హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్టేషన్ పరిధిలో కిలోన్నర బంగారు ఆభరణాల సంచి మాయం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 9న ప్రదీప్ అనే సేల్స్‌మెన్ బషీర్ బాగ్‌లోని వీఎస్ జూవెల్లరీస్కి చెందిన కిలోన్నర బంగారు ఆభరణాల సంచిని తీసుకుని జూబ్లిహిల్స్‌లోని కృష్ణా పెరల్స్ అండ్ జూవెలర్స్కి వెళ్లాడు. అక్కడ కొనుగోలుదారుడికి చూపించిన తర్వాత తిరిగి వాటిని తీసుకుని వస్తుండగా భారీ వర్షం పడింది.
నిజంగా బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయా.. ? - బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయనే కేసును విచారిస్తున్న పోలీసులు న్యూస్
నీటి వరదలో బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయి. అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి.. వరద ప్రవాహంతో కిందపడటం వల్ల కింద పడిన బ్యాగు కొట్టుకుపోయింది. బాధితులు గంటల కొద్ది వెతికితే.. బ్యాగు అయితే దొరికింది. కానీ.. అందులో బంగారు నగలు మాత్రం మాయమయ్యాయి. ఇది నిజంగా జరిగిందా.. లేక కట్టుకథ అల్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 3 మీదుగా వెళ్తుండగా వరద ఉద్ధృతి ఎక్కువ ఉన్నందున గుంతలో ద్విచక్ర వాహనం ఇరుక్కుని ప్రదీప్ కిందపడ్డాడు. దీంతో కాళ్ల మధ్యలో పెట్టుకున్న బంగారు నగల సంచి నీటిలో కొట్టుకుపోయింది. తన సోదరుడికి సమాచారం ఇవ్వగా అక్కడకి చేరుకున్న సోదరుడితో కలిసి ప్రదీప్ ఆ వరద నీటిలో వెతికాడు. వీరితో పాటు దుకాణ యజమాని, 15 మంది సిబ్బంది, స్థానికులు రాత్రి 10 గంటల వరకు వెతికారు.
కట్టుకథ అల్లారా..?
కొంతసేపటికి బంగారు నగల సంచి దొరికింది కానీ.. అందులో నగలు కనిపించలేదు. దీంతో దుకాణ యజమాని సందీప్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారు నగలు నిజంగా పోయాయా.. లేక కట్టుకథ అల్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.