ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

బాలింత అనీ చూడలేదు.. హీటర్‌తో కొట్టి చంపాడు.. - మద్యం మత్తులో భార్యని హత్య చేసిన భర్త

ప్రేమించి పెళ్లాడాడు.. నలుగురు పిల్లల తల్లిని చేశాడు.. ప్రేమించినప్పుడు గుర్తుకు రాని కట్నం.. ఆ తరువాత గుర్తుకొచ్చింది. ఆపై అనుమానమూ ఆవహించింది. వేధించడం ప్రారంభమైంది. బాలింత అనీ చూడకుండా మద్యం మత్తులో హీటర్‌తో భార్యను బాదాడు. వద్దు నాన్నా అని కుమార్తె కాళ్లావేళ్లా పడ్డా కరగలేదు. దెబ్బలకు తాళలేని ఆ అభాగ్యురాలు కన్నుమూశాక పరారయ్యాడు. ఈ అమానుష ఘటన బంజారాహిల్స్‌ పోలీసు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

telengana crime news
బాలింత అనీ చూడలేదు.. హీటర్‌తో కొట్టి చంపాడు..

By

Published : Jun 1, 2020, 12:18 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్డు నం.2లోని ఇందిరానగర్‌లో నివసించే రుడావత్‌ అనిల్.. వికారాబాద్‌ జిల్లాకు చెందిన అనితలది ప్రేమ వివాహం. సినిమా సెట్టింగులు, వేదికల అలంకరణ సామగ్రి అద్దెకిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా నెలన్నర క్రితం మరో బాబు పుట్టాడు. కొన్నేళ్లుగా అనిల్‌ కట్నం కోసం వేధిస్తుండడం వల్ల రెండేళ్ల క్రితం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శనివారం రాత్రి పూటుగా మద్యం తాగివచ్చి భార్యతో గొడవకు దిగాడు. హీటర్‌తో విచక్షణారహితంగా కొట్టాడు. అమ్మను కొట్టొద్దు నాన్నా అని పెద్ద కుమార్తె ప్రాథేయపడినా.. కనికరించలేదు. భార్య ప్రాణాలు వదలడంతో పిల్లలను వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నెలన్నర బాబు తల్లిపాల కోసం గుక్కపెట్టి ఏడుస్తుండటం, మిగిలిన ముగ్గురు పిల్లల బేల చూపులు స్థానికుల కళ్లు చెమర్చేలా చేశాయి.

ఇవీ చూడండి:ఆగని కరోనా ఉద్ధృతి.. 62 లక్షలు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details