జరిగిన సమయంలో ఘటనాస్థలానికి సమీపంలో ఉన్న టవర్స్‌కు సంబంధించిన సెల్‌టవర్‌ డంపును పోలీసులు విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సైబర్ పోలీసులు ఇప్పటికే ఉన్నతాధికారులకు అందజేసినట్లు సమాచారం. కాల్పులు జరిగిన తర్వాత నుంచి ఆసుపత్రికి వచ్చేవరకూ ఏమేం జరిగాయో ఒక్కో ఘటనను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితులు ఘటనా స్థలానికి ఆటోలో వచ్చినట్లు గుర్తించారు. మహేష్‌, అతని మిత్రబృందంపై అగంతకులు మొత్తం తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపారు. వీటిలో అయిదు రౌండ్లు విఫలమయ్యాయి. మిగతా నాలుగు రౌండ్లకు సంబంధించిన షెల్స్‌ ఘటనా స్థలంలో లభించాయి. మహేష్ స్నేహితులతో పాటు అతని బావమరిదిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తన తమ్ముడికి స్నేహితుడు హరికృష్ణతో విభేదాలున్నాయని మహేష్‌ సోదరి ఆరోపించారు. పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్సు, సీసీఎస్‌, శాంతిభద్రతల విభాగం సిబ్బందితో ఏర్పాటు చేసిన పది ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఇదీ చదవండి
మహేష్ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం

Last Updated : Oct 13, 2020, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details